సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కొరియన్ పాప్ సంగీతం(కే–పాప్)కు నగరంలోనూ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో యువత ఆసక్తిని ప్రోత్సహించేందుకు కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా నిర్వహించిన కే–పాప్ సంగీత పోటీల్లో కోల్‌కతాకు చెందిన అభిప్రియ చక్రవర్తి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరం నుంచి పలువురు కే–పాప్ యూత్‌ను ఆకట్టుకున్న ఈ పోటీల్లో డ్యాన్సింగ్ విభాగంలో టైటిల్‌ను ది ట్రెండ్ ఫ్రమ్ ఇటానగర్ ఆల్బమ్ సొంతం చేసుకుందని, విజేతలకు కొరియా ట్రిప్‌ను బహుమతిగా అందించనున్నట్లు వివరించారు.
అలరించిన.. సంగీత్ సమారోహ్
మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్)లో పండిత్ జష్‌రాజ్ 52వ పండిత్ మోతీరాం పండిత్ మనీరాం సంగీత్ సమారోహ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి, మహిమా ఉపాధ్యాయులు పాకవజ డ్యూయోట్‌ను, నటి శోభన భరతనాట్య ప్రదర్శన, అభిషేక్ రఘురాం కర్ణాటక సంగీతంతో ఆకట్టుకున్నారు.
పద్యనాటకం.. నటన అద్భుతం
పురాకృతి దశమ వార్షికోత్సవాలు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. పాదుకా పట్టాభిషేకం, భక్త పోతన, శ్రీకృష్ణ రాయభారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కళాకారుడు ఉప్పలపాడు షేక్ సైదులుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అదే విధంగా ప్రముఖ నటులు మల్లాది గోపాలకృష్ణ, ఇందిరాదేవికు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీహరిరావు, సాంబశివారెడ్డి, షేక్‌లాల్ అహ్మద్, పొత్తూరు సుబ్బారావు, నాగేశ్వర్‌రావు, కళ్యాణ్, మల్లాది వెంకటరమణ, పుట్రేవు పరివారం తదితరులు పాల్గొన్నారు.
భగవద్గీతతో జీవన నిర్వహణ
గీతా సారాంశాన్ని అర్థం చేసుకోవడం, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, మానవ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, సమతుల్యమైన జీవితాన్ని గడపడం వంటి అవసరమైన అంశాలపై ఆధ్యాత్మిక బోధనలను ఆధ్యాత్మిక గురువు సుఖబోధానంద స్వామి వివరించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భగవద్గీతతో జీవన నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment