కొన్న దాని గురించి... ఎక్కువ చెడే చెబుతారు!
మార్కెట్‌లోకి వచ్చిన ఏదైనా కొత్త వస్తువును కొన్న వారు దాని పని తీరు గురించి తమకు తెలిసిన వారికి ఇచ్చే ఫీడ్ బ్యాక్ విషయంపై ఒక ఆసక్తికరమైన సర్వే వెలుగులోకి వచ్చింది. ఇంట్లో వాడే వస్తువుల విషయంలోనైనా, అధునాతన మొబైల్ ఉపకరణాల విషయంలోనైనా, మోటార్ బైక్‌లు, కారుల విషయంలోనైనా కొత్తగా వాటిని వాడిన వారు తమ అనుభవాలను ఇరుగూపొరుగుతో పంచుకొనే తీరు గురించి ఈ సర్వే జరిగింది.
దీని ప్రకారం వస్తువుల విషయంలో పాజిటివ్ కంటే, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌కే ఎక్కువ ప్రచారం లభిస్తోందట. అంటే... ఒక వస్తువును కొన్న వారు అది సరిగా పనిచేయకపోతే దాని గురించి తెలిసినవారికీ, తెలియని వారికీ అడిగినా, అడగకపోయినా చెప్పేస్తుంటారట. అదే వస్తువు బాగా పనిచేస్తే మాత్రం దానిలోని సానుకూల అంశం గురించి చాలా తక్కువ మందికి చెబుతున్నారట. వస్తువు లేదా సేవల విషయంలో అసంతృప్తితో ఉన్న అనేక మందికి దాని లోపాలు చెప్పి తమ బాధను దించేసుకొంటున్నారు.
దీంతో మార్కెట్‌లోకి విడుదల అయిన వస్తువుల విషయంలో నెగిటివ్ టాక్ మొదలైందటే అది శరవేగంగా పాకిపోతుందని అధ్యయనకర్తలు విశ్లేషించారు. అదే బాగా పనిచేసే వస్తువుల విషయం గురించి మాత్రం ప్రచారం చాలా నిదానంగా ఉంటుందని, తాము కొన్న వస్తువు బాగా పనిచేస్తోందని అదేపనిగా గుర్తుతెచ్చుకొని చెప్పే వారు చాలా తక్కువమంది ఉన్నారని అధ్యయనకర్తలు తెలిపారు.
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60 శాతం మందిలో వస్తువుపై ఉన్న అసంతృప్తిని ఏకరువు పెట్టుకొనే అలవాటు కనిపించిందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. మిగిలిన వారు మాత్రం చూసీ చూడనట్టుగా ఉంటారట. వస్తువు బాగా పనిచేస్తే దాన్ని ఇతరులకు చెప్పుకొని ఆనంద పడే వారి శాతం 40. మిగిలిన వారు మాత్రం కొన్న వస్తువు బాగా పనిచేస్తుందన్న విషయాన్ని ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట.