సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తామని..స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుపుతామని జీహెచ్‌ఎంసీ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛ నగరం కోసం పలు ప్రణాళికలు మారుస్తూ దేన్నీ పూర్తి చేయడం లేదు. ఆ తంతు ఒక ఎత్తు కాగా, కనీసం ప్రజల నుంచి ‘ఫీడ్‌బ్యాక్’ తీసుకునే అంశంలోనూ పూర్తి శ్రద్ధ చూపలేదు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2020’ మొత్తం 6 వేల మార్కులకు కాగా.. అందులో 1500 మార్కులు నగర పౌరుల ఫీడ్‌బ్యాక్‌కే ఉన్నాయి. గతంలో వివిధ అంశాల్లో నగరం మెరుగ్గా ఉన్నప్పటికీ ఫీడ్‌బ్యాక్‌లో వెనుకబడినందునే ర్యాంక్ తగ్గిందని చెప్పుకున్నారు. ఆ విషయం తెలిశాకైనా ఫీడ్‌బ్యాక్ అంశంలో మెరుగుపడేందుకు చర్యలు తీసుకోలేదు. ఈనెల 4 నుంచి 31వ తేదీ వరకు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను నాలుగు విధాలుగా తెలియజేయవచ్చు. వెబ్‌సైట్, యాప్, ఫోన్‌ల ద్వారా ఇందుకు అవకాశముంది. ఈ విషయాల్ని నగర పౌరులకు తెలియజేయడంతోపాటు.. ఫీడ్‌బ్యాక్‌లో భాగంగా ఉండే ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేలా అవగాహన కల్పించాలి.
ఇందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ.. సకాలంలో కాకుండా గడువు ముగియనున్న తరుణంలో కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లే ఎంటమాలజీ సిబ్బందికి స్వచ్ఛసర్వేక్షణ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలిచ్చి పంపుతున్నారు. ఈ పుస్తకాల్లో వారు ఇంటిలోని వారి పేరు రాయడంతో పాటు మొబైల్ నెంబర్ వేయాలి. వారికి స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి తెలియజేయడంతో పాటు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరి.. వారి మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలి. యాప్ డౌన్‌లోడ్ అయ్యాక ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఓటీపీ నమోదు చేయడం తదితరమైనవి వివరించాలి. ఇవన్నీ చేశాక ఫీడ్‌బ్యాక్‌లోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా సూచించాలి. ఈ పనులు చేసినట్లు వారి సంతకం కూడా తీసుకోవాలి.
వారి వద్ద మొబైల్ ఫోన్ లేకుంటే.. తమ మొబైల్ ఫోన్ నుంచైనా వారి పేరు.. వివరాలతో ఫీడ్‌బ్యాక్ పంపించాలని నిర్ణయించారు. తద్వారా ఎంతమంది ఫీడ్‌బ్యాక్ పంపించారో తెలుసుకునేందుకు వీలవుతుంది.దీంతోపాటు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే మిగతా విధానాలను కూడా తెలియజేయాలని కూడా భావించారు. ఈ వివరాలు నమోదు చేసేందుకు ముద్రించిన పుస్తకాలు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి. ఇవన్నీ సర్కిళ్లకు.. అక్కడినుంచి ఎంటమాలజీ సిబ్బందికి చేరి.. వారు ఇంటింటికీ వెళ్లేందుకు సెలవులు పోను మిగిలింది దాదాపు ఐదు రోజులు. ఈ స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ద్వారా ఏమేరకు ప్రయోజనం లభించగలదో సంబంధిత అధికారులకే తెలియాలి. నాలుగో తేదీనుంచే ఈ సర్వే ఉందని తెలుసు. అప్పటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేది. తీరా గడువు ముగుస్తున్న సమయంలో చేస్తున్న ఈ ప్రయత్నం పుస్తకాల మద్రణ ఖర్చు తప్ప.. పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించి అడిగే ప్రశ్నల్లో ‘మీ ఇంటి వ్యర్థాలను తడి,పొడి వేర్వేరుగా ఇవ్వమని మీ చెత్త సేకరించే వాళ్లు అడుగుతున్నారా ? అనేది ఒక ప్రశ్న. దీనికి ‘అవును.. ప్రతిసారి’ అని సమాధానం ఇవ్వాల్సిందిగా చెప్పమని ఎంటమాలజీ సిబ్బందికి సూచిస్తున్నారు కానీ.. వారా విషయం చెప్పగలరా అన్నదే అంతుబట్టడం లేదు. ఎందుకంటే.. వాస్తవానికి నగరంలో తడిపొడి వేరు చేసి ఇవ్వమని అడుతున్నవారు లేరు సరికదా.. అవగాహన ఉన్న కొన్ని కుటుంబాల వారు వేరుచేసి ఇచ్చిన చెత్తను సైతం కలగలిపే ఆటోల్లో తీసుకెళ్తున్నారు.
గత నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనగర ర్యాంకు వెనుకబడిందిలా..
సంవత్సరం ర్యాంక్
2016 19
2017 22
2018 27
2019 35
Comments
Please login to add a commentAdd a comment