feed back
-
ఎఫ్‌అండ్‌వో చర్చాపత్రంపై సెబీకి భారీగా ఫీడ్‌బ్యాక్
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌కి సంబంధించి విడుదల చేసిన చర్చాపత్రంపై దాదాపు 6,000కు పైగా పరిశ్రమవర్గాల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. ఆ ఫీడ్‌బ్యాక్ మొత్తాన్ని టెక్నాలజీ ద్వారా వేగవంతంగా ప్రాసెస్ చేసినట్లు ఆమె చెప్పారు. నిఘా, ప్రాసెసింగ్‌ను మెరుగుపర్చేందుకు పలు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సాంకేతికతలపై సెబీ పని చేస్తోందని మాధవి వివరించారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి సంబంధించి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, డెరివేటివ్ మార్కెట్లలో స్థిరత్వం తెచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై జూలైలో సెబీ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. కనీస కాంట్రాక్టు సైజును పెంచడం, పొజిషన్ లిమిట్స్‌ను ఇంట్రా–డేలో పర్యవేక్షించడం, స్ట్రైక్ ప్రైస్‌లను క్రమబదీ్ధకరించడం, నియర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ మార్జిన్‌ను పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
‘భరోసా’ మరింత పెంచేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళ భద్రతా విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న భరోసా కేంద్రాల్లో బాధితులకు భరోసా మరింత పెంచడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. భరోసా కేంద్రాలకు సాయం కోసం వచ్చిన బాధితుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. లైంగికదాడులు, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికలో పోలీస్, న్యాయ, వైద్య సాయం అందించేందుకు రూపొందించిన ఈ కేంద్రాల్లో.. సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది? సకాలంలో స్పందిస్తున్నారా? ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? భరోసా సెంటర్‌కు అదే రోజు తీసుకెళ్లారా? మీతో లేడీ కానిస్టేబుల్ వచ్చారా? పోలీసులు వారి వాహనంలోనే తీసుకెళ్లారా? భరోసా సెంటర్లో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? కేసుల ఫాలోఅప్ సక్రమంగా ఉంటోందా? లైంగిక దాడులకు గురైన చిన్నారుల విషయంలో కేంద్రాల సిబ్బంది సరైన రీతిలో స్పందిస్తున్నారా? సేవల్లో ఇంకేమైనా లోపాలున్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాదు.. బాధిత మహిళలకు మరింత అండగా నిలిచేందుకు ఇంకా ఏయే చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు కూడా కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
సామాన్యులపై సర్వీస్ ఛార్జీల పేరుతో బాదుడు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: పేమెంట్ వ్యవస్థల వినియోగంపై ఫీజులు, చార్జీల గురించి అభిప్రాయాలను తెలపాల్సిందిగా ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరుతోంది. ఇందుకోసం నిర్దిష్టంగా 40 ప్రశ్నలను రూపొందించింది. అక్టోబర్ 3లోగా వీటికి సమాధానాలు పంపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్), నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మొదలైన చెల్లింపుల విధానాలు ఉన్నాయి. వీటిని నిర్వహిస్తున్నందుకు గాను ఆయా సంస్థలకు ఆర్థికంగా కొంత లబ్ధి చేకూర్చేందుకు అలాగే ప్రజలు చౌకగా వీటిని వినియోగించుకోగలిగేందుకు చార్జీలు సహేతుకంగా ఉండేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. -
పాఠం అర్థమవుతోందా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని పిల్లల కోసం తలపెట్టిన ఆన్లైన్/వీడియో పాఠాలను విద్యార్థులు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఇందుకోసం ఆన్లైన్ బోధనపై విద్యార్థుల అభిప్రాయం(ఫీడ్‌బ్యాక్) ఏమిటో తెలుసుకునేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను గురుకుల సొసైటీలు రూ పొందించాయి. ఆన్లైన్, వీడియో పాఠాల ద్వారా అర్థమవుతున్న తీరుపై టీచర్లు నేరుగా విద్యార్థులతో మాట్లాడతారు. ఈమేరకు ఫార్మాట్లో నిర్దేశించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకుని ఆమేరకు ఫార్మాట్‌ను పూర్తి చేయాలి. సబ్జెక్టుల వారీగా పరిశీలన బాధ్యతలను సొసైటీలు ఆయా సబ్జెక్టు టీచర్లకు అప్పగించాయి. నిర్దేశించిన ఫార్మాట్‌ను పూరించేందుకు సబ్జెక్టు టీచర్లు నేరుగా విద్యార్థికి ఫోన్ చేసేందుకు వీలుగా ఇప్పటికే ఫోన్ నంబర్ల జాబితాను సేకరించారు. గురుకుల సొసైటీలు తొలుత టీశాట్ ద్వారా వీడియో పాఠాలను మొదలుపెట్టగా..ఆ తర్వాత పాఠశాలల వారీగా విద్యార్థుల వాట్సాప్ నంబర్లను సేకరించి ఆయా సబ్జెక్టు టీచర్లు ఆన్లైన్ పాఠాలను జూమ్ యాప్‌ల ద్వారా బోధించారు. ప్రభుత్వం కూడా యాదగిరి చానల్ ద్వారా వీడియో పాఠాలను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో తెరవకపోవడంతోనే... వాస్తవానికి ఈపాటికే సమ్మెటీవ్, ఫార్మెటీవ్ పరీక్షలు నిర్వహించి పిల్లల సామర్థ్యాలను పరిశీలించాలి. కానీ విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో తెరవకపోవడం, విద్యార్థులు బడులకు రాకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఏమేరకు పాఠాలు అర్థమవుతున్నాయో తెలిస్తే మరింత మెరుగైన పద్ధతుల్లో బోధన కార్యక్రమాలు సాగించవచ్చని గురుకుల సొసైటీలు యోచిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా సబ్జెక్టు టీచర్లంతా నిర్దేశించిన ఫార్మాట్‌కు తగినట్లుగా పరిశీలన చేసి నివేదికలను పాఠశాలలో సమర్పించాలి. అనంతరం వాటిని జిల్లాస్థాయిలో క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి సమర్పిస్తారు. అక్కడ రాష్ట్రస్థాయిలో మరోసారి క్రోడీకరించిన తర్వాత పరిశీలనపై ఓ అంచనాకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ ఈనెలాఖరుకల్లా పూర్తికానుంది. -
మీ అభి‘మత’మేంటి?
సాక్షి, హైదరాబాద్: ఒకపక్క కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు కేంద్రం భారీ సడలింపులు ఇస్తుండటంతో క్రమంగా జన జీవితం మళ్లీ సాధారణస్థితికి చేరుకుంటోంది. దుకాణాలు తెరుచుకుంటున్నాయి, ప్రజా రవాణా ప్రారంభమైంది. మరి ప్రార్థన మందిరాలు ఎప్పుడు తెరుచుకుంటాయి? ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న అంశమిది. వీటి విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకసారి ప్రార్థన మందిరాలు తెరుచుకుంటే వాటిని నియంత్రించటం అంత సులువు కాదని కేంద్రం అభిప్రాయపడుతోంది. (జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు) ఈ క్రమంలోనే సామూహిక, బహిరంగ ధార్మిక కార్యక్రమాలపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యకలాపాలు మొదలైతే జనసమూహాలు ఏర్పడతాయని భావిస్తోన్న కేంద్రం.. వాటిని ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లాంటి కొన్ని దేశాల్లో ధార్మిక కార్యక్రమాలతో కరోనా కేసులు తీవ్రంగా పెరిగినట్టు స్వయంగా ఆయా దేశాల్లో అధికారికంగా సమాచారం వెల్లడైంది. ఇప్పటివరకు ఆ విషయంలో మన దేశం సురక్షితంగా ఉంది. అన్ని మతాల ప్రార్థన మందిరాలు మూసే ఉంచటంతోపాటు వేడుకల్ని ప్రభుత్వం నిషేధించింది. పూర్తిగా అంతర్గత కార్యక్రమంగా రోజువారీ ప్రార్థనలు, ఉత్సవాలకు అనుమతించింది. దేవాలయాల్లో అర్చకులు, మసీదుల్లో మౌజమ్‌లు, చర్చ్‌లలో ఫాదర్లు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప భక్తులకు ప్రవేశం కల్పించరాదని ఆదేశించింది. దాన్ని కచ్చితంగా అమలు చేస్తుండటంతో ధార్మిక కార్యక్రమాలపరంగా ఇంతకాలం ఎలాంటి చింత లేదు. ఇప్పుడు లాక్డౌన్ సడలింపుల జాబితాలో ప్రార్థన మందిరాలను చేరిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కొన్ని సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. దీంతో కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. అక్కడి నుంచివచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, ఈనెల 31తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం తీసుకోనుంది. బహిరంగ ఉత్సవాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి వద్దు గతంలో ఎన్నడూ లేనట్టు దాదాపు రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు మూసే ఉన్నాయి. వాటినింకా మూసి ఉంచటం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో వాటిని ప్రత్యేక షరతులకు లోబడి తెరిచేందుకు అనుమతించాలనే విషయమై చర్చ జరుగుతోంది. రోజూ వేల మంది భక్తులు వచ్చే ప్రధాన ఆలయాల్లోకి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తూ కరోనా నిబంధనలు పాటించాలనే షరతు విధించనున్నట్టు సమాచారం. చిన్న ప్రార్థన మందిరాల్లో ఒకసారి పదిమందికి మించకుండా భక్తులను అనుమతించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనాలయాలకు ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలనేది ఒక ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు సామూహిక ప్రార్థనలు, బహింరంగ వేడుకలు, ఉత్సవాలు, ప్రదర్శనలు, యాత్రలు నిర్వహించకుండా ఆంక్షలు కొనసాగించనున్నారు. దేవాలయాల్లోనే కాక బహిరంగ ప్రాంతాల్లో ధార్మిక వేడుకలు నిర్వహించరాదని కూడా ఆంక్షల్లో చేరుస్తారన్న చర్చ నడుస్తోంది. ఇక వేడుకల పేరుతో అన్నదాన వితరణ, ప్రసాదాల పంపిణీపై కూడా ఆంక్షలుండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల దక్షిణ బంగ్లాదేశ్‌లోని ఓ పట్టణంలో స్థానిక సంస్థ ఒకటి ప్రభుత్వం వద్దంటున్నా వినకుండా బహిరంగ ప్రదేశంలో 10వేల మందితో సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. పాకిస్తాన్లో వైద్యుల సంఘం అభ్యంతరం చెప్పినా.. సామూహిక ప్రార్థనలకు అనుమతించారు. ఈ రెండుచోట్లా ఒక్కసారిగా కరోనా కేసులు బాగా పెరిగాయి. ఈ అంశాలన్నింటినీ కేంద్రం పరిశీలిస్తోంది. రాష్ట్రాల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. వాటిని తెరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక సూచనలు చేయనుంది. -
ఇలా అయితే ‘స్వచ్ఛ ర్యాంకు’ ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తామని..స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుపుతామని జీహెచ్ఎంసీ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛ నగరం కోసం పలు ప్రణాళికలు మారుస్తూ దేన్నీ పూర్తి చేయడం లేదు. ఆ తంతు ఒక ఎత్తు కాగా, కనీసం ప్రజల నుంచి ‘ఫీడ్‌బ్యాక్’ తీసుకునే అంశంలోనూ పూర్తి శ్రద్ధ చూపలేదు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2020’ మొత్తం 6 వేల మార్కులకు కాగా.. అందులో 1500 మార్కులు నగర పౌరుల ఫీడ్‌బ్యాక్‌కే ఉన్నాయి. గతంలో వివిధ అంశాల్లో నగరం మెరుగ్గా ఉన్నప్పటికీ ఫీడ్‌బ్యాక్‌లో వెనుకబడినందునే ర్యాంక్ తగ్గిందని చెప్పుకున్నారు. ఆ విషయం తెలిశాకైనా ఫీడ్‌బ్యాక్ అంశంలో మెరుగుపడేందుకు చర్యలు తీసుకోలేదు. ఈనెల 4 నుంచి 31వ తేదీ వరకు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను నాలుగు విధాలుగా తెలియజేయవచ్చు. వెబ్సైట్, యాప్, ఫోన్ల ద్వారా ఇందుకు అవకాశముంది. ఈ విషయాల్ని నగర పౌరులకు తెలియజేయడంతోపాటు.. ఫీడ్‌బ్యాక్‌లో భాగంగా ఉండే ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేలా అవగాహన కల్పించాలి. ఇందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ.. సకాలంలో కాకుండా గడువు ముగియనున్న తరుణంలో కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లే ఎంటమాలజీ సిబ్బందికి స్వచ్ఛసర్వేక్షణ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలిచ్చి పంపుతున్నారు. ఈ పుస్తకాల్లో వారు ఇంటిలోని వారి పేరు రాయడంతో పాటు మొబైల్ నెంబర్ వేయాలి. వారికి స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి తెలియజేయడంతో పాటు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరి.. వారి మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. యాప్ డౌన్లోడ్ అయ్యాక ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఓటీపీ నమోదు చేయడం తదితరమైనవి వివరించాలి. ఇవన్నీ చేశాక ఫీడ్బ్యాక్లోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా సూచించాలి. ఈ పనులు చేసినట్లు వారి సంతకం కూడా తీసుకోవాలి. వారి వద్ద మొబైల్ ఫోన్ లేకుంటే.. తమ మొబైల్ ఫోన్ నుంచైనా వారి పేరు.. వివరాలతో ఫీడ్‌బ్యాక్ పంపించాలని నిర్ణయించారు. తద్వారా ఎంతమంది ఫీడ్‌బ్యాక్ పంపించారో తెలుసుకునేందుకు వీలవుతుంది.దీంతోపాటు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే మిగతా విధానాలను కూడా తెలియజేయాలని కూడా భావించారు. ఈ వివరాలు నమోదు చేసేందుకు ముద్రించిన పుస్తకాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి. ఇవన్నీ సర్కిళ్లకు.. అక్కడినుంచి ఎంటమాలజీ సిబ్బందికి చేరి.. వారు ఇంటింటికీ వెళ్లేందుకు సెలవులు పోను మిగిలింది దాదాపు ఐదు రోజులు. ఈ స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ద్వారా ఏమేరకు ప్రయోజనం లభించగలదో సంబంధిత అధికారులకే తెలియాలి. నాలుగో తేదీనుంచే ఈ సర్వే ఉందని తెలుసు. అప్పటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేది. తీరా గడువు ముగుస్తున్న సమయంలో చేస్తున్న ఈ ప్రయత్నం పుస్తకాల మద్రణ ఖర్చు తప్ప.. పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించి అడిగే ప్రశ్నల్లో ‘మీ ఇంటి వ్యర్థాలను తడి,పొడి వేర్వేరుగా ఇవ్వమని మీ చెత్త సేకరించే వాళ్లు అడుగుతున్నారా ? అనేది ఒక ప్రశ్న. దీనికి ‘అవును.. ప్రతిసారి’ అని సమాధానం ఇవ్వాల్సిందిగా చెప్పమని ఎంటమాలజీ సిబ్బందికి సూచిస్తున్నారు కానీ.. వారా విషయం చెప్పగలరా అన్నదే అంతుబట్టడం లేదు. ఎందుకంటే.. వాస్తవానికి నగరంలో తడిపొడి వేరు చేసి ఇవ్వమని అడుతున్నవారు లేరు సరికదా.. అవగాహన ఉన్న కొన్ని కుటుంబాల వారు వేరుచేసి ఇచ్చిన చెత్తను సైతం కలగలిపే ఆటోల్లో తీసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్లోనగర ర్యాంకు వెనుకబడిందిలా.. సంవత్సరం ర్యాంక్ 2016 19 2017 22 2018 27 2019 35 -
థర్డ్ పార్టీ చెక్‌చేస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పనితీరు, స్టేషన్లలో బాధితులతో వ్యవహరిస్తున్న తీరుపై థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ అందిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ముందస్తుగా హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన సిటిజన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థ విజయవంతం అయ్యింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఈ వ్యవస్థను జిల్లాల్లోనూ అమలు చేస్తున్నారు. ప్రతీ నెలా అన్ని జిల్లాలు, నూతన కమిషనరేట్ల పరిధిలో పోలీసుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై... మారుమూల స్టేషన్ నుంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న ఠాణాల వరకు ప్రతీచోట ఏం జరుగుతోంది? ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో సిబ్బంది, అధికారులు ప్రవర్తించే తీరు ఎలా ఉంటోంది? రిసెప్షన్ సెంటర్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు? సంఘటనా స్థలికి పెట్రోలింగ్, బ్లూకోట్స్ సిబ్బంది ఎంత సమయంలో వస్తున్నారు? పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎలా పని చేస్తోంది? మర్యాదపూర్వకంగా ఉందా? లేకా డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా.. ఇలా ప్రధానంగా నాలుగు అంశాలతో థర్డ్ పార్టీతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతీ ఫిర్యాదుదారుడికి థర్డ్ పార్టీ నుంచి ఫోన్‌కాల్ వెళ్తుంది.. స్టేషన్లో అధికారి, సిబ్బంది వ్యవహరించిన తీరుపై 1 నుంచి 10 వరకు గ్రేడింగ్ ఇస్తారు. ఇలా నాలుగు అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతీ నెలా ఈ ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ జోన్ల ఐజీలకు అందుతోంది. గ్రేడింగ్ వారీగా... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600కి పైగా పోలీస్స్టేషన్ల నుంచి వచ్చే నివేదికలను ఐజీలు పరిశీలించి థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ నుంచి వచ్చిన మార్కుల ఆధారంగా ఆ ఠాణా అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జోనల్, జిల్లా మీటింగ్‌ల్లో సంబంధిత స్టేషన్, అధికారి, సిబ్బందికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే పనితీరు సరిగా లేని ఠాణా, సర్కిల్, డివిజన్ల అధికారులతో చర్చించి పనితీరు మార్చుకునేలా ఐజీలు, సంబంధిత ఎస్పీ/కమిషనర్లు కృషిచేస్తున్నారు. ఏకరూప పోలీసింగ్‌లో ఇది కీలకమని, ప్రతీ చోటా పోలీస్ సేవలు పారదర్శకంగా, అంకితభావంతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు మంచిపేరు తెచ్చేలా సిబ్బందిని, అధికారులను ప్రోత్సహించేందుకు ఈ సిటిజన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. -
రైల్వే సేవలపై నిఘా నేత్రం
సాక్షి, న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణీకులకు అందించే సేవలపై అనుక్షణం పర్యవేక్షించేందుకు సివిల్ డ్రెస్‌లో ఉండే అధికారుల నియామకానికి రైల్వేలు కసరత్తు చేస్తున్నారు. రైళ్లలో ప్రయాణీకుల పట్ల సిబ్బంది ప్రవర్తన, ఆహార పదార్థాల నాణ్యతను ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ వీరు పర్యవేక్షిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధారణ ప్రయాణీకుల వలే వీరు రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఆహార పదార్థాలను కొనుగోలు చేసి వాటి నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, సౌకర్యాలపై ఫీడ్‌బ్యాక్ ఇస్తారని వెల్లడించాయి. సిబ్బంది సామర్థ్యం ఆధారంగా వారికి రేటింగ్ ఇస్తారని వెల్లడించాయి. రైల్వే సేవలను మెరుగుపరిచే క్రమంలో మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న పలు చర్యల్లో ఇవి ఓ భాగమని తెలిపాయి. ప్రయాణీకులు, సిబ్బంది, ఇతర అధికారులతో మాట్లాడటం ద్వారా వారు చెప్పిన అంశాల ప్రాతిపదికన ఈ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పిస్తారు. ఈ సేవలకు అవసరమైన సిబ్బంది నియాకంపై రైల్వే బోర్డు కసరత్తు చేస్తున్నదని, వీటిలో ఎన్జీవోలు, పౌర సమాజ సంస్థల సేవలను తీసుకోవాలా అనే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. -
ఏం సాధించారనో.. ఈ ఫీడ్‌బ్యాక్
విజయనగరం కంటోన్మెంట్: అధికారులు నిర్వహించిన విజయనగర్ ఉత్సవ్ కార్యక్రమంపై యంత్రాంగం ఫీడ్ బ్యాక్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వచ్చే సందర్శకులకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది.. నిర్వహణలో ఏమేం లోపాలున్నాయి.. ఏఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న వివరాలతో కూడిన అభిప్రాయాలను ముద్రించిన ఓ కార్డును అందజేశారు. సందర్శకులు హాజరయ్యే వివిధ వేదికల వద్ద వీటిని పంపిణీ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. విజయనగర్ ఉత్సవ్–2017 ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ముద్రించిన ఈ కార్డును అందరూ అందుకున్నారు తప్ప చాలా మంది వీటిపై అభిప్రాయాలను తెలియజెప్పేందుకు సాహసించలేదు. పలువురు మాత్రం నిర్వహణ బాగాలేదనీ, ప్రోగ్రాంలు కొన్ని బావున్నాయన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే చాలా మంది ఉత్సవ నిర్వహణపై అసంతృప్తిగా ఉండటంతో ఎటువంటి అభిప్రాయాలనూ వ్యక్తం చేయలేదు. మనకెందుకీ గొడవని సద్దుమణిగి ఉండిపోయిన వారు కొందరయితే మరికొందరు నిర్మొహమాటంగా ఉత్సవ్ నిర్వహణ బాగాలేదని నేరుగా సమాధానమిచ్చారు. సమాచార కేంద్రాలు, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ఫెయిర్లు, స్టాంపు కరెన్సీ సేకరణ, ఫ్లవర్ షో తదితర పది అంశాలపై బాగుంది, పర్వాలేదు, బాగాలేదన్న ఛాయిస్ ఇచ్చి టిక్ చేయమంటూ అందించిన కార్డులకు జనం పెద్దగా స్పందించలేదు. -
కొన్న దాని గురించి... ఎక్కువ చెడే చెబుతారు!
మార్కెట్లోకి వచ్చిన ఏదైనా కొత్త వస్తువును కొన్న వారు దాని పని తీరు గురించి తమకు తెలిసిన వారికి ఇచ్చే ఫీడ్ బ్యాక్ విషయంపై ఒక ఆసక్తికరమైన సర్వే వెలుగులోకి వచ్చింది. ఇంట్లో వాడే వస్తువుల విషయంలోనైనా, అధునాతన మొబైల్ ఉపకరణాల విషయంలోనైనా, మోటార్ బైక్‌లు, కారుల విషయంలోనైనా కొత్తగా వాటిని వాడిన వారు తమ అనుభవాలను ఇరుగూపొరుగుతో పంచుకొనే తీరు గురించి ఈ సర్వే జరిగింది. దీని ప్రకారం వస్తువుల విషయంలో పాజిటివ్ కంటే, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌కే ఎక్కువ ప్రచారం లభిస్తోందట. అంటే... ఒక వస్తువును కొన్న వారు అది సరిగా పనిచేయకపోతే దాని గురించి తెలిసినవారికీ, తెలియని వారికీ అడిగినా, అడగకపోయినా చెప్పేస్తుంటారట. అదే వస్తువు బాగా పనిచేస్తే మాత్రం దానిలోని సానుకూల అంశం గురించి చాలా తక్కువ మందికి చెబుతున్నారట. వస్తువు లేదా సేవల విషయంలో అసంతృప్తితో ఉన్న అనేక మందికి దాని లోపాలు చెప్పి తమ బాధను దించేసుకొంటున్నారు. దీంతో మార్కెట్లోకి విడుదల అయిన వస్తువుల విషయంలో నెగిటివ్ టాక్ మొదలైందటే అది శరవేగంగా పాకిపోతుందని అధ్యయనకర్తలు విశ్లేషించారు. అదే బాగా పనిచేసే వస్తువుల విషయం గురించి మాత్రం ప్రచారం చాలా నిదానంగా ఉంటుందని, తాము కొన్న వస్తువు బాగా పనిచేస్తోందని అదేపనిగా గుర్తుతెచ్చుకొని చెప్పే వారు చాలా తక్కువమంది ఉన్నారని అధ్యయనకర్తలు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60 శాతం మందిలో వస్తువుపై ఉన్న అసంతృప్తిని ఏకరువు పెట్టుకొనే అలవాటు కనిపించిందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. మిగిలిన వారు మాత్రం చూసీ చూడనట్టుగా ఉంటారట. వస్తువు బాగా పనిచేస్తే దాన్ని ఇతరులకు చెప్పుకొని ఆనంద పడే వారి శాతం 40. మిగిలిన వారు మాత్రం కొన్న వస్తువు బాగా పనిచేస్తుందన్న విషయాన్ని ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట.