రైతుల ముఖాల్లో చిరునవ్వులు నిండాలి
రైతుల ముఖాల్లో చిరునవ్వులు నిండాలి
Published Fri, Jun 9 2017 10:41 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
పంచలింగాల( కర్నూలు సీక్యాంప్ ): సకాలంలో వర్షాలు పడి రైతుల ముఖాల్లో చిరునవ్వు నిండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆకాక్షించారు. శుక్రవారం పంచలింగాలలోని మేకల వెంకటేశ్వర్లు పొలంలో పొలం దున్ని ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాంటిస్సోరి స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు ముందుగానే ఏపీని పలకరించాయని, ఆశించిన స్థాయిలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతురథం పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మీ ఇంటికి మీభూమి పథకం ద్వారా రైతుల భూములు వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచామని పేర్కొన్నారు. గొందిపర్ల, ఈ.తాండ్రపాడు, దేవమాడ వంటి గ్రామాల రైతులకు అన్ని రకాలు సహాయపడడానికి తాను సిద్ధంగా ఉన్నామనిరాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తెలిపారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయా ప్రాంతాలను మరో కోనసీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పశుసంపదను పెంచుకుంటే ఆదాయ వనరులు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం సకాలంలో పూర్తి చేస్తుందని చెప్పారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చినా కొనేవాళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని డిప్యూటీ సీఎంను కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు చిరుదాన్యాలను వేయడం అలవర్చుకోవాలని సూచించారు. అంతకముందు మత్స్యశాఖ, పరిశ్రమల శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. సర్పంచ్ అనంతలక్ష్మీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ,జేడీఏ ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement