ఫీడ్ బ్యాక్ కార్డులివే
విజయనగరం కంటోన్మెంట్: అధికారులు నిర్వహించిన విజయనగర్ ఉత్సవ్ కార్యక్రమంపై యంత్రాంగం ఫీడ్ బ్యాక్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వచ్చే సందర్శకులకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది.. నిర్వహణలో ఏమేం లోపాలున్నాయి.. ఏఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న వివరాలతో కూడిన అభిప్రాయాలను ముద్రించిన ఓ కార్డును అందజేశారు. సందర్శకులు హాజరయ్యే వివిధ వేదికల వద్ద వీటిని పంపిణీ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
విజయనగర్ ఉత్సవ్–2017 ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ముద్రించిన ఈ కార్డును అందరూ అందుకున్నారు తప్ప చాలా మంది వీటిపై అభిప్రాయాలను తెలియజెప్పేందుకు సాహసించలేదు. పలువురు మాత్రం నిర్వహణ బాగాలేదనీ, ప్రోగ్రాంలు కొన్ని బావున్నాయన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే చాలా మంది ఉత్సవ నిర్వహణపై అసంతృప్తిగా ఉండటంతో ఎటువంటి అభిప్రాయాలనూ వ్యక్తం చేయలేదు. మనకెందుకీ గొడవని సద్దుమణిగి ఉండిపోయిన వారు కొందరయితే మరికొందరు నిర్మొహమాటంగా ఉత్సవ్ నిర్వహణ బాగాలేదని నేరుగా సమాధానమిచ్చారు. సమాచార కేంద్రాలు, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్‌ఫెయిర్‌లు, స్టాంపు కరెన్సీ సేకరణ, ఫ్లవర్ షో తదితర పది అంశాలపై బాగుంది, పర్వాలేదు, బాగాలేదన్న ఛాయిస్ ఇచ్చి టిక్ చేయమంటూ అందించిన కార్డులకు జనం పెద్దగా స్పందించలేదు.