కర్తవ్యం... ప్రాణప్రదం! | Mumbai traffic cop sujata patil saves Vinod Kambli's life | Sakshi
Sakshi News home page

కర్తవ్యం... ప్రాణప్రదం!

Published Thu, Dec 5 2013 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Mumbai traffic cop sujata patil saves Vinod Kambli's life

పోతున్న ప్రాణాలను కాపాడడానికి ప్రాణాలకంటే కూడా ముందుగా పరుగులు తియ్యాలి. ముంబైలోని మాతుంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతాపాటిల్‌కు ఇలాంటి పరుగు పందేలు మామూలే! కర్తవ్యాన్ని ప్రాణప్రదంగా భావించే సుజాత తాజాగా కాపాడిన ప్రాణం వినోద్ కాంబ్లీది. ఎంత వేగంగా వెళ్లినా, ట్రాఫిక్‌లో కనీసం ఇరవై నిముషాల సమయమైనా పట్టే దారిని కేవలం పదకొండు నిమిషాల్లో దాటేసి కాంబ్లీ ప్రాణాలను కాపాడడంతో సుజాత వార్తల్లోకి వచ్చారు. విధి నిర్వహణకు మానవత్వాన్ని జోడించి, పోయే ప్రాణాలను నిలుపుతున్న సుజాత ప్రొఫైల్... ఈవారం ‘జనహితం’.

ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్‌దత్తశెడ్గే నుంచి ఫోన్ రాగానే ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుజాతాపాటిల్. ఛాతీ పట్టుకుని బాధపడుతున్న క్రికెటర్ వినోద్‌కాంబ్లీని  కారులో వెనక సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్‌ని కానిస్టేబుల్‌కి అప్పగించి కారును రోడ్డెక్కించారు. ఒకచేత్తో వాకీటాకీలో ట్రాఫిక్‌ని పక్కకు జరగమని చెబుతూ, మరో చేత్తో లీలావతి హాస్పిటల్‌కి ఫోన్ చేసి డాక్టర్స్‌ని అలర్ట్ చేశారు.

మామూలుగా అయితే ముంబైలోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి లీలావతి ఆసుపత్రికి వెళ్లడానికి ఇరవై నిమిషాల పైనే పడుతుంది. సుజాతాపాటిల్ ట్రాఫిక్ సిగ్నల్స్‌కి సమాచారం అందిస్తూ అతి తక్కువ సమయంలో ఆసుపత్రికి వెళ్లడం, అప్పటికే డాక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేసి, పేషెంట్‌ని రిసీవ్ చేసుకుని వైద్యం అందించడంతో కాంబ్లీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో సమాచారం అందించిన కానిస్టేబుల్ కుమార్‌దత్త సుజాతాపాటిల్‌లో ఉన్న స్పీడుని చూసి ఆశ్చర్యపోతూ...‘యు ఆర్ గ్రేట్ మేడమ్’ అన్న మాటలకు సుజాతాపాటిల్ చిన్నగా నవ్వి ఊరుకున్నారు.

ఇలాంటి ఛాలెంజింగ్ సంఘటనలు ఆ కానిస్టేబుల్‌కి కొత్తేమోగాని, సుజాతపాటిల్‌కి మాత్రం కాదు. అర్ధరాత్రుళ్లు అపాయంలో ఉన్నవారిని కాపాడటం ఆమెకు  కొత్తకాదు. ఇంతవరకు కాపాడిన ప్రాణాలు సామాన్యులవి కావడంతో ఆ విషయాలు బయటకి రాలేదు. ఇప్పుడు కాంబ్లీ కావడంతో అందరూ ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. ‘శభాష్...’ అన్నారు. ఈ సందర్భంగా సుజాతాపాటిల్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలివి...
 
అన్ని రంగాల్లోను మగవాళ్లతో సమానంగా పోటీపడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. కాని కళ్ల ముందు కాంబ్లీ పరిస్థితి చూసి ముచ్చెమటలు పట్టిన కానిస్టేబుల్ ఒక పురుషుడు. అతనిచ్చిన సమాచారాన్ని తోటి పోలీసులకు చేరవేసి ఊరుకోలేదు... ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయకుండా  సమయస్ఫూర్తితో పదకొండు నిమిషాల్లో  సెలబ్రిటీ పాణాల్ని కాపాడిన వైనాన్ని ఆ కానిస్టేబుల్ ఒక్కడే కాదు... ప్రపంచమంతా ప్రశంసించింది. కారణం... సుజాతాపాటిల్ మహిళ కావడమే.

భయం, ఆందోళన అనేవి మొదట ఆడవారినే ఆవహిస్తాయనే అపోహలో నుంచి వచ్చిన ప్రశంస అది. ‘‘ఈ రంగంలో ఉంటూ భయమనే పదాన్ని తలచుకోకూడదు. నాకు ఇలాంటి ఫోన్‌లు రావడం మామూలే. కాకపోతే ఈసారి నేను ఆసుపత్రికి తీసుకెళ్లింది ఓ పెద్ద సెలబ్రెటీని కావడం వల్ల విషయం అందరికీ తెలిసింది. గుండెపోటు కేసు అనగానే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. నాకు ఫోన్ రాగానే కొంచెం కంగారుపడ్డాను.

ఎంతసేపటి నుంచి కాంబ్లీ ఇబ్బందిపడుతున్నారో... సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలమో లేదోనని కంగారు. మరో పక్క లీలావతిలో నాకు తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసి బయట స్ట్రెచర్ రెడీ చేయించమన్నాను. ఆసుపత్రికి వెళ్లి, ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లిన అరగంట తర్వాత డాక్టర్లు ‘డోంట్‌వర్రీ’ అన్నారు.  అప్పుడు ఊపిరిపీల్చుకున్నాను. అక్కడితో నా డ్యూటీ ముగిసింది. ఇంతలో మా స్టాఫ్ అంతా వచ్చేశారు’’ అని చెబుతుంటే సుజాతాపాటిల్ ముఖంలో ఆనందంతో పాటు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత కూడా స్పష్టంగా కనిపించింది.
 
ఆ హడావుడిలో కూడా...

కిందటేడు విక్రోలిలో అర్ధరాత్రి జరిగిన సంఘటనలో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని కాపాడి డిపార్ట్‌మెంట్‌వారితో స్పెషల్ సెల్యూట్ చేయించుకున్నారు సుజాతాపాటిల్. ‘‘డ్యూటీలో ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్‌కి యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ వచ్చింది. హడావుడిగా జీప్‌లో బయలుదేరాను. సమయం రాత్రి 1:30 అవుతోంది. మాటుంగా ప్రాంతం నుంచి ఠాణే వైపు వెళుతుంటే విక్రోలి దగ్గర రోడ్డు పక్కన మురికి కాలువలో బైక్ పడి ఉండడాన్ని చూశాను. వెంటనే జీప్ ఆపాను. దగ్గరికి వెళ్లి చూస్తే మురికి కాలువలో ఇద్దరు యువకులు పడి ఉన్నారు. నా వెనక బైక్‌పై వస్తున్న కానిస్టేబుల్స్‌ని ఆపి వారి సాయంతో ఆ ఇద్దరు యువకుల్ని బయటికి తీసి జీప్ ఎక్కించాను. ఒకరి చేయి పట్టుకుని చూస్తే నాడి దొరకలేదు. ఒకతను మాత్రం మూలుగుతున్నాడు.
 
ఒకపక్క మా కానిస్టేబుల్ పరిస్థితి ఎలాగుందోనని ఆందోళన, మరోపక్క వీరిద్దరిలో ఒక్కరినైనా ప్రాణాలతో కాపాడగలనా లేదా? అనే ఆలోచన. దగ్గర్లోని ఆసుపత్రికి చేరుకుని ఇద్దరినీ డాక్టర్లకి అప్పగించాను. అప్పటికే ఒక వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. వారిని అక్కడ చేర్పించి మా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లాను. అతనికి కూడా కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. మొత్తానికి ఆ రోజు రాత్రి చాలా టెన్షన్‌గా గడిచింది. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు నా తోటివారి ముందే నాకే ఫోన్ చేస్తారు. కారణం... ఏమీ లేదు... నేను భయపడను, ఎదుటివారిని భయపడనివ్వను. నేను డ్యూటీలో చేరినప్పటి నుంచి ఇలాంటి టెన్షన్ కేసుల్ని చాలా హ్యాండిల్ చేశాను’’ - ఎంతో సులువుగా చెప్పేశారు సుజాతాపాటిల్.
 
ఇంట్లో కూడా...

మహారాష్ర్టలోని కొల్హాపూర్‌లో పాండురంగ్ జరాత్, రుక్మిణి దంపతులకు జన్మించిన సుజాతాపాటిల్ చిన్నతనంలో పేదరికాన్ని, సమాజాన్ని చాలా దగ్గరగా చూశారు. తండ్రి సైకిల్ షాపు నడుపుతూ భార్యాబిడ్డల్ని పోషించడాన్ని ఇప్పటికీ ఎంతో అపురూపంగా గుర్తుచేసుకుంటారామె. ప్రస్తుతం మాతుంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతాపాటిల్ భర్త అబాసాహెబ్ పాటిల్ ఆర్‌టీఓ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు ఆర్సిస్‌పాటిల్ ఫ్రీస్ట్టైల్ ఫుట్‌బాల్‌లో గిన్నిస్ రికార్డ్ సంపాదించాడు.

 ‘‘ఇంటికెళ్లగానే పిల్లల చదువులు, వారి అవసరాలపైకి మనసు మళ్లిపోతుంది. అలాగే పోలీస్ డ్రెస్ వేసుకుని ఇంటి బయట కాలుపెట్టగానే వృత్తికి మించి ఏదీ ముఖ్యం కాదనిపిస్తుంది. చాలా ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చా ను. ఆ ఇష్టాన్ని కొనసాగించినంత కాలం నేను చాలా హ్యాపీగా ఉంటాను. లేనిరోజున చిన్న కేసు కూడా భారంగా అనిపిస్తుంది’’ అని చెప్పారు సుజాతాపాటిల్. అయితే ముంబైలో ఆజాద్ మైదానంలో జరిగిన అల్లర్ల సందర్భంగా సుజాతాపాటిల్ రాసిన ఓ కవిత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కవిత విషయంపై ఆమె వివాదాల్లోకెక్కారు కూడా. చుట్టూ సమాజంలో ఏం జరిగినా వినీవినట్టుగా, చూసీచూడనట్టుగా ఉండే తత్త్వం కాదు ఆమెది. స్పందించడానికి పోలీసే కానక్కర్లేదు... పౌరుడైతే చాలనే ఆమె పిలుపుతో మనం కూడా గొంతు కలుపుదాం. వీలైతే మనం కూడా స్పందించడానికి ప్రయత్నిద్దాం.    
 
- గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement