సాక్షి, హన్మకొండ : వైద్య రంగంలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని ముద్రించిన ఘనత వరంగల్ నగరానికి దక్కింది. నగరానికి చెందిన అనిల్ ప్రపంచంలోనే తొలిసారిగా అంధులు, ప్రత్యేక అవసరాలు కలిగినవారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రెయిలీ లిపిలో ఆయుర్‌జ్యోతి అనే పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నేషనల్ ఆయుర్వేద అకాడమీ ఆధర్యంలో శనివారం నాలుగో తేదీన దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ ఆయుర్వేద, యోగా కాన్ఫరెన్స్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.63కోట్ల మంది అంధులకు ఈ పుస్తకం వల్ల ప్రయోజనం చేకూరనుంది.
ఘనత మనదే
ఆయుర్‌జ్యోతి పుస్తకాన్ని రచించిన పులి అనిల్‌ది నగరంలోని గోపాలపురం. తండ్రి రాజయ్య డీఎస్పీగా పనిచేస్తున్నారు. తల్లి కళావతి గృహిణి. అనిల్ 2004లో అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ కోర్సులో చేరారు. 2011లో ఎండీ కోర్సు చదివేందుకు కర్ణాటకలోని హాసన్ వెళ్లారు. అక్కడున్నప్పుడు అంధ విద్యార్థులకు ఉపయోగపడే అతిపెద్ద లైబ్రరీ మైసూరులో ఉందని తెలిసి దాన్ని చూసేందుకు 2012లో వెళ్లారు. అక్కడ ఆర్థిక శాస్త్రం, గణితం, సాహిత్యం, ఆంగ్లం.. ఇలా అన్ని అంశాలపై బ్రెయిలీ లిపిలో పుస్తకాలున్నాయి. కానీ వైద్యశాస్త్రంపై ఒక్క పుస్తకం కూడా కనిపించలేదు. ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాయోమోనని వెతికి చూశారు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇలా ఏ విభాగంలోనూ బ్రెయిలీ లిపిలో పుస్తకం ఉన్నట్టుగా ఆనవాళ్లు కనిపించలేదు.
ఆరు నెలల్లో పూర్తి
సరళమైన వ్యవహారిక భాషలో ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న విలువైన అంశాలను బ్రెయిలీలిపిలో ఓ పుస్తకం రాసి దాన్ని అందుబాటులోకి తెస్తే అంధులు తమంతట తాముగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే లక్ష్యంతో ఆయుర్‌జ్యోతి పుస్తకం రాయాలని అనిల్ నిర్ణయించుకున్నారు. నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనలు, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలతో 2013లో మేలో పుస్తకం రాయడం మొదలుపెట్టారు. ఆర్నెళ్ల పాటు శ్రమించి పుస్తకాన్ని తొలుత ఆంగ్లంలో ముద్రించారు. ఆ తర్వాత బ్రెయిలీ లిపిలోకి దానిని మార్చి హైదరాబాద్‌లోని సమన్వయి పాఠశాలలోని అంధులతో చదివించారు. వారు చేసిన సూచనల మేరకు మరికొన్ని మార్పులు చేసి తుది పుస్తకాన్ని 2013 డిసెంబర్ నాటికి ముద్రించారు.
సకల సమాచారం
పుణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సన్‌రైజ్ పీపుల్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని బ్రెయిలీ లిపిలో ముద్రించింది. ఇందులో మొత్తం 147 పేజీలున్నాయి. ఆయుర్వేద పరిచయం, దినచర్య, రుతుచర్య, రాత్రిచర్య, షడ్రస, వేగధారణ, సత్‌వృత్తం, ఆహార విహారాలు, విరుద్ధ ఆహారం, ఆయుర్వేద మెథడాలజీ వంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వాషింగ్టన్‌లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్లైండ్, మల్టిపుల్ డిసేబుల్డ్ లైబ్రరీలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న 30కి పైగా గ్రంథాలయాలకు ఈ పుస్తకాన్ని ఉచితంగా అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా అంధుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థలకు కూడా ఈ పుస్తకాన్ని అందివ్వడానికి అనిల్ ముందుకొచ్చారు.
ఒక్కరికి ఉపయోగపడినా చాలు
సాధారణంగా అంధులు ఇతరులతో కలిసి ఉండేది చాలా తక్కువ. వారి నిత్య జీవితంలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు నా ఆయుర్‌జ్యోతి పుస్తకం చక్కని పరిష్కారం చూపిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ పుస్తకం ఒక్క అంధుడికి ఉపయోగపడినా నా శ్రమ ఫలించినట్లే. బ్రెయిలీ లిపిలో పుస్తకం రాస్తున్నానని తెలియగానే ముద్రణా సంస్థలు, ఫార్మా కంపెనీలు స్వచ్ఛందగా ముందుకొచ్చి సహకారం అందించాయి.
- పులి అనిల్, ఆయుర్‌జ్యోతి పుస్తక రచయిత
ఆయుర్‌జ్యోతి.. అనిల్
Published Sat, Jan 4 2014 3:45 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
Advertisement
Advertisement