సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు | Chief adoption of green crops in the villages | Sakshi
Sakshi News home page

సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు

Published Mon, Aug 8 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు

సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు

‘పచ్చ’వల్లి..

  • - సమష్టి కృషితో ఽసోయా, మొక్కజొన్న సాగు
  • - అనుకూలించిన వర్షాలు
  • - అధికారుల సూచనలతో సస్యరక్షణ
  • - ఏపుగా పెరిగిన పంటలు
  • - ఆనందంలో రైతులు
  • జగదేవ్‌పూర్‌:సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. నిన్నమొన్నటి వరకు సాగు దండగా అని భావించిన ఇక్కడి రైతులు ఇప్పుడు పండుగేనంటున్నారు. గత ఏడాది వరకు రైతులు తమ ఇష్టానుసారంగానే పంటలు సాగు చేసేవారు. చినుకు పడితే చాలు విత్తన పనులు ప్రారంభించే వారు. ఏటా ఒకే రకమైన పంటలు వేసేవారు. ఓవైపు ప్రకృతి సహకరించక దిగుబడులు రాకపోవడం.. మరో వైపు మార్కెట్‌లో మద్దతు ధర లభించకపోవడంతో సతమతమయ్యేవారు. పంట పండితే పండగ, లేకుంటే దండగ అనే వారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాగు దండగా అని భావించిన వారే ఇప్పుడు ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధునిక సాంకేతిక పద్ధతులతో పంటలను సమష్టిగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలు సాగవుతున్నాయి. పంటలకు అనుకూలంగా వానలు కురువడంతో సీఎం దత్తత గ్రామాలకు పచ్చని కళ వచ్చింది. రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఆశాజనకంగానే పంటలు...
సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో సాగు చేసిన మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలు కళకళలాడుతున్నాయి. బిందు సేద్యం కాకుండా వర్షధార పంటలుగానే సాగు చేసిన ప్రస్తుతం ఆ పంటలు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 2,800 ఎకరాల సాగు భూమి ఉండగా, రెండు వందల ఎకరాలకు ఒక జోన్‌గా విభజించారు.

మొత్తం 14 జోన్‌లు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలో 9, నర్సన్నపేటలో 5 జోన్లలో మొక్కజొన్న, సోయాబీన్‌ సాగు చేశారు. ఎర్రవల్లిలోని 1వ, 5వ జోన్లలో, నర్సన్నపేటలో 6,7వ జోన్లలో సోయాబీన్‌ వేయగా మిగిలిన జోన్లలో మొత్తం మొక్కజొన్న సాగు చేశారు. తమ భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసిన రైతులంతా సమష్టిగా వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పంట మెలకువలను పాటిస్తున్నారు.
శాస్త్రవేత్తల సూచనలు...
ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ ఏరువాక కేంద్ర సీనియర్‌ శాస్త్రవేత్త ఉమారెడ్డి, నెటాఫిమ్‌ అగ్రనమిస్టులు నిత్యం పంటలను పరిశీలిస్తూ రైతులకు పలు సూచనలు ఇవ్వడంతో పంటలు ఏపుగా పెరిగాయి. వర్షాలు కూడా కురవడం అనుకూలించింది. ఎప్పటికప్పుడు రైతులు కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. దీంతో పంటల్లో కలుపు మొక్క కనిపించడం లేదు. ఈ రెండు గ్రామాల్లో ఖరీఫ్‌కు ముందు భూమి లేని నిరుపేదలకు 42 ట్రాక్టర్లు అందించారు. దీంతో వ్యవసాయం పనుల్లో ఇబ్బందులు లేకుండా పోయాయి.
విత్తనోత్పత్తిగా సోయాబీన్‌...
సీఎం దత్తత గ్రామాల్లో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌ సోయాబీన్‌ పంటను విత్తనోత్పత్తిగా చేపడుతుంది. రైతులు పండించిన సోయాబీన్‌ను స్వయంగా తెలంగాణ విత్తన సంస్థ వారే కొనుగోలు చేయనున్నారు. సీడ్స్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు పంటలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వరంగల్‌ ఏరువాక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త వారంలో రెండుమూడు సార్లు పంటలను పరిశీలిస్తూ పలు సలహాలిస్తున్నారు. మొక్కజొన్న పంట మాత్రం ఈ సారి విత్తనోత్పత్తి లేదు. రెండు గ్రామాల్లో సాగవుతున్న మొక్కజొన్న పంట ఎక్కడ అమ్ముకోవాలన్నా ఇబ్బంది రాకుండా ముందస్తుగానే కావేరి విత్తన సంస్థతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకున్నారు. సమష్టి విధానం ఇదే మొదటిసారి అయినందున పండిన మొక్కజొన్న సాధారణ ధాన్యంగానే విక్రయిస్తారు. రబీ నుంచి బిందుసేద్యం ద్వారా పండించే పంటను విత్తనోత్పత్తిగా తీసుకుంటారు.

ఆధునిక సాగు...
సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించాలన్న సంకల్పంతో ఈ రెండు గ్రామాల్లో సాగునీటి వనరుల నిర్మాణ పనులు  చేపడుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలని రైతుకు వందశాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందించారు. రెండు వందల ఎకరాలకొకటి చొప్పున సంపు నిర్మాణం చేపడుతున్నారు. సంపు ద్వారా పంటలకు సాగునీరు అందిస్తారు. పంటలకు ఏకకాలంలో నీరు, ఎరువులు అందించేలా  పంటల మధ్యలో నెటాఫిమ్‌ వారు సైనెట్‌ వాల్‌ సిస్టమ్‌ను బిగించారు. దీనివల్ల ఎరువులు, నీరు ఆటోమెటిక్‌గా పంటలకు చేరుకుంటాయి.
ఎకరానికి రూ.15 వేల బ్యాంకు రుణం...
సీఎం దత్తత గ్రామంలో నాలుగు నెలల క్రితం ఏపీజీవీబీ బ్యాంకును ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ బ్యాంకును ప్రారంభించి ప్రభుత్వం తరుపున అప్పుడే రూ.5 కోట్లను డిపాజిట్‌ చేశారు. రెండు గ్రామాల రైతులు బ్యాంకులో ఖాతాలు తెరుచుకున్నారు. కొంత మంది రైతులు డిపాజిట్లు కూడా చేశారు. ఈ బ్యాంకు వారు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రుణం అందించారు. వ్యవసాసాయ అధికారులు దగ్గరుండి విత్తనాలు, ఎరువులు మందులు అందజేశారు.
మందులు ఇలా...
మొక్కజొన్న ఎకరానికి 8 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక్ సంచి, యూరియా మూడు బస్తాలు, పొటాషియం ఒక బస్తా, గడ్డి మందు లీటర్, సోయాబీన్‌ పంటకైతే ఎకరానికి 30 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక సంచి, యూరియా  సంచి, పొటాషియం బస్తా, గడ్డి మందు లీటర్‌ చొప్పున పంపిణీ చేశారు.

పంటలు బాగున్నాయి...
నాకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్‌ సాగు చేసిన. ప్రస్తుతం చేనులు చాలా బాగున్నాయి. ఎకరంలో మొక్కజొన్న, రెండు ఎకరాల్లో సోయాబీన్‌ పంట చూస్తుంటే గత ఏడాది చేసిన అప్పులు తీరుతాయనిపిస్తుంది. ఎడ్లతో కాకుండా ట్రాక్టర్‌తో విత్తనం వేసిన. మంచిగా మొలిసింది. ఎరువులు, విత్తనాలు, మందులు అధికారులిచ్చారు. మొత్తం రూ.6వేల ఖర్చు వచ్చింది.
- లక్ష్మి, రైతు, నర్సన్నపేట

పత్తిని మరిచిపోయా...
నాకున్న పదిహేను ఎకరాల్లో అధికారుల సూచనల మేరకు మొక్కజొన్న సాగు చేసిన. వర్షాలు అనుకూలించడంతో చేను బాగానే ఉంది. గత ఏడాది పదిహేను ఎకరాల్లో పత్తి పెట్టిన. వర్షాభావంతో పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకుని మా వ్యవసాయాన్నే  మారుస్తుండు. పంటలపై అధికారులు అవగాహన కల్పించిండ్రు. బ్యాంకు రుణం కూడా ఇస్తున్నరు. పెట్టుబడికి ఎలాంటి తిప్పలు లేదు.
- కనకయ్య యాదవ్‌, రైతు, నర్సన్నపేట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement