నేడు తొలి ఏకాదశి.. ఏరు ముందా.. ఏకాశి ముందా? | Devshayani Ekadashi 2022: Rituals Significance and Mantra | Sakshi
Sakshi News home page

నేడు తొలి ఏకాదశి.. ఏరు ముందా.. ఏకాశి ముందా?

Published Sun, Jul 10 2022 1:09 PM | Last Updated on Sun, Jul 10 2022 3:13 PM

Devshayani Ekadashi 2022: Rituals Significance and Mantra - Sakshi

సాక్షి, ఖమ్మం: ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశి కోసం ఎదురుచూడటం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆదివారం ఏకాదశి పండుగను ప్రజలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. 

చైతన్యానికి ప్రతీక
తొలి ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. భూమిపై రాత్రి సమయం పెరుగుతున్నాయని చెప్పడానికి ఇది సూచిక. ప్రజల్లో నిద్రాసమయం పెరుగుతుంది. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశిగా చెబుతారు. ఏకాదశి అంటే పదకొండు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు అని అర్థం. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలని పండితులు చెబుతుంటారు. తద్వారా మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, వ్యాధులు దరి చేరవని.. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వాసం.

పురాణ నేపథ్యం
ఇక పురాణ నేపథ్యంలో ఆషాఢమాసం, శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి రోజునే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, రాత్రికి జాగారం చేసి, మరుసటి రోజు ద్వాదశినాడు విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాకే భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు సమసిపోతాయని నమ్ముతారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట!

ఏరు ముందా.. ఏకాశి ముందా?
వానాకాలంలో ఏకాశి పండుగ సందర్భంగా ఏరు ముందా.. ఏకాశి ముందా? అనే చర్చ రైతుల మధ్య నడుస్తుంటుంది. ఎక్కవగా పల్లెల్లో ఇలాంటి చర్చలు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం గడిచిన కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏకాదశికి ముందుగానే నదులు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఏకాశి ముందుగా ఏరు వచ్చిందని చెప్పవచ్చు. 

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు ఆదివారం జరుపుకునే తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని మంత్రి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  

   మంచి పనులకు ఇది విశిష్టం
   ఈ ఏడాది ముందుగా వచ్చిన ఏరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement