హైదరాబాద్‌ యూత్‌ను ఫిదా చేస్తున్న ‘కొరియన్‌’ ట్రెండ్‌.. | Korean Trend Increase in Hyderabad Youth Attract To BTS | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ యూత్‌ను ఫిదా చేస్తున్న ‘కొరియన్‌’ ట్రెండ్‌.. బీటీఎస్‌ ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా

Published Mon, May 15 2023 8:21 AM | Last Updated on Mon, May 15 2023 2:32 PM

Korean Trend Increase in Hyderabad Youth Attract To BTS - Sakshi

హైదరాబాద్‌.... మినీ ఇండియాగా ప్రసిద్ధి. అనేక ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. కొత్తగా ఏ ట్రెండ్‌ వచ్చినా దాన్ని వెంటనే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయింది కొరియన్‌ ట్రెండ్‌. 2012లో వచ్చిన గంగ్నమ్‌ స్టైల్‌ నుంచి ఇప్పటి బీటీఎస్‌ మ్యూజిక్‌ దాకా.. వీటికి మనోళ్లు తెగ ఫిదా అవుతున్నారు. కె–పాప్, కె–డ్రామా, కె– ఫుడ్, కె– ఫ్యాషన్‌లపై మన హైదరాబాదీ యువత మోజు పెంచుకుంది. సిటీలో కొరియన్‌ ట్రెండ్‌ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం!! 
– సాక్షి, సిటీడెస్క్‌ 

దక్షిణ కొరియా సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు నగరాన్ని  తుపానులా చుట్టేస్తున్నాయి, లాక్‌డౌన్‌ టైమ్‌లో చాలా మంది అనేక భారత మెట్రోల్లానే నగరవాసులు కూడా  ఆన్‌లైన్‌ వినోదం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అదే క్రమంలో కె–డ్రామాల క్రేజ్‌లో చిక్కుకున్నారు. దక్షిణ కొరియా టెలివిజన్‌ ధారావాహిక ‘క్రాష్‌ ల్యాండింగ్‌ ఆన్‌ యు’ ముగింపును చూస్తూ హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఇంటర్‌ విద్యార్థిని మణి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ‘దక్షిణ కొరియా వారసురాలు ఉత్తర కొరియా సైన్యానికి చెందిన తీపి–విషాద ప్రేమకథలో లీనమైపోయి ఏడ్చాను’ అంటోందామె!

మన సినిమాల్లాగే... 
మసాలా  మెలోడ్రామాకు అలవాటు పడిన మనకు తగ్గట్టే  విదేశీ లొకేషన్స్‌లో పాటలు, మిల్స్‌ – బూన్‌ రొమాన్స్, మన సినిమాల్లో తరహాలోనే  హాస్యం,  ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీస్, కిడ్నాప్‌లు, ఆకస్మిక మతిమరుపు, సంకల్ప శక్తి కలిగిన తల్లులు, కుటుంబ గౌరవం కోసం ప్రతీకారం తీర్చుకోవడాలు అన్నీ వీటి లోనూ ఉండడం విశేషం. యూరోమానిటర్‌ ప్రకారం, కె–డ్రామాలను భారతీయులు ఎక్కువగా వీక్షించడంతో, నెట్‌ఫ్లిక్స్‌లో కె–డ్రామాల వీక్షకుల సంఖ్య 370 శాతం పెరిగింది. వీటిని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేయడంతో నగర యువత కె–డ్రామాకు పెద్ద ఎత్తున అభిమానులయ్యారు. 

నాటకాల నుంచీ నాలుగు విధాలుగా... 
తినే ఆహారం,  ధరించే దుస్తులు, ఆభరణాలు, ఇంకా ముందుకెళ్లి వారు తాగే సోజు (కొరియన్‌ ఆల్కహాలిక్‌ పానీయం), వారు మాట్లాడే భాష  వారు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు ఇలా ప్రతిదీ సిటీ యూత్‌కి ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మారాయి. దేశంలో  ఒక్క దక్షిణ కొరియా నూడిల్‌ బ్రాండ్‌ నోంగ్‌షిమ్‌ మాత్రమే 1 మిలియన్‌ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది. 

భాషపై సిటీజనుల ఆసక్తి 
ఈ కె డ్రామాల క్రేజ్‌తో సిటీలో కొరియన్‌ భాషా తరగతులపై ఆసక్తి కూడా బాగా పుంజుకుంది. ‘‘కొరియన్‌  భాషను నేర్చుకునే వారు తమకు నచ్చిన భాషా చిత్రాల్లో  వారి చిహ్నాలు ఏమి చెబుతున్నాయి, గాయకులు ఏమి పాడుతున్నారనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే భాష ద్వా రా కొరియాతో నేరుగా కనెక్ట్‌ అవ్వాలనుకుంటున్నారని ఇండో–కొరియన్‌ కల్చరల్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌కు చెందిన నగరశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.  

సిటీలో కొరియన్‌ స్టోర్స్‌ 
కొరియన్‌ ట్రెండ్‌కు అనుగుణంగా నగరంలోని బాలానగర్, మాదాపూర్, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్, గచ్చిబౌలి, అమీర్‌పేట, సికింద్రాబాద్, తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో గ్రాసరీ స్టోర్స్, ఆర్గానిక్‌ ఫుడ్, కాస్మోటిక్, ఫుడ్, బేకరీ, కేక్‌, కిచెన్‌ స్టోర్స్‌ వెలిశాయి. జూబ్లీహిల్స్‌లో చబ్బీ చో, బంజారాహిల్స్‌లో సెవెన్‌ సిస్టర్స్, గచ్చిబౌలిలో హైకూ రెస్టారెంట్లు కొరియన్‌ వంటకాలు ఇష్టపడే నగరవాసుల అభిరుచులకు తగ్గ ఆతిథ్యాన్ని అందిస్తోంది. 

నాటకాలే ప్రధాన కారణం
కొరియన్‌ కల్చర్‌ విజృంభణ వెనుక మొత్తం ఆ దేశపు నాటకాలే ప్రధాన కారణంగా విశ్లేషకులంటున్నారు.  నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న  500 కొరియన్‌ డ్రామాలలో డిసెండెంట్స్‌ ఆఫ్‌ ది సన్, బాయ్స్‌ ఓవర్‌ ఫ్లవర్స్, రిప్లై 1988, కింగ్‌డమ్, స్కై కాజిల్‌... వంటివి వీక్షకుల క్రేజ్‌కు పునాది రాళ్ల వంటివిగా చెప్పొచ్చు. ‘ఒత్తిడితో కూడిన పరిస్థితిలో కొరియన్‌ నాటకాలు నన్ను నవ్విస్తాయి’ అని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థిని వర్షి అంటోంది.  

బీటీఎస్‌ హోరులో... 
కొరియన్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ బీటీఎస్‌ (బుల్లెట్‌ ప్రూఫ్‌ బాయ్‌ స్కౌట్స్‌ లేదా బ్యాంగ్‌టన్‌ బాయ్స్‌) ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. 21వ శతాబ్దిలో పాప్‌ ఐకాన్‌గా నిలిచింది. 2010లో ఓ గ్రూపుగా ఏర్పడిన ఏడుగురు సభ్యుల బృందం జూన్‌ 2013లో తమ మొదటి ఆల్బమ్‌ ‘2కూల్‌ 4స్కూల్‌’ పేరుతో దూసుకొచ్చారు.

ఈ ఆల్బమ్‌ ప్రపపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హిప్‌ హాప్‌ బ్యాండ్‌ గ్రూప్‌గా మొదలు పెట్టి కే–పాప్‌(కొరియన్‌ పాపులర్‌ మ్యూజిక్‌), పాప్‌(పాపులర్‌ మ్యూజిక్‌), ఆర్‌ అండ్‌ బీ (రిథమ్‌ అండ్‌ బ్లూస్‌), ఈడీఎం(ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మూజిక్‌) వంటి అనేక రూపాల్లో తమ సత్తాను చాటుకుంది. 

ఫుడ్‌కు యమా క్రేజ్‌ 
నటీనటులు తమ చాప్‌స్టిక్‌లతో వేడి వేడి కప్పు రమ్యున్‌ నూడుల్స్‌పై చప్పరించడం లేదా కిమ్చీని తినే సన్నివేశాల వీక్షణ ద్వారా పుట్టుకొస్తున్న అభిరుచులు నగరవాసుల్ని పట్టి కుదిపేస్తున్నాయి. దశాబ్దానికి పైగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న కొరియన్‌ జాతీయురాలు చో మిన్‌ యున్‌ నగరంలో కొరియన్‌ వంటకాలకు ప్రత్యేకించిన  గోగురియో  రెస్టారెంట్‌ను ఇటీవలే హైటెక్‌ సిటీలో ప్రారంభించారు. ‘ కె–డ్రామా  కె–పాప్‌ల జనాదరణతో, కొరియన్‌ ఫుడ్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది అందుకే రెస్టారెంట్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను’ అని చో మిన్‌ యున్‌ వివరించారు.  

పాల వినియోగం ఉండదు 
కొరియన్‌ ఆహార సంస్కృతి చైనీస్, జపనీస్‌ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందింది. ఆహారంలో, పాల అతి వినియోగం ఉండదు. కొరియన్‌ మిరపకాయ పేస్ట్‌ అయిన గోచుజాంగ్‌  గోచుగారు – కాల్చిన మిరప పొడి, ఇది భారతీయ మిరపకాయ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆహారం ఎల్లప్పుడూ కిమ్చితో వడ్డిస్తారు, కొరియన్ల కోసం చాలా ప్రత్యేకమైన పులియబెట్టిన సైడ్‌ డిష్‌ సంప్రదాయకంగా చేప నూనెతో వడ్డిస్తారు. ఇక్కడి ప్రజలు దాన్ని ఎక్కువగా ఇష్టపడరు, దీంతో చేప నూనెను వాడటం మానేశాను. 
– బెంజమిన్, జూబ్లీహిల్స్‌లోని ఓ కొరియన్‌ రెస్టారెంట్‌ చెఫ్‌  

బీటీఎస్‌కు పెద్ద ఫ్యాన్‌ 
మొదటి నుంచి పాప్‌ సంగీతం అంటే ఇష్టం. ఇక కొరియన్‌ బీటీఎస్, ఎక్సో, బ్లాక్‌ పింక్, రెడ్‌ వెల్వెట్, షిండీ గ్రూపుల పాటలు వింటాను. మొదట్లో భాష అర్థం కాకపోయేది. క్రమక్రమంగా అలవాటు అయ్యింది, ఆ పాటలు నేర్చుకున్నా. బీటీఎస్‌లో సుగా అంటే ఇష్టం. వాళ్ల కాన్సర్ట్‌ వెరీ గుడ్‌. ఇక ఈ 
బృందంలోని ఏడుగురిది ఒక్కొక్కరిదీ ఒక్కో స్ఫూర్తిదాయక చరిత్ర. చాలా కష్టాలకు  ఎదురొడ్డి ఈ స్థాయికి వచ్చారు. 
    –పి.రితిక, బీఎస్సీ ఫస్ట్‌ ఇయర్, నారాయాణగూడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement