Ekadashi
-
జీవితాల్ని మార్చే జీవన'గీత'!
అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు, మోదం, ఖేదం తప్పవనీ.. అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవితపాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఇది. రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పుకణిక ఈ గ్రంథం. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహాగ్రంథం భగవద్గీత. మన జీవితాలను మార్చే మహామంత్రం.మార్గశిర శుద్ధ ఏకాదశి రోజుని 'గీతా జయంతి'గా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా.. భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇందులో అన్ని వయసుల వారూ జీవితంలో విజయాలు సాధించడానికి దోహదపడే మార్గదర్శకాలు ఉన్నాయి. నిత్య జీవితాన్ని నడపడానికి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో భగవద్గీతలో ఉన్నాయి.బుద్ధి వికాసానికి...మన జీవన పయనం సాఫీగా సాగాలంటే, ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ‘భగవద్గీత’ అనే క్షీర సాగరంలో మునగాలి’’ అన్నాడు అమెరికన్ రచయిత హెన్రీ డేపిట్ థోరో. ప్రతి శ్లోకాన్నీ పఠించి, అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని చెప్పారు. ఆధునిక విజ్ఞానం జనాన్ని వేగంగా గమ్యాన్ని చేరుకునేలా ఉరకలు పెట్టిస్తుందే తప్ప..కింద పడితే మళ్లీ లేచి పుంజుకోవడం ఎలా అనేది నేర్పించడం లేదు. దీన్ని గీత నేర్పిస్తుంది. ఆరోగ్య గీత...ఆరోగ్యపరంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత ఆరో అధ్యాయం వివరించింది. ఎలాంటి ఆహారం తినాలో పదిహేడో అధ్యాయంలో ఉంది.. ఆహార విషయంలో సయమనం పాటించకపోవడం వల్లే రోగాల పాలవుతున్నామని నొక్కి చెప్పింది. మనసును ఉద్రేకపరచని, రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలమనేది గీతోపదేశం.మనోధైర్యం..శరీరం దృఢంగా ఉన్నా మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్నే భగవద్గీత రెండో అధ్యాయం మూడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహా బలవంతుడు. కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చెయ్యనన్నాడు. కృష్ణుడు అది గమనించి, అర్జునుణ్ణి ఉత్తేజపరచి, అతనిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించి, కార్యోన్ముఖుణ్ణి చేశాడు. వైఫల్యాన్ని అధిగమించాలంటే..ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే, దానికి కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైఫల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సునూ, ఇంద్రియాలనూ తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు. అలా కానినాడు తనకు తానే శత్రువు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అత్యావశ్యకం.దీనికి క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అవసరం. మనసు వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు. ఆధ్యాత్మిక గీత...శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందినా... ఆధ్యాత్మిక వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. పరిపూర్ణత సిద్ధించదు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, భేద బుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పొందాల్సిందే. చైతన్యం కలగాలి. సమదృష్టి పెంపొందాలి. భగవంతుడు ఉన్నాడనీ, అతడే జగన్నాటక సూత్రధారి అనీ గ్రహించాలి. ఇలా భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకున్నట్లయితే(ఆచరిస్తే) ‘జీవనగీత’గా దారి చూపిస్తుంది.(చదవండి: మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..) -
తొలి ఏకాదశి.. ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 17, 2024 -
స్వామి వారి ఉత్తరద్వారం దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
-
తొలి ఏకాదశి ఆలయంలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి వేడుకలు
-
భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు..
-
నేడు తొలి ఏకాదశి.. ఏరు ముందా.. ఏకాశి ముందా?
