బారులు తీరిన భక్తులు, (ఇన్‌సెట్) పల్లకిపై రంగనాథస్వామి
‘రంగ.. రంగ’ నామస్మరణతో శ్రీరంగం పులకించింది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.
సాక్షి, చెన్నై(తమిళనాడు): 108 వైష్టవ క్షేత్రాల్లో రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 19 ఏళ్లకు ఓ సారి వైకుంఠ ఏకాదశి వేడుకలు మార్గశిర మాసంలో కాకుండా కార్తిక మాసం ఏకాదశిలో నిర్వహించడం ఆనవాయితీ.
ఈ ఏడాది మనవాళ మహామునుల నియమావళి ప్రకారం తైపూసంలో వార్షిక ఉత్సవాలను సైతం ముగించాల్సి ఉంది. దీంతో కార్తిక మాసంలో అధ్యయన ఉత్సవం వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టం వైకుంఠ ద్వార ప్రవేశం మంగళవారం కనుల పండువగా జరిగింది.
బారులు తీరిన భక్తులు
సోమవారం నుంచి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం 4.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచారు. మూల స్థానం నుంచి స్వామివారు ప్రత్యేక అలంకరణలో పరమపద మార్గం వైపుగా ముందుకు సాగారు.
రంగ .. రంగ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయితే స్వామివారి స్వర్గ ద్వార ప్రవేశం సమయంలో ఆలయ అధికారులు, అర్చకులు మాత్రమే ఉన్నారు. భక్తులను అనుమతించ లేదు. బయట ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటల అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతించారు. అప్పటికే కి.మీ కొద్ది భక్తులు ఆలయ పరిసరాల్లో బారులు తీరారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment