Eruvaka
-
నేడు తొలి ఏకాదశి.. ఏరు ముందా.. ఏకాశి ముందా?
సాక్షి, ఖమ్మం: ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశి కోసం ఎదురుచూడటం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆదివారం ఏకాదశి పండుగను ప్రజలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. చైతన్యానికి ప్రతీక తొలి ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. భూమిపై రాత్రి సమయం పెరుగుతున్నాయని చెప్పడానికి ఇది సూచిక. ప్రజల్లో నిద్రాసమయం పెరుగుతుంది. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశిగా చెబుతారు. ఏకాదశి అంటే పదకొండు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు అని అర్థం. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలని పండితులు చెబుతుంటారు. తద్వారా మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, వ్యాధులు దరి చేరవని.. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వాసం. పురాణ నేపథ్యం ఇక పురాణ నేపథ్యంలో ఆషాఢమాసం, శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి రోజునే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, రాత్రికి జాగారం చేసి, మరుసటి రోజు ద్వాదశినాడు విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాకే భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు సమసిపోతాయని నమ్ముతారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట! ఏరు ముందా.. ఏకాశి ముందా? వానాకాలంలో ఏకాశి పండుగ సందర్భంగా ఏరు ముందా.. ఏకాశి ముందా? అనే చర్చ రైతుల మధ్య నడుస్తుంటుంది. ఎక్కవగా పల్లెల్లో ఇలాంటి చర్చలు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం గడిచిన కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏకాదశికి ముందుగానే నదులు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఏకాశి ముందుగా ఏరు వచ్చిందని చెప్పవచ్చు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం జరుపుకునే తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని మంత్రి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి పనులకు ఇది విశిష్టం ఈ ఏడాది ముందుగా వచ్చిన ఏరు -
Photo Feature: ఏరువాక సందడి.. మొబైల్ వ్యాక్సినేషన్
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఉపసంహరించడంతో నగరాల్లో వాహనాల రద్దీ పెరిగి మళ్లీ కాలుష్యం ఎక్కువ అవుతోంది. ఏరువాక పున్నమి సందర్భంగా గురువారం అన్నదాతలు సంప్రదాయబద్దంగా పొలం పనులకు శ్రీకారం చుట్టారు. దేవస్నాన్ పూర్ణిమ పర్వదినం సందర్భంగా పూరీలోని జగన్నాథుని ఆలయంలో ఉత్సవమూర్తులకు జలాభిషేకం చేశారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్‌లో మొబైల్ వ్యాక్సినేషన్‌తో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
నేడు ఏరువాక పౌర్ణమి
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి వచ్చేసింది.. తొలకరి పలకరిస్తున్న వేళ.. నేల తల్లి పులకిస్తున్న వేళ.. రైతన్నలు కాడీమేడీ పట్టి.. కుడి, ఎడమల కోడె దూడలు కట్టి.. నాగలి పట్టి పొలాలు దున్నేందుకు సిద్ధమయ్యే రోజిది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు మొదలవుతాయి. రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, పసుపు–కుంకుమతో పశువులను అలంకరించి పొలం పనులు ప్రారంభిస్తుంటారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు శుక్రవారం ఏరువాకకు సిద్ధమయ్యారు. