తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రెండు రోజులుగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు చేశారు. మూడోరోజు బుధవారం అన్ని పార్టీల నుంచి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. ఒక్క రోజే 53 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఏకాదశి కావడంతో మంచి రోజుగా భావించి అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లను దాఖలు చేశారు.
కాంగ్రెస్ నుంచి చైర్‌పర్సన్ రేసులో ఉన్న మాజీ కౌన్సిలర్ అనురాధ 9వ వార్డు (బీసీ మహిళ) నుంచి, తాండూరు రాజకీయ జేఏసీ చైర్మన్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ 25వ వార్డు (బీసీ జనరల్), మాజీ కౌన్సిలర్లు సుభాసింగ్ ఠాగూర్ (టీఆర్‌ఎస్-27వ వార్డు జనరల్), నరేష్ (31వ వార్డు బీసీ జనరల్-కాంగ్రెస్), శోభారాణి (17వ వార్డు టీఆర్‌ఎస్ ఎస్సీ మహిళ), పరిమళ (30వ వార్డు జనరల్ మహిళ- టీఆర్‌ఎస్), నాగమ్మ(17వ వార్డు ఎస్సీ మహిళ-కాంగ్రెస్), ఇర్ఫాన్(11వ వార్డు జనరల్ కాంగ్రెస్), మాజీ కౌన్సిలర్ నరేందర్‌గౌడ్ సతీమణి సింధూజ (టీఆర్‌ఎస్ 16వ వార్డు బీసీ మహిళ), ఇదే వార్డు నుంచి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి సతీమణి రాధిక, మాజీ కౌన్సిలర్ రాజుగౌడ్ సోదరుడు సుమిత్‌కుమార్‌గౌడ్ (10వ వార్డు జనరల్ టీడీపీ) నుంచి నామినేషన్లను దాఖలు చేశారు.
మాజీ వైస్ చైర్‌పర్సన్ రత్నమాల భర్త సాయిపూర్ నర్సింహులు (7వ వార్డు జనరల్ టీఆర్‌ఎస్), వ్యాపారవేత్త సతీమణి కోట్రిక విజయలక్ష్మి, పట్టణ బీజేపీ కార్యదర్శి సతీమణి బంట్వారం లావణ్య, న్యాయవాది బాలి శివకుమార్ తదితర ప్రముఖులు నామినేషన్‌లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 14, టీడీపీ-10, బీజేపీ -6, టీఆర్‌ఎస్ -13, ఇతరులు 8, స్వతంత్రులు -4 మొత్తం 31 వార్డుల్లోని ఆయా వార్డుల నుంచి 53 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు రెండుసెట్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావడంతో ఒకరి నామినేషన్‌ను అధికారులు స్వీకరించలేదు. నామినేషన్ ఫీజు చెల్లించినప్పటికీ అదే రసీదుపై గురువారం నామినేషన్ స్వీకరిస్తామని చెప్పడంతో సదరు అభ్యర్థి వెళ్లిపోయారు. మూడు రోజుకు నామినేషన్ల సంఖ్య 60కి చేరింది.
మంచిరోజు.. నామినేషన్ల జోరు
Published Wed, Mar 12 2014 11:06 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement