సాక్షి, చెన్నై(తమిళనాడు): రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసుయంత్రాంగం ప్రకటించింది. దీంతో శనివారం చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. ఇక రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేలకు అటుఇటుగా.. కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.
అలాగే ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఆదివారం లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు. దీంతో శనివారం మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్‌లలో రద్దీ నెలకొంది.
లక్ష మందికి రెండో డోస్...
18వ విడతగా రాష్ట్రంలో శనివారం వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. 50 వేల శిబిరాల్లో లక్షలాది మందికి రెండో డోస్ టీకా వేశారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్లలోపు బాల, బాలికలకు సైతం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక, చెన్నై విమానాశ్రయంలో కరోనా, ఫీవర్ టెస్టులు విస్తృతం చేయడం కోసం ప్రత్యేకంగా కొత్త ఏర్పాట్లు జరిగాయి. చెన్నైలో మాస్క్ ధరించని 7,616 మందికి జరిమానా విధించి రూ. 15 లక్షలు జరిమానా వసూలు చేశారు.
తమిళనాడులో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అవసరం రాదని.. కరోనా ప్రజల జీవితంలో కలిసి పయనిస్తుందని శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇక, చెన్నైలో కరోనా కట్టడి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేయడం కోసం 15 మంది ఐఏఎస్‌లతోప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే చెన్నైలో ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళల్లో రెండు డోస్‌ల టీకా వేయించుకున్న వారినే సోమవారం నుంచి అనుమతించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment