Hyderabad youth
-
హైదరాబాద్ యూత్‌ను ఫిదా చేస్తున్న ‘కొరియన్’ ట్రెండ్..
హైదరాబాద్.... మినీ ఇండియాగా ప్రసిద్ధి. అనేక ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. కొత్తగా ఏ ట్రెండ్ వచ్చినా దాన్ని వెంటనే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయింది కొరియన్ ట్రెండ్. 2012లో వచ్చిన గంగ్నమ్ స్టైల్ నుంచి ఇప్పటి బీటీఎస్ మ్యూజిక్ దాకా.. వీటికి మనోళ్లు తెగ ఫిదా అవుతున్నారు. కె–పాప్, కె–డ్రామా, కె– ఫుడ్, కె– ఫ్యాషన్లపై మన హైదరాబాదీ యువత మోజు పెంచుకుంది. సిటీలో కొరియన్ ట్రెండ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం!! – సాక్షి, సిటీడెస్క్ దక్షిణ కొరియా సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు నగరాన్ని తుపానులా చుట్టేస్తున్నాయి, లాక్డౌన్ టైమ్‌లో చాలా మంది అనేక భారత మెట్రోల్లానే నగరవాసులు కూడా ఆన్లైన్ వినోదం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అదే క్రమంలో కె–డ్రామాల క్రేజ్‌లో చిక్కుకున్నారు. దక్షిణ కొరియా టెలివిజన్ ధారావాహిక ‘క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు’ ముగింపును చూస్తూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని మణి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ‘దక్షిణ కొరియా వారసురాలు ఉత్తర కొరియా సైన్యానికి చెందిన తీపి–విషాద ప్రేమకథలో లీనమైపోయి ఏడ్చాను’ అంటోందామె! మన సినిమాల్లాగే... మసాలా మెలోడ్రామాకు అలవాటు పడిన మనకు తగ్గట్టే విదేశీ లొకేషన్స్‌లో పాటలు, మిల్స్ – బూన్ రొమాన్స్, మన సినిమాల్లో తరహాలోనే హాస్యం, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, కిడ్నాప్‌లు, ఆకస్మిక మతిమరుపు, సంకల్ప శక్తి కలిగిన తల్లులు, కుటుంబ గౌరవం కోసం ప్రతీకారం తీర్చుకోవడాలు అన్నీ వీటి లోనూ ఉండడం విశేషం. యూరోమానిటర్ ప్రకారం, కె–డ్రామాలను భారతీయులు ఎక్కువగా వీక్షించడంతో, నెట్‌ఫ్లిక్స్‌లో కె–డ్రామాల వీక్షకుల సంఖ్య 370 శాతం పెరిగింది. వీటిని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేయడంతో నగర యువత కె–డ్రామాకు పెద్ద ఎత్తున అభిమానులయ్యారు. నాటకాల నుంచీ నాలుగు విధాలుగా... తినే ఆహారం, ధరించే దుస్తులు, ఆభరణాలు, ఇంకా ముందుకెళ్లి వారు తాగే సోజు (కొరియన్ ఆల్కహాలిక్ పానీయం), వారు మాట్లాడే భాష వారు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు ఇలా ప్రతిదీ సిటీ యూత్‌కి ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మారాయి. దేశంలో ఒక్క దక్షిణ కొరియా నూడిల్ బ్రాండ్ నోంగ్‌షిమ్ మాత్రమే 1 మిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది. భాషపై సిటీజనుల ఆసక్తి ఈ కె డ్రామాల క్రేజ్‌తో సిటీలో కొరియన్ భాషా తరగతులపై ఆసక్తి కూడా బాగా పుంజుకుంది. ‘‘కొరియన్ భాషను నేర్చుకునే వారు తమకు నచ్చిన భాషా చిత్రాల్లో వారి చిహ్నాలు ఏమి చెబుతున్నాయి, గాయకులు ఏమి పాడుతున్నారనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే భాష ద్వా రా కొరియాతో నేరుగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారని ఇండో–కొరియన్ కల్చరల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన నగరశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. సిటీలో కొరియన్ స్టోర్స్ కొరియన్ ట్రెండ్‌కు అనుగుణంగా నగరంలోని బాలానగర్, మాదాపూర్, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, గచ్చిబౌలి, అమీర్‌పేట, సికింద్రాబాద్, తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో గ్రాసరీ స్టోర్స్, ఆర్గానిక్ ఫుడ్, కాస్మోటిక్, ఫుడ్, బేకరీ, కేక్, కిచెన్ స్టోర్స్ వెలిశాయి. జూబ్లీహిల్స్‌లో చబ్బీ చో, బంజారాహిల్స్‌లో సెవెన్ సిస్టర్స్, గచ్చిబౌలిలో హైకూ రెస్టారెంట్లు కొరియన్ వంటకాలు ఇష్టపడే నగరవాసుల అభిరుచులకు తగ్గ ఆతిథ్యాన్ని అందిస్తోంది. నాటకాలే ప్రధాన కారణం కొరియన్ కల్చర్ విజృంభణ వెనుక మొత్తం ఆ దేశపు నాటకాలే ప్రధాన కారణంగా విశ్లేషకులంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న 500 కొరియన్ డ్రామాలలో డిసెండెంట్స్ ఆఫ్ ది సన్, బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, రిప్లై 1988, కింగ్డమ్, స్కై కాజిల్... వంటివి వీక్షకుల క్రేజ్‌కు పునాది రాళ్ల వంటివిగా చెప్పొచ్చు. ‘ఒత్తిడితో కూడిన పరిస్థితిలో కొరియన్ నాటకాలు నన్ను నవ్విస్తాయి’ అని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని వర్షి అంటోంది. బీటీఎస్ హోరులో... కొరియన్ మ్యూజిక్ సెన్సేషన్ బీటీఎస్ (బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్ లేదా బ్యాంగ్టన్ బాయ్స్) ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. 21వ శతాబ్దిలో పాప్ ఐకాన్‌గా నిలిచింది. 2010లో ఓ గ్రూపుగా ఏర్పడిన ఏడుగురు సభ్యుల బృందం జూన్ 2013లో తమ మొదటి ఆల్బమ్ ‘2కూల్ 4స్కూల్’ పేరుతో దూసుకొచ్చారు. ఈ ఆల్బమ్ ప్రపపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హిప్ హాప్ బ్యాండ్ గ్రూప్‌గా మొదలు పెట్టి కే–పాప్(కొరియన్ పాపులర్ మ్యూజిక్), పాప్(పాపులర్ మ్యూజిక్), ఆర్ అండ్ బీ (రిథమ్ అండ్ బ్లూస్), ఈడీఎం(ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మూజిక్) వంటి అనేక రూపాల్లో తమ సత్తాను చాటుకుంది. ఫుడ్‌కు యమా క్రేజ్ నటీనటులు తమ చాప్‌స్టిక్‌లతో వేడి వేడి కప్పు రమ్యున్ నూడుల్స్‌పై చప్పరించడం లేదా కిమ్చీని తినే సన్నివేశాల వీక్షణ ద్వారా పుట్టుకొస్తున్న అభిరుచులు నగరవాసుల్ని పట్టి కుదిపేస్తున్నాయి. దశాబ్దానికి పైగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న కొరియన్ జాతీయురాలు చో మిన్ యున్ నగరంలో కొరియన్ వంటకాలకు ప్రత్యేకించిన గోగురియో రెస్టారెంట్‌ను ఇటీవలే హైటెక్ సిటీలో ప్రారంభించారు. ‘ కె–డ్రామా కె–పాప్‌ల జనాదరణతో, కొరియన్ ఫుడ్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది అందుకే రెస్టారెంట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను’ అని చో మిన్ యున్ వివరించారు. పాల వినియోగం ఉండదు కొరియన్ ఆహార సంస్కృతి చైనీస్, జపనీస్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందింది. ఆహారంలో, పాల అతి వినియోగం ఉండదు. కొరియన్ మిరపకాయ పేస్ట్ అయిన గోచుజాంగ్ గోచుగారు – కాల్చిన మిరప పొడి, ఇది భారతీయ మిరపకాయ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆహారం ఎల్లప్పుడూ కిమ్చితో వడ్డిస్తారు, కొరియన్ల కోసం చాలా ప్రత్యేకమైన పులియబెట్టిన సైడ్ డిష్ సంప్రదాయకంగా చేప నూనెతో వడ్డిస్తారు. ఇక్కడి ప్రజలు దాన్ని ఎక్కువగా ఇష్టపడరు, దీంతో చేప నూనెను వాడటం మానేశాను. – బెంజమిన్, జూబ్లీహిల్స్‌లోని ఓ కొరియన్ రెస్టారెంట్ చెఫ్ బీటీఎస్‌కు పెద్ద ఫ్యాన్ మొదటి నుంచి పాప్ సంగీతం అంటే ఇష్టం. ఇక కొరియన్ బీటీఎస్, ఎక్సో, బ్లాక్ పింక్, రెడ్ వెల్వెట్, షిండీ గ్రూపుల పాటలు వింటాను. మొదట్లో భాష అర్థం కాకపోయేది. క్రమక్రమంగా అలవాటు అయ్యింది, ఆ పాటలు నేర్చుకున్నా. బీటీఎస్‌లో సుగా అంటే ఇష్టం. వాళ్ల కాన్సర్ట్ వెరీ గుడ్. ఇక ఈ బృందంలోని ఏడుగురిది ఒక్కొక్కరిదీ ఒక్కో స్ఫూర్తిదాయక చరిత్ర. చాలా కష్టాలకు ఎదురొడ్డి ఈ స్థాయికి వచ్చారు. –పి.రితిక, బీఎస్సీ ఫస్ట్ ఇయర్, నారాయాణగూడ -
విషవాయువులు పీల్చి.. ‘ఐ క్విట్’ అని రాసి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: 2016 మార్చిలో తండ్రి, అక్టోబర్‌లో సోదరుడు, నవంబర్‌లో తల్లి, డిసెంబర్లో నానమ్మ, ఇటీవలే సోదరిగా భావించే ఆప్తురాలు చనిపోవడం... ఇలా తనకంటూ జీవితంలో ఎవరూ మిగలకపోవడానికి కారణం తానో దురదృష్టవంతుడినని భావించిన హైదరాబాద్ యువకుడు కోల్‌కతాలో తనువు చాలించాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, విషవాయువులు పీల్చి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికంటూ ఎవరూ లేకపోవడంతో హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రాణ స్నేహితుడు మృతదేహాన్ని తీసుకువస్తున్నాడు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పి.సమ్రిత్ (25) ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో టెక్నికల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2016లో తన కుటుంబీకులు చనిపోయిన తర్వాత తీవ్రంగా కుంగిపోయిన ఇతడికి స్నేహితుడి భార్య ధైర్యం చెప్పింది. ఆమెను సోదరిగా భావిస్తూ ప్రతి విషయం పంచుకునేవాడు. అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఇటీవలే కన్నుమూయడంతో సమ్రిత్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. తానో దురదృష్టవంతుడనని, తనకున్న ఈవిల్ పవర్స్ వల్లే కుటుంబీకులందరినీ కోల్పోయానని భావించాడు. ఇదే విషయాన్ని ఫ్లాట్‌లో ఉండే సహోద్యోగులతో చెప్తుండేవాడు. ఇటీవల సమ్రిత్ మరింత నిస్పృహకు లోనయ్యాడు. సోమవారం ఉదయం సహోద్యోగులతో కలసి విధులకు బయలుదేరాడు. అంతలోనే మనసు మార్చుకుని తాను ఫ్లాట్‌లోనే ఉంటానని చెప్పాడు. సమ్రిత్ మానసిక స్థితి తెలిసిన ఆ సహోద్యోగులు ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత ఫోన్ చేశారు. అయితే సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి తిరిగి ఫ్లాట్‌కు వచ్చారు. సూసైడ్ నోట్ స్వాధీనం... తమ వద్ద ఉన్న తాళంతో తలుపు తెరిచి లోపలకు వెళ్లి చూడగా... ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, పక్కన ఓ సిలిండర్ పెట్టుకుని, దాని పైపు ప్లాస్టిక్ కవర్లో ఉంచిన స్థితిలో కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సమ్రిత్ను పోలీసుల సాయంతో బిద్ధన్‌నగర్ సబ్–డివిజినల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమ్రిత్ ఫ్లాట్‌లో సోదాలు చేసిన పోలీసులు రెండు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన పరిస్థితుల్ని వివరించిన సమ్రిత్ ‘ఐ క్విట్’ అంటూ ముగించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ నుంచి వెళ్లిన అతడి స్నేహితుడికి అప్పగించారు. సూసైడ్ నోట్లోని చేతి రాత సమ్రిత్దేనని పోలీసులు తేల్చారు. అతడికి విషవాయువుల సిలిండర్ ఎక్కడ నుంచి వచ్చిందనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. -
ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్ యువకులు
సాక్షి, హైదరాబాద్: ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ‘30 అండర్ 30’ఆసియా జాబితాలో చోటు సంపాదించుకున్న ఐదుగురు హైదరాబాద్ యువకులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం అభినందించారు. ఆసియా ఖండం వ్యాప్తంగా 30 ఏళ్ల లోపు వయసున్న 30 మందిని ఫోర్బ్స్ గుర్తించగా.. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువ పారిశ్రామికవేత్తలకు చోటుదక్కింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన ప్రేమ్ కుమార్ (మారుత్ డ్రోన్స్), అశ్విన్ మోచర్ల (దీ థిక్ షేక్ ఫ్యాక్టరీ), సందీప్ బొమ్మి (యాడ్ ఆన్ మో), విహారి (అర్బన్ కిసాన్), పవన్ కుమార్ చందన (స్కై రూట్ ఏరోస్పేస్) పేర్లతో స్టార్టప్‌లను స్థాపించారు. ప్రస్తుత తరంలోని యువకులు తమ ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైన ఆవిష్కరణలు, వినూత్న మార్గాల్లో పురోగమిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయసహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్, వీ హబ్ వంటి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగర స్టార్టప్ వాతావరణం బలోపేతమైందని పేర్కొన్నారు. కాగా ఈ ఐదుగురు పారిశ్రామికవేత్తలు ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. అలాగే వీరు స్థాపించిన కంపెనీలకు ఫండింగ్‌తో పాటు అనేక అవార్డులు కూడా లభించాయి. ఇందులో పలు స్టార్టప్‌లు టీ హబ్ ద్వారా ప్రారంభమవ్వడం లేదా టీ హబ్ ద్వారా సహాయ సహకారాలు అందుకున్నవి కావడం గమనార్హం. -
నగరంలో తీవ్రమవుతున్న ‘షైనెస్’ సమస్య
సాక్షి, సిటీబ్యూరో: ‘‘పద్దెనిమిదేళ్ల వయసు. బీటెక్ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచ్చినా పలకరించదు. తన లోకం తనది, అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు కావలసినవన్నీ తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళనగా ఉంది..’ నగరానికి చెందిన ఒక ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి వద్ద వారం రోజుల క్రితం హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక తల్లి తన కూతురు ప్రవర్తన పట్ల వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘ఇంటికి వచ్చిన అతిథులను బాగున్నారా అని కూడా పలకరించకపోతే ఎలా..’ అని ఆ తల్లి ఆవేదన. ఇది ఆ ఒక్క తల్లి ఆందోళనే కాదు. చాలామంది తమ పిల్లల తీరు పట్ల ఇదే తరహా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రోజు రోజుకు ఇలాంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పే ‘షైనెస్’ (బిడియం) సమస్యల ఇటీవల కాలంలోపెరుగుతోంది. చాలా మంది పిల్లలు చదువుల్లో ర్యాంకులకు ర్యాంకులు సాధించినప్పటికీ భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతోందని మానసిక వైద్యనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై నాలుగ్గంటలు మొబైల్ ఫోన్‌కు అతుక్కుపోవడమేనని స్పష్టం చేస్తున్నారు. చాటింగ్ తారకమంత్రం... సాధారణంగా పిల్లలు గలగలా మాట్లాడుతూ ఇల్లంతా సందడి చేస్తుంటే ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా ఉన్నట్లు లెక్క. స్కూల్, కాలేజీల్లోనూ పిల్లల సందడి ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లల అల్లరి కూడా ముచ్చటగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్‌ఫోన్‌కు అడిక్ట్ కావడం వల్ల చాలా మంది పిల్లలు షైనస్కు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూసి స్పష్టంగా మాట్లాడలేకపోవడమే ఈ షైనస్ లక్షణం. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సప్‌లో మెసేజ్ పోస్టు చేయడం అలవాటుగా మారింది. ‘ ఫేస్బుక్, వాట్సప్, ఇతరత్రా సోషల్ మీడియాలో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను పోస్టు చేస్తారు. కానీ సదరు వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నారు’ అని విస్మయం వ్యక్తం చేశారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సంహిత. ఇలాంటి పిల్లలు ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టీనేజ్ యూత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్ ఫోన్ తాకరమంత్రంగా భావించడమే ఇందుకు కారణం. భావప్రకటనా నైపుణ్యాన్ని అలవర్చుకోకపోవడం వల్ల, ఎదుటి వారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఇలాంటి పిల్లలు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారి మధ్య సరైన వ్యక్తిత్వం లేని వారుగా చులకనకు గురవుతున్నారు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకపోవడమే వారు ఎదుర్కొంటున్న అసలు సమస్య. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ‘సున్నితం’గా పెంచేస్తున్నారు.... పేరెంటింగ్‌లోని లోపాలు కూడా ఈ సమస్యకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలు సున్నితంగా, ఒద్దికగా ఉండాలనే భావన, గలగలా మాట్లాడకుండా బిడియపడుతూ మాట్లాడాలని తల్లితండ్రులు పదే పదే చెప్పడం వల్ల కూడా చాలామంది భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడలేకపోవడమే కాదు, జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోలేక విలవిలలాడిపోతున్నట్లు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయానికి పిల్లలు తమపైనే ఆధారపడేలా పెంచడం కూడా మరో ప్రధాన లోపం. అమ్మాయిల్లోనే కాదు. అబ్బాయిల్లోనూ ఇది ప్రబలంగానే ఉంది. ఇలాంటి వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నారు. లోపాన్ని గుర్తించడమే పరిష్కారం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బాగా అలవాటుపడడం వల్లనే అభిప్రాయాలను, ఆలోచనలను, తమ భావాలను ప్రకటించలేకపోతున్నారనే లోపాన్ని మొదటి గుర్తిస్తే పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది. సమస్య తెలిసిన తరువాత ఆ అలవాటు నుంచి దూరంగా ఉండాలి. వాటి పైనుంచి దృష్టి మళ్లించేందుకు, భావప్రకటన నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు మంచి లిటరేచర్ చదవాలి. మంచి సినిమాలు, సాహిత్యం, స్నేహితులతో మాట్లాడం ఇందుకు దోహదం చేస్తాయి. – డాక్టర్ సంహిత, మానసిక వైద్య నిపుణులు -
మనసు చలించింది...
సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్‌రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్ (సప్తగిరి చిన్న) ఫేస్బుక్లో హలో యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్ ద్వారా చూసిన ఫీడ్ ది హంగర్ ఫర్ కేఎస్కే ఆర్గనైజేషన్ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్కే టీమ్ ఎవరు వీరు.. హైదరాబాద్‌లోని రివ్లోన్ కాస్మోటిక్ కంపెనీలో సౌత్ ట్రైనర్‌గా కావ్య, సేల్స్ మేనేజర్‌గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు -
ఇలా అయితే ‘స్వచ్ఛ ర్యాంకు’ ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తామని..స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుపుతామని జీహెచ్ఎంసీ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛ నగరం కోసం పలు ప్రణాళికలు మారుస్తూ దేన్నీ పూర్తి చేయడం లేదు. ఆ తంతు ఒక ఎత్తు కాగా, కనీసం ప్రజల నుంచి ‘ఫీడ్‌బ్యాక్’ తీసుకునే అంశంలోనూ పూర్తి శ్రద్ధ చూపలేదు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2020’ మొత్తం 6 వేల మార్కులకు కాగా.. అందులో 1500 మార్కులు నగర పౌరుల ఫీడ్‌బ్యాక్‌కే ఉన్నాయి. గతంలో వివిధ అంశాల్లో నగరం మెరుగ్గా ఉన్నప్పటికీ ఫీడ్‌బ్యాక్‌లో వెనుకబడినందునే ర్యాంక్ తగ్గిందని చెప్పుకున్నారు. ఆ విషయం తెలిశాకైనా ఫీడ్‌బ్యాక్ అంశంలో మెరుగుపడేందుకు చర్యలు తీసుకోలేదు. ఈనెల 4 నుంచి 31వ తేదీ వరకు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను నాలుగు విధాలుగా తెలియజేయవచ్చు. వెబ్సైట్, యాప్, ఫోన్ల ద్వారా ఇందుకు అవకాశముంది. ఈ విషయాల్ని నగర పౌరులకు తెలియజేయడంతోపాటు.. ఫీడ్‌బ్యాక్‌లో భాగంగా ఉండే ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేలా అవగాహన కల్పించాలి. ఇందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ.. సకాలంలో కాకుండా గడువు ముగియనున్న తరుణంలో కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లే ఎంటమాలజీ సిబ్బందికి స్వచ్ఛసర్వేక్షణ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలిచ్చి పంపుతున్నారు. ఈ పుస్తకాల్లో వారు ఇంటిలోని వారి పేరు రాయడంతో పాటు మొబైల్ నెంబర్ వేయాలి. వారికి స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి తెలియజేయడంతో పాటు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరి.. వారి మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. యాప్ డౌన్లోడ్ అయ్యాక ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఓటీపీ నమోదు చేయడం తదితరమైనవి వివరించాలి. ఇవన్నీ చేశాక ఫీడ్బ్యాక్లోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా సూచించాలి. ఈ పనులు చేసినట్లు వారి సంతకం కూడా తీసుకోవాలి. వారి వద్ద మొబైల్ ఫోన్ లేకుంటే.. తమ మొబైల్ ఫోన్ నుంచైనా వారి పేరు.. వివరాలతో ఫీడ్‌బ్యాక్ పంపించాలని నిర్ణయించారు. తద్వారా ఎంతమంది ఫీడ్‌బ్యాక్ పంపించారో తెలుసుకునేందుకు వీలవుతుంది.దీంతోపాటు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే మిగతా విధానాలను కూడా తెలియజేయాలని కూడా భావించారు. ఈ వివరాలు నమోదు చేసేందుకు ముద్రించిన పుస్తకాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి. ఇవన్నీ సర్కిళ్లకు.. అక్కడినుంచి ఎంటమాలజీ సిబ్బందికి చేరి.. వారు ఇంటింటికీ వెళ్లేందుకు సెలవులు పోను మిగిలింది దాదాపు ఐదు రోజులు. ఈ స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ద్వారా ఏమేరకు ప్రయోజనం లభించగలదో సంబంధిత అధికారులకే తెలియాలి. నాలుగో తేదీనుంచే ఈ సర్వే ఉందని తెలుసు. అప్పటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేది. తీరా గడువు ముగుస్తున్న సమయంలో చేస్తున్న ఈ ప్రయత్నం పుస్తకాల మద్రణ ఖర్చు తప్ప.. పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించి అడిగే ప్రశ్నల్లో ‘మీ ఇంటి వ్యర్థాలను తడి,పొడి వేర్వేరుగా ఇవ్వమని మీ చెత్త సేకరించే వాళ్లు అడుగుతున్నారా ? అనేది ఒక ప్రశ్న. దీనికి ‘అవును.. ప్రతిసారి’ అని సమాధానం ఇవ్వాల్సిందిగా చెప్పమని ఎంటమాలజీ సిబ్బందికి సూచిస్తున్నారు కానీ.. వారా విషయం చెప్పగలరా అన్నదే అంతుబట్టడం లేదు. ఎందుకంటే.. వాస్తవానికి నగరంలో తడిపొడి వేరు చేసి ఇవ్వమని అడుతున్నవారు లేరు సరికదా.. అవగాహన ఉన్న కొన్ని కుటుంబాల వారు వేరుచేసి ఇచ్చిన చెత్తను సైతం కలగలిపే ఆటోల్లో తీసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్లోనగర ర్యాంకు వెనుకబడిందిలా.. సంవత్సరం ర్యాంక్ 2016 19 2017 22 2018 27 2019 35 -
పతంగులే ఆదర్శమంటున్న హైదరాబాద్ ‘కైట్స్’
సాక్షి, సిటీబ్యూరో : కొందరు పొద్దున లేచిన దగ్గర్నుంచీ ఏవేవో చేస్తుంటారు. ఎన్నెన్నో ఆస్వాదిస్తుంటారు. సమయం దొరికితే సమస్త విశ్వాన్ని చుట్టేద్దామన్నంత ఆరాటంతో ఉంటారు.మరికొందరేమో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. అన్న ప్రశ్నలకు ఆన్సర్లు రాసుకుంటూ గడిపేస్తుంటారు. ఇంతకన్నా మనం చేసేదేముందంటూ నిర్లిప్తత ప్రదర్శిస్తుంటారు. ఇదే మనకు అసలైన జబ్బు అంటోంది హైదరాబాద్ కైట్స్. అభిరుచుల్ని విస్తరించుకుంటే అప్పటి దాకా మన చుట్టూ ఉన్న ప్రపంచం అమాంతం మారిపోతోదంటోంది. మొత్తమ్మీద బతకడం కాదు జీవించడం నేర్చుకోమంటోంది. అభిరుచుల కలబోత.. ‘పాటలు పాడాలని కొందరు, ఆటలాడదాం అని మరికొందరు. సైక్లింగ్, రన్నింగ్లంటే మక్కువతో ఇంకొందరు. సేవాభిలాషతో, సాటి మనిషికి సాయం చేయాలనే తహతహతో ఎందరో. ఇలా మనలో చాలా మందికి ఏదో చేయాలని ఉంటుంది. సరైన మార్గదర్శకత్వం లేక ప్రోత్సాహం లేక ఏమీ చేయలేకపోతుంటాం. అలాంటి ఆలోచనల్ని సజీవంగా ఉంచడం, సాకారం చేయడమే మా ‘లక్ష్యం’ అంటున్నారు హైదరాబాద్ కైట్స్ నిర్వాహకుడు వసంత కార్తీక్. ఆరోగ్యార్థుల నుంచి ఆపన్నహస్తం అందించడం దాకా.. ప్రతి పనిలోనూ మేం మీకు తోడుంటాం అని హామీ ఇచ్చే సరికొత్త తరహా వేదికను ఆయన తన మిత్రబృందంతో కలిసి ఏర్పాటు చేశారు. ఇలాంటి అభిరుచులు ఉన్నవారిని ఒక దగ్గరకు చేర్చి వాటినిపరస్పరం పంచుకుంటూ ఆస్వాదించేలా చేస్తున్నారు. సేవతో మమేకం.. ఆరోగ్యమే మహాభాగ్యం అనే వాక్యాన్ని మనసారా నమ్మి దానికి అనుబంధంగానే తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ సాటి మనిషికి సేవ చేయడం కూడా చక్కని సంతృప్తిని మనకు అందిస్తుందని నమ్ముతోంది. దీనికి అనుగుణంగా పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ♦ ‘నగరానికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ పల్లవి‘కైట్స్’ను సంప్రదించి బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. గత డిసెంబర్ 22న నగరంలోని పలు ఏరియాల్లో 100 దాకా బ్లాంకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందించారు. ♦ నల్లగొండకు చెందిన నాలుగున్నరేళ్ల ఆయుషి బాలికకు లుకేమియా కేన్సర్ వచ్చింది. ఆ విషయం తెలిసి ఏమైనా హెల్ప్ చేయాలని ఆశించిన కొందరితో కలిసి గత ఏడాది ఏప్రిల్ 14న డ్యాన్స్ ఫర్ ఆయుషి పేరిట ఒక డ్యాన్స్ కమ్యూనిటీ సహకారంతో హైటెక్ సిటీ దగ్గరున్న ఫినిక్స్ ఎరినాలో ఈవెంట్ నిర్వహించారు. దీని ద్వారా రూ.3.50 లక్షలు వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అప్పటి మంత్రి కేటీఆర్ ఆ అమ్మాయికి అవసరమైన చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ పాప ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ♦ పవన్ అనే 20 ఏళ్ల యువకుడు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం బసవ తారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. సాయం అందించాలనుకున్నవారితో మ్యూజిక్ ఫర్ పవన్ అనే ఈవెంట్ చేశారు. దీని ద్వారా రూ.2లక్షలు, అంతర్జాతీయంగా అందిన సాయం ద్వారా మొత్తం రూ. 8 లక్షల దాకా అందించారు. ♦ కేరళ వరదల సమయంలో కేరళ మ్యూజికల్ బ్యాండ్‌కి చెందిన సందీప్ శర్మ తమ రాష్ట్రం కోసం ఈవెంట్ చేయండి అని అడిగతే వియ్ ఫర్ కేరళ పేరుతో ఓ ఈవెంట్ చేసి వచ్చిన మొత్తాన్ని అతనికి ఇచ్చి పంపారు అంటూ వివరించారు వసంత కార్తీక్. త్వరలోనే మరిన్ని విభిన్న కార్యక్రమాల ద్వారా నగరంలో అభిరుచుల ఆస్వాదనను ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చాలనుకుంటున్నామని అంటోంది హైదరాబాద్ కైట్స్ బృందం. ♦ అదో ఔత్సాహికుల బృందం. మురికివాడల ప్రజలతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తుంది. సిటీ లేక్‌లను కాపాడాలంటూ సందేశాన్నిస్తుంది. రన్ బాబా రన్ అంటూ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. పరుగు తీస్తే అనారోగ్యం మనకు దూరంగా పరుగు తీస్తుందంటూ వెన్ను తడుతుంది. ఆటలైనా పాటలైనా.. అభిరుచి ఉంటే చాలు ఆనందం మీ వెంటే ఉంటుందని హామీ ఇస్తుంది. ‘కైట్స్’కు వసంత కార్తీకం.. ‘ఆరోగ్య జీవనశైలికి ముందుగా కావాల్సినవి చక్కని అభిరుచులు. వాటిని ఎంతగా సానబెట్టుకుంటే అంత ఆనందం, ఆరోగ్యం’ అనేది తన స్వానుభవం అని చెప్పే వసంత కార్తీక్.. తన ఆలోచనని అంగీకరించిన మరికొందరు కార్పొరేట్ ఉద్యోగులు, విభిన్న రంగాల ఔత్సాహికులతో కలిసి ‘కైట్స్’ను నిర్వహిస్తున్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కొంత కాలంగా విభిన్న అభిరుచుల వారీగా ఏర్పాటైన దాదాపు 25 బృందాలను ఒక చోట చేర్చగలిగారు. ‘సరైన దశా దిశా లేని టాలెంటెడ్ పీపుల్‌కి వారికి ఉపకరించే పేషనేట్ కమ్యూనిటీస్‌ని పరిచయం చేస్తాం’ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రగతినగర్‌లో ఉన్న ప్రగతి రన్నర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తున్న ‘హైదరాబాద్ కైట్స్’ గత ఏడాది జనవరిలో కైట్స్ ఫెస్టివల్ నిర్వహించింది. ‘లేక్‌లను రక్షించుకోండి అనే సందేశంతో ఇబ్రహీం లేక్ దగ్గర పార్క్‌లో కుటుంబ సమేత పతంగుల పండగను నిర్వహించాం, ఎకో ఫిలిం ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు వసంత కార్తీక్. త్వరలో జనవరి 22న హైటెక్స్‌లో వన్ నేషన్ వన్ డ్యాన్స్ అనే పేరుతో మరో ఈవెంట్ చేస్తున్నామని ఆయన వివరించారు. -
గాలిపటం గాయబ్
► భాగ్యనగరంలో తగ్గుతున్న పతంగుల సందడి ► 90 శాతం తగ్గిన విక్రయాలు.. ► సెల్ ప్రపంచంలో మునిగి చెరఖాను వదిలేస్తున్న యువత, చిన్నారులు ► కొనుగోలుదారులు లేక బోసిపోతున్న గుల్జార్‌హౌస్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది ఒక్క బిర్యానీనే కాదు పతంగులు కూడా! జనవరి వచ్చిందంటే చాలు.. పేంచ్.. డీల్ చోడ్.. లండోర్.. పేంచ్కాట్.. ఏ గల్లీలో చూసినా ఈ పదాలే వినిపించేవి. కానీ రోజులు మారాయి. ఇప్పడు నింగిలో గాలిపటాల రెపరెపలు కనిపించటం లేదు. గతేడాది ఓ మోస్తరుగా కనిపించిన పతంగులు ఇప్పుడు నల్లపూసల య్యాయి. ఈసారి ఇప్పటిదాకా కేవలం పది శాతం పతంగులే అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనవరిలో భాగ్యనగరంలోని గుల్జార్‌హౌజ్ కిటకిటలాడుతూ ఉంటుంది. పాతనగరంలోని ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో దుకాణాలు గాలిపటాలను విక్రయిస్తాయి. యాకుత్‌పురా, డబీర్‌పురా, పత్తర్‌ఘట్టి, మదీనా, శాలిబండ, లాల్‌దర్వాజ, మహారాజ్‌గంజ్, గోషామహల్, దూల్‌పేట, చెత్తబజార్, చార్మినార్... ఈ ప్రాంతాల్లో అడుగడుగునా గాలిపటాల దుకాణాలు ముస్తాబవుతాయి. వాటి చుట్టూ వందల మంది కొనుగోలుదారులతో సందడి నెలకొంటుంది. అలాంటి గుల్జార్‌హౌజ్ ప్రాంతాలు ఇప్పుడు బోసిపోయాయి. కొనుగోలుదారులు కేవలం పదుల సంఖ్యలో కన్పిస్తున్నారు. సంక్రాంతి పండగ ముగిసినా ఇంకా దుకాణాల్లో పతంగుల బొత్తులు అలాగే ఉండిపోయాయి. సెల్ చెరలో చెరకా గతేడాది భాగ్యనగరంలో పతంగుల విక్రయాలు యాభై శాతం పడిపోయాయి. ఈ ఏడాదైతే మరీ దారుణంగా విక్రయాలు 90 శాతం మేర తగ్గిపోయాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అంతా ‘సెల్’ ప్రపంచంలో మునిగిపోయి చెరకా పట్టుకోవటం మానేశారు. ఈ మూడు రోజులు రద్దీగా ఉండాల్సిన మైదానాలు పూర్తిగా బోసిపోయాయి. అక్కడక్కడా కొన్ని గుంపులు కనిపించినా వారు క్రికెట్ ఆటకే పరిమితమయ్యారు. ఆ మూలా ఈ మూలా పది ఇరవై మంది గాలిపటాలు ఎగరేయడం కనిపించింది. వాట్సాప్ మెజేజ్‌లు, ఫేస్బుక్ లైక్‌లు.. చాటింగ్‌లు... ఈ హడావుడిలో గాలిపటం కొట్టుకుపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. పాతబస్తీలో చాలాప్రాంతాల్లో పతంగులు, మాంజా దారం తయారీ ఓ కుటీర పరిశ్రమ. వందల కుటుంబాలు సంవత్సరంలో నాలుగైదు నెలలు వాటి తయారీపైనే ఆధారపడేవి. ఇప్పుడు ఆ పరిశ్రమ ధ్వంసమైంది. గత నాలుగైదేళ్లుగా పతంగులకు ఆదరణ తగ్గటంతో వారు ప్రత్యామ్నాయంవైపు దృష్టి సారించారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి ‘‘మూడు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులు పిల్లలో వారానికి 30 గంటల నాణ్యమైన సమయాన్ని గడిపేవారట. ఇప్పుడది 18 నిమిషాలకు పడిపోయిందని విశ్లేషకులు తేల్చారు. సెల్‌ఫోన్ ధ్యాసను కాస్త పక్కన పెట్టి పిల్లలతో గడిపితే వారిలో మంచి మార్పు వస్తుంది. దానికి గాలిపటాలెగరేయటం మంచి వ్యాపకం. కాసేపు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిపి గాలిపటాలెగరేస్తే ఆ కుటుంబ మానసిక, శారీరక నడవడికలో మంచి మార్పు వస్తుంది. చివరకు అది మంచి ఫలితం వైపు తీసుకెళ్తుంది’’– డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, మానసిక విశ్లేషకులు ఒడిదుడుకులు తట్టుకునే శక్తి వస్తుంది ‘‘గాలిపటం ఎగురుతున్నప్పుడు కాసేపు పిల్లలను పట్టుకోమనండి. బరువుగా ఉండే ఆ గాలిపటం పడిపోకుండా పైకే ఎగిరేలా చేసినప్పుడు ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా పరిష్కారాలను వెదికే ఆలోచనశక్తి వారికి అబ్బుతుంది. వారిలో చైతన్యం నింపుతుంది’’ – వేదకుమార్, సామాజికవేత్త -
హైదరాబాద్ యూత్... బైక్స్ ఆన్ ఫుట్‌పాత్!!
హైదరాబాద్‌లో బైక్ నడిపే వారికి ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. అది మా రాంబాబుగాడికీ ఒంటబట్టింది. అదేమిటంటే.. చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత ముందన్నీ పెద్ద పెద్ద కార్లూ, ఎస్యూవీలూ అడ్డుగా ఉన్నప్పుడు తన ద్విచక్ర వాహనాన్ని ఫుట్‌పాత్ మీదికి ఎక్కిస్తాడు. ముందువరకూ వెళ్లి రైటుకు వెళ్లాలనుకుంటే ఎక్కడో ఒక చోట న్యాక్‌గా ఫుట్‌పాత్ దింపుతాడు. లేదా అలాగే ముందుకు వెళ్లి కాస్త రద్దీ తక్కువగా ఉన్న చోట బైక్‌ను పేవ్మెంట్ మీది నుంచి దింపేసి.. తన దారిన తాను వెళ్తుంటాడు. ఇలా ఒకసారి సిగ్నల్ పడి ముందున్న పెద్ద పెద్ద వాహనాలన్నీ ఆగగానే.. యథాప్రకారం బండిని ఫుట్‌పాత్ మీద నడిపేయడం మొదలుపెట్టాడు. ‘ఏమిట్రా ఇది... ఫుట్‌పాత్ అన్నది జనాలు నడవడం కోసం. ఇలా బండి నడపడం తప్పుకదూ’ అంటూ నేను వాణ్ణి మందలించా. అంతే వాడు రివర్స్‌లో నాకు క్లాస్ తీసుకున్నాడు. ‘ఒరేయ్.. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించరా. ఇలా ఫుట్‌పాత్ మీది నుంచి దూసుకుపోవడం ద్వారా నేను సామాజిక న్యాయం చేస్తున్నానురా’ అన్నాడు వాడు. ‘ఒరేయ్. ఫుట్‌పాత్ మీద బండి నడపడానికీ, సామాజికన్యాయానికీ ఏమైనా సంబంధం ఉందట్రా. పిచ్చివాగుడు వాగకు’ అంటూ బుద్ధి చెప్పబోయాను. ‘ఒక్కసారి ముందు చూడు. అన్నీ బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ, వోల్వో లాంటి పెద్దపెద్ద వాహనాలూ; సెగ్మెంట్ సీ కార్లూ; బొలేరో, సఫారీ, స్కార్పియోలాంటి ఎస్‌యూవీలు. ఇన్ని పెద్ద కార్లు మన ముందు ఉంటే.. ఈ పెత్తందారీ కార్లను దాటి మనలాంటి సన్న, చిన్నకారు ద్విచక్రవాహనదారులు ఎప్పటికి సిగ్నల్ దగ్గరికి చేరేనూ? ఎప్పటికి సిగ్నల్ దాటేను? మనమిలా ఫుట్‌పాత్ ఎక్కించకపోతే.. సిగ్నల్ దగ్గరికి వెళ్లేలోపు కనీసం మూడు, నాలుగుసార్లు ఎర్రలైటు వెలుగుతుంది. ఈ రష్లో, ఈ జామ్‌లో కారు వెళ్లాకే మనమూ వెళ్దామనుకుంటే కాలం పొద్దుగుంకిపోయి, జీవితం చీకటైపోతుంది. పైగా మనం లెఫ్ట్సైడ్కు వెళ్లాల్సిన సమయంలో మనకు ఫ్రీలెఫ్ట్ దారి కూడా వదలకుండా ఈ బూర్జువా పెత్తందారీ కార్లన్నీ మన దారికి అడ్డుగా నిలబడతాయి. లెఫ్ట్ వెళ్లాల్సిన మనకు దారి వదలాలన్న ధ్యాస కూడా ఉండదు. అందుకే తాజ్‌కృష్ణా నుంచి ఎర్రమంజిల్ చౌరస్తా దగ్గరా, చాదర్‌ఘాట్ నుంచి ఇమ్లీబన్‌కు వెళ్లేదారిలో, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో సిటీ సెంటర్‌కు కరెక్ట్‌గా ఆపోజిట్సైడ్లో.. ఇలా చాలా చోట్ల ద్విచక్రవాహనాలు ఫుట్‌పాత్‌ల మీదికి ఎక్కి, సిగ్నల్‌కు సమీపంగా వచ్చి.. సాఫీగా మొదటిసారే రెడ్ సిగ్నల్ మారే సమయంలో రోడ్డు దాటేస్తాయి. అంటే.. ఇది మనకు మనం చేసుకుంటున్న సామాజిక న్యాయమనే కదా అర్థం. అంతెందుకురా.. నగరం మధ్యనున్న ఎత్తయిన ట్రాక్‌లో రెలైళ్తుంటే దాన్ని మెట్రోరైలు అన్నట్లే.. ఎత్తయిన ఫుట్‌పాత్ మీద బెకైళ్తుంటే దాన్ని ‘మెట్రోబైక్’ అని పిలుచుకుని, అభివృద్ధికి అదే ఆనవాలని అన్వయించి చూసుకుని, ఆనందించరా పిచ్చివాడా. ఒరేయ్ పూర్‌ఫెలో.. ఇకనైనా థింక్ పాజిటివ్ రా’ అంటూ తన క్లాసు ముగించాడు మా బాసు. -
ఆన్లైన్లో హాట్‌బ్రాండ్
జ్యూట్ బ్యాగులపై ఆమె ఆర్ట్.. ఫ్యాషన్ ఐకాన్.. సెల్‌ఫోన్‌పై ఆమె సృజన.. నయూ ట్రెండ్... హైదరాబాద్ యుూత్ నుంచి ఆన్లైన్ దిగ్గజసంస్థ అమెజాన్ వరకు అందరూ ఆమె ఖాతాదారులే.. ‘సర్గా’ పేరుతో తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్న ఆమె పేరు కోవుల్ గోరుుల్.. హ్యూవున్ రిసోర్సెస్‌లో పీజీ చేసిన కోవుల్ ఇప్పుడు ఇంటి నుంచి కాలు కదపకుండానే తన వూర్కెట్ను విస్తరించుకుంటోంది. సోషల్ మీడియూ ద్వారా తన బ్రాండ్‌కు వ్యాల్యూ పెంచుకుంటోంది. సంప్రదాయ జ్యూట్‌బ్యాగులు, సెల్ఫోన్లపై కార్టూన్లు, పేర్లు, చిట్టిబొవ్ములను చిత్రించి వాటిని సరికొత్తగా రూపొందించడం కోవుల్ ప్రత్యేకత. ఒకప్పుడు హాబీగా మొదలెట్టిన ఈ కళే ఇప్పుడు ఆమెను బిజినెస్ ఐకాన్‌గా నిలబెట్టింది. సర్గా ఉత్పత్తుల ధర రూ.300 నుంచి రూ.800 లోపే. ట్రెండ్‌కు తగ్గట్టుగా, యుూత్కు నచ్చే విధంగా కోవుల్ తన వస్తువులకు నిత్యం కొత్తదనాన్ని జోడిస్తుంటారు. సోషల్ మీడియూ ద్వారా తన బిజినెస్ వురింతగా పుంజుకోవడం తనకెంతో సంతృప్తినిస్తున్నట్లు కోవుల్ పేర్కొంది. - సిద్ధాంతి -
పరభాషను ఒడిసిపట్టి.. వైవిధ్య కొలువు తలుపుతట్టి!
విదేశీ భాషలను నేర్చుకోవడంలో ముందుంటున్న నగర యువత మాతృభాష.. మనిషి మేధో వికాసానికి విలువైన వారధి! అలాంటి అమ్మ భాష ఆసరాగా విద్యా సుమాలను అందుకుంటూ, పరభాషలో ప్రావీణ్యం పెంచుకుంటోంది భాగ్యనగరం యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ.. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చుతున్న వేళ.. విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. అందుకే విదేశీ భాషను ఒడిసిపట్టి, వైవిధ్యమైన కొలువును చేజిక్కించుకుంటామంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తుతున్న నగరం. అనేక విదేశీ కంపెనీలు భాగ్యనగరంలో ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసుకుంటున్నాయి. ఇక్కడి కంపెనీలు కూడా విదేశీ కంపెనీలతో జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్నవారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్నవారు అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటున్నారు. నగరానికి చెందిన భార్యభర్తలు ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. ఓ కంపెనీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రముఖ కంపెనీ అడోబ్‌కు దరఖాస్తు చేసుకుంటే.. జర్మన్ భాషా పరిజ్ఞానం కలిగిన భార్యకు కంపెనీని నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో భర్తకు కూడా జర్మనీ నేర్పించే పనిలో పడింది ఆ ఇల్లాలు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు చదివి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్‌కు ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ లలో ఏదో ఒక భాష వచ్చి ఉండటం కెరీర్ ఉన్నతికి, మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవడానికి దోహదపడుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలోని పలు సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. అదనపు అర్హత: ఒక్క ఐటీ కంపెనీల్లోనే కాదు.. బ్యాంకింగ్, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు విదేశీభాషా నైపుణ్యాలు అదనపు అర్హతగా ఉపయోగపడతాయంటున్నారు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రొఫెసర్లు. కర్నూలు జిల్లా నుంచి నగరానికి వచ్చిన అనంతరాములు స్నేహితులతో కలిసి ‘లాటిన్’ నేర్చుకున్నాడు. విదేశీ బ్యాంకు హైదరాబాద్‌లో శాఖను ప్రారంభించి, ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకు వచ్చిన వారితో పోల్చితే రాములుకు తక్కువ మార్కులు వచ్చినా, లాటిన్ భాష ప్రత్యేకత ఉన్న ఆయన్నే ఉద్యోగం వరించింది. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన యువతకూ విదేశీ భాషలు ఉద్యోగ అవకాశాలకు ఆయువుపట్టుగా మారుతున్నాయి. అవకాశాలు ఇలా: విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్లేషన్. విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్‌ప్రెటర్స్ పని. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్‌ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. విదేశీ భాషలను నేర్చుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు ఎక్కువ కావడంతో.. ఫ్యాకల్టీకి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు.. తమ దగ్గర కోర్సులు పూర్తిచేసిన వారికి, వెంటనే భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జిస్తున్నారు. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దూరవిద్యలో: విదేశీ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇఫ్లూ ‘ది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్’ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, విదేశీ భాషలను నేర్పిస్తోంది. విదేశీ భాషలు నేర్చుకునేందుకు అవసరమైన పుస్తకాలను సైతం విక్రయిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని జర్మనీ సాంస్కృతిక సంస్థ గోథె జంత్రం (ఎౌ్ఛ్టజ్ఛ్డ్ఛ్టిటఠఝ) జర్మన్ భాషను, అలియన్స్ ఫ్రాంచైజ్ ఫ్రెంచి భాషలో కోర్సులను అందుబాటులో ఉంచాయి. విద్యార్థుల రోజువారీ చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా ఉదయం, సాయంత్రం బ్యాచ్‌లను నడుపుతున్నాయి. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని ‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్’.. ఏటా జనవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో విదేశీ భాషల తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ సంస్కృతం, హిందీతో పాటు ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్ వంటి విదేశీ భాషలను నేర్పుతున్నారు. ఔత్సాహికులు తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గతేడాది ఇక్కడ విదేశీ భాషలు నేర్చుకునేందుకు నాలుగు వేల మందికిపైగా ఆసక్తి కనబరచడం విశేషం. ఫీజులు: విదేశీ భాషలు నేర్చుకునేందుకు స్థాయిలనుబట్టి (లెవెల్ 1, లెవెల్ 2..) ఫీజులు వసూలు చేస్తున్నారు. సంస్థను బట్టి ఈ ఫీజులు రూ.1200 నుంచి రూ.5 వేల వరకు ఉంటున్నాయి. జర్మన్, ఫ్రెంచ్ భాషలకు అధిక ఫీజులుంటున్నాయి. ప్రముఖ సంస్థలు: హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇఫ్లూ.. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్డీ కూడా ఉంది. వెబ్సైట్: www.efluniversity.ac.in రామకృష్ణమఠం: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల తరగతులు నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.rkmath.org గోథె జంత్రం (Goethe-zentrum): జర్మన్లో ఎక్స్టెన్షివ్, ఇంటెన్షివ్ తదితర కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.goethe.de అలియన్స్ ఫ్రాంచైజ్: ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తోంది. వెబ్సైట్: www.alliancefranchise.org విదేశీభాషపై పట్టు సులభమే ఇతర భాషలను నేర్చుకోవటమంటే.. వారి సంస్కృతీ, సంప్రదాయాలను అర్థంచేసుకోవటమే. కేవలం ఉద్యోగావకాశాలకేకాకుండా.. ఆయా దేశాల ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, చరిత్ర తెలుసుకునే గొప్ప అవకాశం. ఇఫ్లూలో యూజీ నుంచి పీహెచ్ డీ వరకూ కోర్సులున్నాయి. ఇవిగాకుండా బయటి విద్యార్థుల కోసం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. వీటికి జనవరి-ఏప్రిల్, ఆగస్టు-నవంబరు నెలల్లో క్లాసులు ప్రారంభిస్తుంటాం. ప్రపంచీకరణ ప్రభావంతో విదేశీభాషలు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలకు ఢోకాలేదు. ఇఫ్లూలో బీఏ ఫైనలియర్లో ఉన్నప్పుడే ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. టెలిమార్కెటింగ్, బీపీవో, బ్యాంకింగ్, విదేశీ మంత్రిత్వశాఖ, దుబాసీలుగా మంచి అవకాశాలున్నాయి. ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, అరబిక్, జపనీస్ భాషలకు మంచి క్రేజ్ ఉంది. వీటిలో ఫ్రెంచ్, జర్మన్లదే హవా అని చెప్పాలి. ఇంగ్లిషును తేలిగ్గా నేర్చుకునే ఇక్కడి విద్యార్థులు మరికొంత శ్రమిస్తే.. విదే శీభాషలు అలవోకగా నేర్చుకోవచ్చు. -వెంకటరెడ్డి, రిజిస్ట్రార్(ఇఫ్లూ) -
ఐటీ కొలువుల్లో మేటి.. సిటీ
టాప్ స్టోరీ: హైదరాబాదీ యువతకు శుభవార్త. సర్కారీ ఉద్యోగాల సంగతెలా ఉన్నా.. కార్పొరేట్ జాబ్స్ కల నెరవేరనుంది. మహానగరం ‘జాబ్సిరి’కి స్వాగతం పలుకనుంది. ఎంతోకాలంగా ఊరిస్తున్న కార్పొరేట్ కొలువులు.. త్వరలోనే యువత ముంగిట వాలనున్నాయి. ఐటీ కంపెనీలు కాలేజీ క్యాంపస్‌ల ముందు క్యూ కట్టనున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో సిటీలో హైరింగ్ ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు! మళ్లీ ఐటీ బూమ్ ఖాయం: ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్, రిటైల్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరి ఉన్నాయి. వాటిలో కొలువుల కోసం నగర యువత ఎదురుచూస్తోంది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులతోపాటు వివిధ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా కార్పొరేట్ కంపెనీల నియామక ప్రకటనలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వేచి చూస్తున్నారు. ‘రాబోయే రెండు మూడు నెలల్లో ఐటీ రంగంలో మళ్లీ బూమ్ రానుంది. కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయబోతున్నాయి. కార్పొరేట్ సెక్టార్లో జాబ్స్ భారీగా పెరుగుతాయి. ఐటీ రంగంలో 60 శాతం మేర రిక్రూట్మెంట్ పెరుగుతుందని భావిస్తున్నాం. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా ఐటీతో పోటీపడనున్నాయి. ఇప్పటికే రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా ఈసారి ముందుగానే మొదలవుతాయని భావిస్తున్నాం’ అని నెస్టార్ సోర్సింగ్ కన్సల్టెంట్ నిర్వాహకులు అజయ్ పడ్నేకర్ తెలిపారు. సుస్థిర ప్రభుత్వాలతో భరోసా: నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల సందడి. మరోవైపు రాష్ట్ర విభజన గందరగోళం. దాంతో కంపెనీలు రిక్రూట్మెంట్లను వాయిదా వేశాయి. గతంలో ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు సైతం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేందుకు సాహసించలేకపోయాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాంతో నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కంపెనీలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగానే హైరింగ్ ప్రక్రియ ప్రారంభించాయి. ఇప్పుడిప్పుడే ఐటీలో సీనియర్ లెవల్లో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయని ఆర్.సి.హెచ్.ఆర్ సొల్యూషన్స్ ప్రతినిధి వెల్లడించారు. భారీఎత్తున నియామకాలు జరపకపోయినా.. గతంతో పోల్చితే చాలా బెటర్‌గా ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. అవకాశాలను చేజిక్కించుకోవాలి: ‘‘గతేడాది కొత్త ఉద్యోగాల నియామకం పెద్దగా లేకపోవడం కుర్రకారు వేగానికి కళ్లెం వేసింది. ఐటీ కంపెనీల్లో ‘జంప్‌జిలానీ’ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కంపెనీల కోణంలో ఇది మంచి పరిణామమే. ఐటీ కొలువులకు చైనా పోటీ అనుకోవద్దు. ఆంగ్ల భాషపై మన హైదరాబాద్ విద్యార్థులకు మంచి పట్టుంది. మన విద్యార్థులు ఇంగ్లిష్‌ను చాలా త్వరగా నేర్చుకోగలరు. ఐటీ రంగం ఒక్కటే కాదు.. బ్యాంకింగ్ రంగంలోనూ బోలెడు ఉద్యోగ అవకాశాలు యువత ముందుకు వస్తున్నాయి. ఇంగ్లిష్‌ను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకుంటూ.. అందివస్తున్న అవకాశాలను చేజిక్కించుకోవడమే ఇప్పుడు యువతీ, యువకుల లక్ష్యం కావాలి’’ అంటూ విశ్లేషించారు ఇఫ్లూ రిటైర్డ్ ఆచార్యులు జి.ఎస్.ఆర్.కె.బాబూరావు. ముంబై, పుణె, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ భద్రతకు మారుపేరు. తక్కువ ఖర్చుతో ఉన్నతస్థాయి జీవనం గడిపే వీలున్న నగరం కావడం కూడా కంపెనీలు ఇక్కడకు రావడానికి మరో కారణం. కొత్త కంపెనీలు రావడం, ఇక్కడి కంపెనీలు కొత్త రాష్ట్రంలోనూ ఏర్పాటయ్యే నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు అమీర్‌పేటలోని ప్రముఖ కన్సల్టెన్సీ నిర్వాహకులు. కేవలం ఐటీకే పరిమితం కాకుండా.. మానవ వనరులు, ఆడిట్స్, అకౌంట్స్ తదితర విభాగాల్లోనూ నియామక ప్రక్రియ ఆశాజనకంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఐటీయేతర రంగాల్లోనూ అవకాశాలు: గతంతో పోల్చితే ఈ ఏడాది ఐటీ రంగం అధికంగా ఉద్యోగాలు కల్పిస్తుందని కాలేజీల ప్లేస్‌మెంట్స్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గత విద్యాసంవత్సరం అక్టోబర్‌లో రిక్రూట్మెంట్స్ ప్రారంభమయ్యాయి. అదీ కూడా అరకొరగానే! ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లోనే ఐటీ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్‌కు వస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ పరంగా ఇది శుభపరిణామం. ఐటీ రంగంలో ఈ దఫా ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయనే భావిస్తున్నాం. మెకానికల్, సివిల్, ఫైనాన్స్ వంటి ఐటీయేతర రంగాలు ఆగస్టు తర్వాత రిక్రూట్మెంట్స్ మొదలుపెడతాయనే సమాచారం ఉంది అంటున్నారు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ వి.ఉమామహేశ్వరరావు. స్కిల్స్ పెంచుకుంటే మేలు: గతేడాది అక్టోబర్‌లో ఐటీ, ఐటీఈఎస్‌లో హైరింగ్ కేవలం 4 శాతం. కానీ ఈ ఏడాది అదే అక్టోబర్ నాటికి 15 శాతం పెరగొచ్చంటున్నారు ప్రముఖ కళాశాలల ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లు. బీపీఓ సెక్టార్లో 13 శాతం నుంచి 20 శాతం మేర రిక్రూట్మెంట్ ఉంటుందంటున్నారు. ఈ ఏడాది నియామకాల్లో ఐటీ, బీపీవో, బ్యాంకింగ్, ఫార్మా, టెలికాం రంగాల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉండబోతుందనేది నిపుణుల అంచనా. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు 50 వేల ఉద్యోగాలను కల్పించనున్నాయి. ఇటీవలే కరూర్ వైశ్యాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, సహకార బ్యాంకులు 10 వేల మంది ఉద్యోగులను నియమించేందుకు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఇప్పటివరకూ నింపాదిగా ఉన్న ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, ఆటోమొబైల్ రంగ సంస్థలు చేపట్టనున్న ‘హైరింగ్’లో జాబ్‌ను సొంతం చేసుకునే దిశగా అందుకు అవసరమైన స్కిల్స్‌తో యువత సిద్ధం అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.