సాక్షి, ఖమ్మం: ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశి కోసం ఎదురుచూడటం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆదివారం ఏకాదశి పండుగను ప్రజలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. చైతన్యానికి ప్రతీక తొలి ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. భూమిపై రాత్రి సమయం పెరుగుతున్నాయని చెప్పడానికి ఇది సూచిక. ప్రజల్లో నిద్రాసమయం పెరుగుతుంది. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశిగా చెబుతారు. ఏకాదశి అంటే పదకొండు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు అని అర్థం. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలని పండితులు చెబుతుంటారు. తద్వారా మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, వ్యాధులు దరి చేరవని.. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వాసం. పురాణ నేపథ్యం ఇక పురాణ నేపథ్యంలో ఆషాఢమాసం, శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి రోజునే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, రాత్రికి జాగారం చేసి, మరుసటి రోజు ద్వాదశినాడు విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాకే భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు సమసిపోతాయని నమ్ముతారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట! ఏరు ముందా.. ఏకాశి ముందా? వానాకాలంలో ఏకాశి పండుగ సందర్భంగా ఏరు ముందా.. ఏకాశి ముందా? అనే చర్చ రైతుల మధ్య నడుస్తుంటుంది. ఎక్కవగా పల్లెల్లో ఇలాంటి చర్చలు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం గడిచిన కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏకాదశికి ముందుగానే నదులు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఏకాశి ముందుగా ఏరు వచ్చిందని చెప్పవచ్చు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం జరుపుకునే తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని మంత్రి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి పనులకు ఇది విశిష్టం ఈ ఏడాది ముందుగా వచ్చిన ఏరు -
యాదాద్రిలో ఆంతరంగికంగానే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం
► ‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గురువారం ఉదయం 6 గంటల, 49 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ►క్యూలైన్ల ద్వారా భక్తులకు స్వామివారి దర్శనాకి అనుమతిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. ►యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వెండి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహ స్వామి వారు దర్శనమిచ్చారు. ►మాస్క్, బౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో అధికారులు అలంకరించారు. యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట : వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ముస్తాబు చేశారు. ఈ సారి కూడా ముక్కోటి పూజలు అంతరంగికంగానే జరగనున్నాయి. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో శ్రీస్వామి వారికి చేసే పూజల్లో రద్దీ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి క్యూలైన్లలో వెళ్లే విధంగా యాదాద్రి, పాతగుట్ట ఆలయాల్లో వీలు కల్పించారు. బాలాలయంలో లక్ష్మీనరసింహుడి వైకుంఠద్వార దర్శనానికి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో సరిపడా పులిహోర, లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. పాతగుట్ట ఆలయం వద్ద కూడా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. యాదాద్రీశుడి బాలాలయంలో గురువారం నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. అలంకార సేవలు ఇవే.. బాలాలయంలో నిర్వహించే అధ్యయనోత్సవాల్లో శ్రీస్వామి వారి అలంకార సేవలు నిర్వహిస్తారు. 13న ఉదయం గరుఢ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకార సేవ, సాయంత్రం మత్సా్యయవతారంలో విష్ణుమూర్తి అలంకర సేవ, 14న ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, సాయంత్రం గోవర్ధనగిరిధారి అలంకారం, 15న ఉదయం శ్రీరామావతారం, సాయంత్రం శ్రీవెంకటేశ్వరస్వామి అలంకారం, 16న ఉదయం వెన్న కృష్ణుడు అలంకారం, సాయంత్రం కాళీయవర్ధనుడి అలంకారం, 17న ఉదయం వటపత్రసాయి అలంకారం, సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారం, 18న ఉదయం శ్రీనరసింహస్వామి అలంకారంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. కాగా.. ముక్కోటి ఏకాదశికి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. -
రంగ రంగ వైభవం.. 19 ఏళ్లకు ఓ సారి
‘రంగ.. రంగ’ నామస్మరణతో శ్రీరంగం పులకించింది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): 108 వైష్టవ క్షేత్రాల్లో రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 19 ఏళ్లకు ఓ సారి వైకుంఠ ఏకాదశి వేడుకలు మార్గశిర మాసంలో కాకుండా కార్తిక మాసం ఏకాదశిలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది మనవాళ మహామునుల నియమావళి ప్రకారం తైపూసంలో వార్షిక ఉత్సవాలను సైతం ముగించాల్సి ఉంది. దీంతో కార్తిక మాసంలో అధ్యయన ఉత్సవం వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టం వైకుంఠ ద్వార ప్రవేశం మంగళవారం కనుల పండువగా జరిగింది. బారులు తీరిన భక్తులు సోమవారం నుంచి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం 4.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచారు. మూల స్థానం నుంచి స్వామివారు ప్రత్యేక అలంకరణలో పరమపద మార్గం వైపుగా ముందుకు సాగారు. రంగ .. రంగ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయితే స్వామివారి స్వర్గ ద్వార ప్రవేశం సమయంలో ఆలయ అధికారులు, అర్చకులు మాత్రమే ఉన్నారు. భక్తులను అనుమతించ లేదు. బయట ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటల అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతించారు. అప్పటికే కి.మీ కొద్ది భక్తులు ఆలయ పరిసరాల్లో బారులు తీరారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను అనుమతించారు. -
తిరుమలలో కేసీఆర్, కేఈ కుటుంబ సభ్యులు
సాక్షి, తిరుపతి: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది తిరుమలకు చేరుకోవడంతో రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్డుల్లో కూడా భక్తులు నిండిపోవడంతో మిగతావారిని తిరువీధిలోకి టీటీడీ ఆధికారులు తరలిస్తున్నారు. మంగళవారం వేకువ జామున రెండు గంటలకు వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని, ఉదయం ఐదు గంటల నుంచి సామాన్యలకు దర్శనం ఉంటుందని టీటీడీ ఆధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో తిరుమలలోని చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకు చేరుకున్న ప్రముఖులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. టీఆర్ఎస్ నేత హరీశ్ రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి తదితరులు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తులసీ కల్యాణం
కార్తీక శుద్ధ ఏకాదశికే ఉత్థాన ఏకాదశి అని పేరు. ఉత్థానమంటే లేవడమని అర్థం. నాలుగు మాసాలుగా పాలకడలిపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు ఏకాదశినాడు నిద్రమేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశినాడు శ్రీ మహావిష్ణువుతో తులసీ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ రోజున తులసికోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు. చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవునేతితో దీపాలు పెడతారు. ఈవేళ చేసే గోదానం, పెరుగన్నం దానం చేసినా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. (19, సోమవారం క్షీరాబ్ధి ద్వాదశి) జ్వాలాతోరణం కార్తీక పున్నమి సందర్భంగా శ్రీశైలంతో సహా అన్ని శైవక్షేత్రాలలోనూ జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణ సందర్శనం వల్ల ఆపదలు తొలగుతాయనీ, శుభప్రదమని నమ్మకం. (23, శుక్రవారం కార్తీక పున్నమి) -
వందేళ్ల ఆచారం.. ఇలా చేస్తే..
ఉజ్జయిని : ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు నేలపై పడుకున్నారు. వందల సంఖ్యలో గోవులు వారి మీదుగా వెళ్లాయి. అంతే వారిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. అయినా వారు సంతోషంగా నవ్వారు. అందుకు కారణం ఉంది. అలా గోవులతో తొక్కించుకుంటే తమ భవిష్యత్, ఊరి భవిష్యత్ బావుంటుందని నమ్మకం. ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 100 ఏళ్లుగా ఈ ఆచారం అమలువుతోంది. ఏటా దీపావళి పర్వదినం తర్వాత వచ్చే ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉజ్జయినికి తరలివెళ్తారు. కార్యక్రమంలో పాల్గొనే గోవులకు రంగులు, దండలు వేసి అలంకరిస్తారు. ఈ తంతును తిలకించేందుకూ పెద్ద ఎత్తున ప్రజలు ఉజ్జయినికి వెళ్తుంటారు. -
ఏకాదశి ఉత్సవాల్లో సీఎం దంపతులు
ముంబైః ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు మహరాష్ట్రలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్పవాల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అయన భార్య అమృతా లు పండరపుర విఠల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా పూజకు భక్తులు లక్షల్లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతాలు పండరపుర విఠల్ దేవాలయాన్ని దర్శించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాల్లో తెల్లవారుజామున మహాపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులు విఠలేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో కొలువైన పండరపుర విఠలుని ఏకాదశి దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూ కట్టారు. ఆ విఠలేశ్వరుడు భక్తులందరినీ చల్లగా కాపాడాలని, ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరపుర ఆలయంలో నిర్వహించే 'వారి' ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏకాదశి సందర్భంగా ముంబై 'వడాలా' లోని విఠల్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించేందుకు వేలల్లో భక్తులు తరలివస్తారన్నఉద్దేశ్యంతో ముందుగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్ళించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
దుర్వాసుడి గర్వభంగం
పురానీతి విష్ణుభక్తుడైన అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవాడు. ఒకసారి వ్రత నియమం ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు. మర్నాడు ద్వాదశి రోజు వ్రతాన్ని ముగించుకునేందుకు ఉదయాన్నే శుచిగా నదీ స్నానం ఆచరించి, మధువనానికి వెళ్లి అక్కడ నారాయణుడిని అర్చించుకున్నాడు. బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణదానాలు చేశాడు. తర్వాత తన నివాసానికి చేరుకుని భార్యా సమేతుడై ఉపవాస విరమణకు ఉపక్రమించాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చాడు. అంబరీషుడు ఆయనకు ఎదురేగి లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంలో కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు. ‘మహర్షీ! వ్రతాన్ని ముగించే తరుణాన నా ఇంటిని పావనం చేశారు. మీ రాకతో ధన్యుడినయ్యాను. నా ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించండి’ అని అభ్యర్థించాడు. దుర్వాసుడు సరేనన్నాడు. ముందుగా నదికి వెళ్లి సంధ్యా వందనం కావించుకుని వస్తానన్నాడు. నదికి బయలుదేరిన దుర్వాసుడు ద్వాదశి ఘడియలు ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంకా రాలేదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ద్వాదశి ఘడియలు ముగిసేలోగానే ఉపవాస విరమణ చేయాలి. లేకపోతే వ్రతం నిష్ఫలమవుతుంది. పైగా పాపం కూడా. అలాగని అతిథికి భోజనం పెట్టక ముందే తినడం భావ్యం కాదు. ధర్మసంకటంలో పడ్డాడు అంబరీషుడు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో చెప్పాలని పురోహితులను సలహా అడిగాడు. తులసితీర్థం పుచ్చుకుంటే వ్రతాన్ని ముగించినట్లే అవుతుందని, అందువల్ల తులసితీర్థం పుచ్చుకుని, దుర్వాసుడు వచ్చేంత వరకు భోజనానికి నిరీక్షించమని సలహా ఇచ్చారు. వారి సలహాపై తులసితీర్థం పుచ్చుకున్నాడు అంబరీషుడు. అప్పుడే నది నుంచి వచ్చాడు దుర్వాసుడు. తన రాకకు ముందే తులసితీర్థం పుచ్చుకుని అంబరీషుడు వ్రతాన్ని ముగించుకున్నాడని తెలుసుకుని మండిపడ్డాడు. ‘రాజా! నీవు అధికార ధన మదాంధుడవై అతిథిగా వచ్చిన నన్ను అవమానించావు. నా కోపం ఎలాంటిదో నీకు తెలియదు. ఇప్పుడే నీకు గుణపాఠం చెబుతా’ అంటూ తన జడల నుంచి ఒక వెంట్రుకను తెంచి, అంబరీషుడి వైపు విసిరాడు. ఆ వెంట్రుకలోంచి కృత్యుడనే బ్రహ్మరాక్షసుడు ఆవిర్భవించి, అంబరీషుడిని చంపడానికి దూసుకు రాసాగాడు. అంబరీషుడు ఏ మాత్రం చలించకుండా ధ్యానమగ్నుడై నిలుచున్నాడు. కృత్యుడు అతడి వద్దకు సమీపించగానే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన సుదర్శనచక్రం ఆ రాక్షసుడిని మట్టుపెట్టింది. అంతటితో ఆగకుండా దుర్వాసుడి వెంటపడింది. సుదర్శనచక్రం నుంచి తప్పించుకోవడానికి దుర్వాసుడు ముల్లోకాలకూ పరుగులు తీశాడు. చివరకు శివుడి సలహాపై నేరుగా వైకుంఠానికి చేరుకుని, విష్ణువు పాదాలపై పడ్డాడు. ‘నీ చక్రం బారి నుంచి నన్ను నీవే కాపాడాలి’ అంటూ వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ ‘దుర్వాసా! నేను భక్తపరాధీనుడిని. ఇందులో నేను చేసేదేమీ లేదు. వెళ్లి అంబరీషుడినే శరణు కోరుకో. అతడు నిన్ను క్షమిస్తే నా చక్రం నిన్ను వదిలేస్తుంది’ అన్నాడు. విష్ణువు మాటలతో గర్వం తొలగిన దుర్వాసుడు పరుగు పరుగున అంబరీషుడి వద్దకు వెళ్లాడు. ‘రాజా! భక్తాగ్రేసరుడివైన నీపై తపోగర్వంతో అనవసరంగా ఆగ్రహించాను. క్షమించు’ అని వేడుకున్నాడు. అంబరీషుడు భక్తితో నమస్కరించి సుదర్శనాన్ని వారించడంతో అది తిరిగి విష్ణువును చేరుకుంది. నీతి: ఎంతటి తపోధనులకైనా గర్వం తగదు. గర్వం తలకెక్కితే ఏదో ఒకనాడు భంగపాటు తప్పదు. -
మంచిరోజు.. నామినేషన్ల జోరు
తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రెండు రోజులుగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు చేశారు. మూడోరోజు బుధవారం అన్ని పార్టీల నుంచి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. ఒక్క రోజే 53 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఏకాదశి కావడంతో మంచి రోజుగా భావించి అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి చైర్పర్సన్ రేసులో ఉన్న మాజీ కౌన్సిలర్ అనురాధ 9వ వార్డు (బీసీ మహిళ) నుంచి, తాండూరు రాజకీయ జేఏసీ చైర్మన్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ 25వ వార్డు (బీసీ జనరల్), మాజీ కౌన్సిలర్లు సుభాసింగ్ ఠాగూర్ (టీఆర్ఎస్-27వ వార్డు జనరల్), నరేష్ (31వ వార్డు బీసీ జనరల్-కాంగ్రెస్), శోభారాణి (17వ వార్డు టీఆర్ఎస్ ఎస్సీ మహిళ), పరిమళ (30వ వార్డు జనరల్ మహిళ- టీఆర్ఎస్), నాగమ్మ(17వ వార్డు ఎస్సీ మహిళ-కాంగ్రెస్), ఇర్ఫాన్(11వ వార్డు జనరల్ కాంగ్రెస్), మాజీ కౌన్సిలర్ నరేందర్‌గౌడ్ సతీమణి సింధూజ (టీఆర్ఎస్ 16వ వార్డు బీసీ మహిళ), ఇదే వార్డు నుంచి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి సతీమణి రాధిక, మాజీ కౌన్సిలర్ రాజుగౌడ్ సోదరుడు సుమిత్‌కుమార్‌గౌడ్ (10వ వార్డు జనరల్ టీడీపీ) నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. మాజీ వైస్ చైర్పర్సన్ రత్నమాల భర్త సాయిపూర్ నర్సింహులు (7వ వార్డు జనరల్ టీఆర్ఎస్), వ్యాపారవేత్త సతీమణి కోట్రిక విజయలక్ష్మి, పట్టణ బీజేపీ కార్యదర్శి సతీమణి బంట్వారం లావణ్య, న్యాయవాది బాలి శివకుమార్ తదితర ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 14, టీడీపీ-10, బీజేపీ -6, టీఆర్ఎస్ -13, ఇతరులు 8, స్వతంత్రులు -4 మొత్తం 31 వార్డుల్లోని ఆయా వార్డుల నుంచి 53 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు రెండుసెట్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావడంతో ఒకరి నామినేషన్‌ను అధికారులు స్వీకరించలేదు. నామినేషన్ ఫీజు చెల్లించినప్పటికీ అదే రసీదుపై గురువారం నామినేషన్ స్వీకరిస్తామని చెప్పడంతో సదరు అభ్యర్థి వెళ్లిపోయారు. మూడు రోజుకు నామినేషన్ల సంఖ్య 60కి చేరింది.