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు) ముందుచూపుతోనే ప్రభుత్వ ప్రోత్సాహం ► రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ► వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసింది. ఎరువులు, పురుగు మందులను రైతు ముంగిట్లోకి తెచ్చేందుకు సంసిద్ధమై రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. పంట రుణాలు మంజూరు చేయించింది. ► గతేడాది 36,15,526 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సారి 39,58,906 హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ► తొలకరి పలకరింపుతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖరీఫ్ ప్రధాన పంటగా సాగు చేసే వేరుశనగను విత్తేందుకు దుక్కుల్ని సిద్ధం చేస్తున్నారు. ► ఈ నెల 10 నుంచి గోదావరి కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నార్లు పోసేందుకు రైతులు సన్నాహాలు ప్రారంభించారు. ► కృష్ణా డెల్టాలో చెరువులు, బావులు కింద నారుమళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ మంచి శకునాలే 4 ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆకాంక్షించారు. 4 కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతంలో మంచి వర్షపాతం నమోదైందని.. మహాబలేశ్వర్‌లో గురువారం ఉదయానికి 212 మి.మీ వర్షం కురిసిందని, ఇది శుభారంభమని తెలిపారు. – అగ్రి మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి రైతులకు మంత్రి కన్నబాబు శుభాకాంక్షలు ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. -
శ్రీమఠంలో సామూహిక సత్యనారాయణ పూజలు
మంత్రాలయం : ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో సామూహిక సత్యనారాయణస్వామి పూజలు గావించారు. శ్రీమఠంలోని గురుసార్వభౌమ కళాప్రదర్శన ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని కొలువు చేశారు. అర్చకుడు కురిడి నాగేష్ అభిషేకాలు, అర్చనలు, హారతులు పట్టి పూజలు కానిచ్చారు. భక్తులు వందలాదిగా పాల్గొని స్వామి పూజలో తరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు జయ, దిగ్విజయ, మూలరాముల పూజలు ఆకట్టుకున్నాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
రైతుల ముఖాల్లో చిరునవ్వులు నిండాలి
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పంచలింగాల( కర్నూలు సీక్యాంప్ ): సకాలంలో వర్షాలు పడి రైతుల ముఖాల్లో చిరునవ్వు నిండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆకాక్షించారు. శుక్రవారం పంచలింగాలలోని మేకల వెంకటేశ్వర్లు పొలంలో పొలం దున్ని ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాంటిస్సోరి స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు ముందుగానే ఏపీని పలకరించాయని, ఆశించిన స్థాయిలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతురథం పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మీ ఇంటికి మీభూమి పథకం ద్వారా రైతుల భూములు వివరాలు ఆన్లైన్లో ఉంచామని పేర్కొన్నారు. గొందిపర్ల, ఈ.తాండ్రపాడు, దేవమాడ వంటి గ్రామాల రైతులకు అన్ని రకాలు సహాయపడడానికి తాను సిద్ధంగా ఉన్నామనిరాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయా ప్రాంతాలను మరో కోనసీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పశుసంపదను పెంచుకుంటే ఆదాయ వనరులు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం సకాలంలో పూర్తి చేస్తుందని చెప్పారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చినా కొనేవాళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని డిప్యూటీ సీఎంను కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు చిరుదాన్యాలను వేయడం అలవర్చుకోవాలని సూచించారు. అంతకముందు మత్స్యశాఖ, పరిశ్రమల శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. సర్పంచ్ అనంతలక్ష్మీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ,జేడీఏ ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు
‘పచ్చ’వల్లి.. - సమష్టి కృషితో ఽసోయా, మొక్కజొన్న సాగు - అనుకూలించిన వర్షాలు - అధికారుల సూచనలతో సస్యరక్షణ - ఏపుగా పెరిగిన పంటలు - ఆనందంలో రైతులు జగదేవ్‌పూర్:సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. నిన్నమొన్నటి వరకు సాగు దండగా అని భావించిన ఇక్కడి రైతులు ఇప్పుడు పండుగేనంటున్నారు. గత ఏడాది వరకు రైతులు తమ ఇష్టానుసారంగానే పంటలు సాగు చేసేవారు. చినుకు పడితే చాలు విత్తన పనులు ప్రారంభించే వారు. ఏటా ఒకే రకమైన పంటలు వేసేవారు. ఓవైపు ప్రకృతి సహకరించక దిగుబడులు రాకపోవడం.. మరో వైపు మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో సతమతమయ్యేవారు. పంట పండితే పండగ, లేకుంటే దండగ అనే వారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాగు దండగా అని భావించిన వారే ఇప్పుడు ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధునిక సాంకేతిక పద్ధతులతో పంటలను సమష్టిగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, సోయాబీన్ పంటలు సాగవుతున్నాయి. పంటలకు అనుకూలంగా వానలు కురువడంతో సీఎం దత్తత గ్రామాలకు పచ్చని కళ వచ్చింది. రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆశాజనకంగానే పంటలు... సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో సాగు చేసిన మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కళకళలాడుతున్నాయి. బిందు సేద్యం కాకుండా వర్షధార పంటలుగానే సాగు చేసిన ప్రస్తుతం ఆ పంటలు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 2,800 ఎకరాల సాగు భూమి ఉండగా, రెండు వందల ఎకరాలకు ఒక జోన్‌గా విభజించారు. మొత్తం 14 జోన్లు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలో 9, నర్సన్నపేటలో 5 జోన్లలో మొక్కజొన్న, సోయాబీన్ సాగు చేశారు. ఎర్రవల్లిలోని 1వ, 5వ జోన్లలో, నర్సన్నపేటలో 6,7వ జోన్లలో సోయాబీన్ వేయగా మిగిలిన జోన్లలో మొత్తం మొక్కజొన్న సాగు చేశారు. తమ భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసిన రైతులంతా సమష్టిగా వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పంట మెలకువలను పాటిస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనలు... ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ఏరువాక కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి, నెటాఫిమ్ అగ్రనమిస్టులు నిత్యం పంటలను పరిశీలిస్తూ రైతులకు పలు సూచనలు ఇవ్వడంతో పంటలు ఏపుగా పెరిగాయి. వర్షాలు కూడా కురవడం అనుకూలించింది. ఎప్పటికప్పుడు రైతులు కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. దీంతో పంటల్లో కలుపు మొక్క కనిపించడం లేదు. ఈ రెండు గ్రామాల్లో ఖరీఫ్‌కు ముందు భూమి లేని నిరుపేదలకు 42 ట్రాక్టర్లు అందించారు. దీంతో వ్యవసాయం పనుల్లో ఇబ్బందులు లేకుండా పోయాయి. విత్తనోత్పత్తిగా సోయాబీన్... సీఎం దత్తత గ్రామాల్లో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ సోయాబీన్ పంటను విత్తనోత్పత్తిగా చేపడుతుంది. రైతులు పండించిన సోయాబీన్‌ను స్వయంగా తెలంగాణ విత్తన సంస్థ వారే కొనుగోలు చేయనున్నారు. సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధులు పంటలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వారంలో రెండుమూడు సార్లు పంటలను పరిశీలిస్తూ పలు సలహాలిస్తున్నారు. మొక్కజొన్న పంట మాత్రం ఈ సారి విత్తనోత్పత్తి లేదు. రెండు గ్రామాల్లో సాగవుతున్న మొక్కజొన్న పంట ఎక్కడ అమ్ముకోవాలన్నా ఇబ్బంది రాకుండా ముందస్తుగానే కావేరి విత్తన సంస్థతో బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. సమష్టి విధానం ఇదే మొదటిసారి అయినందున పండిన మొక్కజొన్న సాధారణ ధాన్యంగానే విక్రయిస్తారు. రబీ నుంచి బిందుసేద్యం ద్వారా పండించే పంటను విత్తనోత్పత్తిగా తీసుకుంటారు. ఆధునిక సాగు... సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించాలన్న సంకల్పంతో ఈ రెండు గ్రామాల్లో సాగునీటి వనరుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలని రైతుకు వందశాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందించారు. రెండు వందల ఎకరాలకొకటి చొప్పున సంపు నిర్మాణం చేపడుతున్నారు. సంపు ద్వారా పంటలకు సాగునీరు అందిస్తారు. పంటలకు ఏకకాలంలో నీరు, ఎరువులు అందించేలా పంటల మధ్యలో నెటాఫిమ్ వారు సైనెట్ వాల్ సిస్టమ్‌ను బిగించారు. దీనివల్ల ఎరువులు, నీరు ఆటోమెటిక్‌గా పంటలకు చేరుకుంటాయి. ఎకరానికి రూ.15 వేల బ్యాంకు రుణం... సీఎం దత్తత గ్రామంలో నాలుగు నెలల క్రితం ఏపీజీవీబీ బ్యాంకును ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ బ్యాంకును ప్రారంభించి ప్రభుత్వం తరుపున అప్పుడే రూ.5 కోట్లను డిపాజిట్ చేశారు. రెండు గ్రామాల రైతులు బ్యాంకులో ఖాతాలు తెరుచుకున్నారు. కొంత మంది రైతులు డిపాజిట్లు కూడా చేశారు. ఈ బ్యాంకు వారు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రుణం అందించారు. వ్యవసాసాయ అధికారులు దగ్గరుండి విత్తనాలు, ఎరువులు మందులు అందజేశారు. మందులు ఇలా... మొక్కజొన్న ఎకరానికి 8 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక్ సంచి, యూరియా మూడు బస్తాలు, పొటాషియం ఒక బస్తా, గడ్డి మందు లీటర్, సోయాబీన్ పంటకైతే ఎకరానికి 30 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక సంచి, యూరియా సంచి, పొటాషియం బస్తా, గడ్డి మందు లీటర్ చొప్పున పంపిణీ చేశారు. పంటలు బాగున్నాయి... నాకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్ సాగు చేసిన. ప్రస్తుతం చేనులు చాలా బాగున్నాయి. ఎకరంలో మొక్కజొన్న, రెండు ఎకరాల్లో సోయాబీన్ పంట చూస్తుంటే గత ఏడాది చేసిన అప్పులు తీరుతాయనిపిస్తుంది. ఎడ్లతో కాకుండా ట్రాక్టర్‌తో విత్తనం వేసిన. మంచిగా మొలిసింది. ఎరువులు, విత్తనాలు, మందులు అధికారులిచ్చారు. మొత్తం రూ.6వేల ఖర్చు వచ్చింది. - లక్ష్మి, రైతు, నర్సన్నపేట పత్తిని మరిచిపోయా... నాకున్న పదిహేను ఎకరాల్లో అధికారుల సూచనల మేరకు మొక్కజొన్న సాగు చేసిన. వర్షాలు అనుకూలించడంతో చేను బాగానే ఉంది. గత ఏడాది పదిహేను ఎకరాల్లో పత్తి పెట్టిన. వర్షాభావంతో పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని మా వ్యవసాయాన్నే మారుస్తుండు. పంటలపై అధికారులు అవగాహన కల్పించిండ్రు. బ్యాంకు రుణం కూడా ఇస్తున్నరు. పెట్టుబడికి ఎలాంటి తిప్పలు లేదు. - కనకయ్య యాదవ్, రైతు, నర్సన్నపేట -
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం
విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. కంచికచర్లలో ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమానికి రైతులు ఎవరూ హాజరు కాకపోవటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రైతులు ఎందుకు రాలేదంటూ ఎమ్మెల్యే సౌమ్య ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు. అయితే వారి వద్ద నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో రైతులు లేని ఏరువాక ఎందుకంటూ ఆమె వెనుతిరిగి వెళ్లిపోయారు. కాగా వర్షాకాలం ప్రారంభం కావటంతో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏరువాక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం కమిటీలు కూడా వేసింది. అయితే చాలా ప్రాంతాల్లో ఏరువాక కార్యక్రమానికి స్పందన కరువైంది. -
చంద్రబాబు ఫోటోలకు ఫోజులివ్వడం కాదు...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు ఏమీ ఒరగదని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఏరువాక పేరుతో ఫోటోలకు ఫోజులివ్వడం కాదని, రైతుల పరిస్థితిని గమనించాలని పార్థసారధి ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. రైతుల జీవితాలు కుదేలైపోయాయని, నిర్దిష్టమైన ప్రణాళిక విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అవసరం అయిన విత్తనాలు ఎప్పుడు అందుబాటులో ఉంచుతారో స్పష్టత ఇవ్వాలన్నారు. చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని పార్ధసారధి విమర్శించారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కేంద్ర సాయంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. అలాగే జిల్లాలో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.