దుర్వాసుడి గర్వభంగం
పురానీతి
విష్ణుభక్తుడైన అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవాడు. ఒకసారి వ్రత నియమం ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు. మర్నాడు ద్వాదశి రోజు వ్రతాన్ని ముగించుకునేందుకు ఉదయాన్నే శుచిగా నదీ స్నానం ఆచరించి, మధువనానికి వెళ్లి అక్కడ నారాయణుడిని అర్చించుకున్నాడు. బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణదానాలు చేశాడు. తర్వాత తన నివాసానికి చేరుకుని భార్యా సమేతుడై ఉపవాస విరమణకు ఉపక్రమించాడు.
అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చాడు. అంబరీషుడు ఆయనకు ఎదురేగి లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంలో కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.
‘మహర్షీ! వ్రతాన్ని ముగించే తరుణాన నా ఇంటిని పావనం చేశారు. మీ రాకతో ధన్యుడినయ్యాను. నా ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించండి’ అని అభ్యర్థించాడు.
దుర్వాసుడు సరేనన్నాడు. ముందుగా నదికి వెళ్లి సంధ్యా వందనం కావించుకుని వస్తానన్నాడు. నదికి బయలుదేరిన దుర్వాసుడు ద్వాదశి ఘడియలు ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంకా రాలేదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ద్వాదశి ఘడియలు ముగిసేలోగానే ఉపవాస విరమణ చేయాలి. లేకపోతే వ్రతం నిష్ఫలమవుతుంది. పైగా పాపం కూడా. అలాగని అతిథికి భోజనం పెట్టక ముందే తినడం భావ్యం కాదు. ధర్మసంకటంలో పడ్డాడు అంబరీషుడు.
ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో చెప్పాలని పురోహితులను సలహా అడిగాడు. తులసితీర్థం పుచ్చుకుంటే వ్రతాన్ని ముగించినట్లే అవుతుందని, అందువల్ల తులసితీర్థం పుచ్చుకుని, దుర్వాసుడు వచ్చేంత వరకు భోజనానికి నిరీక్షించమని సలహా ఇచ్చారు. వారి సలహాపై తులసితీర్థం పుచ్చుకున్నాడు అంబరీషుడు.
అప్పుడే నది నుంచి వచ్చాడు దుర్వాసుడు. తన రాకకు ముందే తులసితీర్థం పుచ్చుకుని అంబరీషుడు వ్రతాన్ని ముగించుకున్నాడని తెలుసుకుని మండిపడ్డాడు.
‘రాజా! నీవు అధికార ధన మదాంధుడవై అతిథిగా వచ్చిన నన్ను అవమానించావు. నా కోపం ఎలాంటిదో నీకు తెలియదు. ఇప్పుడే నీకు గుణపాఠం చెబుతా’ అంటూ తన జడల నుంచి ఒక వెంట్రుకను తెంచి, అంబరీషుడి వైపు విసిరాడు. ఆ వెంట్రుకలోంచి కృత్యుడనే బ్రహ్మరాక్షసుడు ఆవిర్భవించి, అంబరీషుడిని చంపడానికి దూసుకు రాసాగాడు.
అంబరీషుడు ఏ మాత్రం చలించకుండా ధ్యానమగ్నుడై నిలుచున్నాడు. కృత్యుడు అతడి వద్దకు సమీపించగానే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన సుదర్శనచక్రం ఆ రాక్షసుడిని మట్టుపెట్టింది. అంతటితో ఆగకుండా దుర్వాసుడి వెంటపడింది. సుదర్శనచక్రం నుంచి తప్పించుకోవడానికి దుర్వాసుడు ముల్లోకాలకూ పరుగులు తీశాడు. చివరకు శివుడి సలహాపై నేరుగా వైకుంఠానికి చేరుకుని, విష్ణువు పాదాలపై పడ్డాడు. ‘నీ చక్రం బారి నుంచి నన్ను నీవే కాపాడాలి’ అంటూ వేడుకున్నాడు.
అప్పుడు విష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ ‘దుర్వాసా! నేను భక్తపరాధీనుడిని. ఇందులో నేను చేసేదేమీ లేదు. వెళ్లి అంబరీషుడినే శరణు కోరుకో. అతడు నిన్ను క్షమిస్తే నా చక్రం నిన్ను వదిలేస్తుంది’ అన్నాడు.
విష్ణువు మాటలతో గర్వం తొలగిన దుర్వాసుడు పరుగు పరుగున అంబరీషుడి వద్దకు వెళ్లాడు.
‘రాజా! భక్తాగ్రేసరుడివైన నీపై తపోగర్వంతో అనవసరంగా ఆగ్రహించాను. క్షమించు’ అని వేడుకున్నాడు.
అంబరీషుడు భక్తితో నమస్కరించి సుదర్శనాన్ని వారించడంతో అది తిరిగి విష్ణువును చేరుకుంది.
నీతి: ఎంతటి తపోధనులకైనా గర్వం తగదు. గర్వం తలకెక్కితే ఏదో ఒకనాడు భంగపాటు తప్పదు.