ఐటీ కొలువుల్లో మేటి.. సిటీ | Hyderabad city is the first place in IT jobs | Sakshi
Sakshi News home page

ఐటీ కొలువుల్లో మేటి.. సిటీ

Published Sat, Jun 28 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

ఐటీ కొలువుల్లో మేటి.. సిటీ

ఐటీ కొలువుల్లో మేటి.. సిటీ

టాప్ స్టోరీ: హైదరాబాదీ యువతకు శుభవార్త. సర్కారీ ఉద్యోగాల సంగతెలా ఉన్నా.. కార్పొరేట్ జాబ్స్ కల నెరవేరనుంది. మహానగరం ‘జాబ్‌సిరి’కి స్వాగతం పలుకనుంది. ఎంతోకాలంగా ఊరిస్తున్న కార్పొరేట్ కొలువులు.. త్వరలోనే యువత ముంగిట వాలనున్నాయి. ఐటీ కంపెనీలు కాలేజీ క్యాంపస్‌ల ముందు క్యూ కట్టనున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో సిటీలో హైరింగ్ ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు!
 
 మళ్లీ ఐటీ బూమ్ ఖాయం: 
ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్,  రిటైల్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరి ఉన్నాయి. వాటిలో కొలువుల కోసం నగర యువత ఎదురుచూస్తోంది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులతోపాటు వివిధ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా కార్పొరేట్ కంపెనీల నియామక ప్రకటనలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వేచి చూస్తున్నారు. ‘రాబోయే రెండు మూడు నెలల్లో ఐటీ రంగంలో మళ్లీ బూమ్ రానుంది. కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయబోతున్నాయి. కార్పొరేట్ సెక్టార్‌లో జాబ్స్ భారీగా పెరుగుతాయి. ఐటీ రంగంలో 60 శాతం మేర రిక్రూట్‌మెంట్ పెరుగుతుందని భావిస్తున్నాం. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా ఐటీతో పోటీపడనున్నాయి. ఇప్పటికే రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా ఈసారి ముందుగానే మొదలవుతాయని భావిస్తున్నాం’ అని నెస్టార్ సోర్సింగ్ కన్సల్టెంట్ నిర్వాహకులు అజయ్ పడ్నేకర్ తెలిపారు. సుస్థిర ప్రభుత్వాలతో భరోసా: నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల సందడి. మరోవైపు రాష్ట్ర విభజన గందరగోళం. దాంతో కంపెనీలు రిక్రూట్‌మెంట్లను వాయిదా వేశాయి. గతంలో ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు సైతం అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చేందుకు సాహసించలేకపోయాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాంతో నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కంపెనీలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగానే హైరింగ్ ప్రక్రియ ప్రారంభించాయి.  ఇప్పుడిప్పుడే ఐటీలో సీనియర్ లెవల్‌లో రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయని ఆర్.సి.హెచ్.ఆర్ సొల్యూషన్స్ ప్రతినిధి వెల్లడించారు. భారీఎత్తున నియామకాలు జరపకపోయినా.. గతంతో పోల్చితే చాలా బెటర్‌గా ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
 
 అవకాశాలను చేజిక్కించుకోవాలి: ‘‘గతేడాది కొత్త ఉద్యోగాల నియామకం పెద్దగా లేకపోవడం కుర్రకారు వేగానికి కళ్లెం వేసింది. ఐటీ కంపెనీల్లో ‘జంప్‌జిలానీ’ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కంపెనీల కోణంలో ఇది మంచి పరిణామమే. ఐటీ కొలువులకు చైనా పోటీ అనుకోవద్దు.
 
 ఆంగ్ల భాషపై మన హైదరాబాద్ విద్యార్థులకు మంచి పట్టుంది. మన విద్యార్థులు ఇంగ్లిష్‌ను చాలా త్వరగా నేర్చుకోగలరు. ఐటీ రంగం ఒక్కటే కాదు.. బ్యాంకింగ్ రంగంలోనూ బోలెడు ఉద్యోగ అవకాశాలు యువత ముందుకు వస్తున్నాయి. ఇంగ్లిష్‌ను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకుంటూ.. అందివస్తున్న అవకాశాలను చేజిక్కించుకోవడమే ఇప్పుడు యువతీ, యువకుల లక్ష్యం కావాలి’’ అంటూ విశ్లేషించారు ఇఫ్లూ రిటైర్డ్ ఆచార్యులు జి.ఎస్.ఆర్.కె.బాబూరావు. ముంబై, పుణె, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ భద్రతకు మారుపేరు. తక్కువ ఖర్చుతో ఉన్నతస్థాయి జీవనం గడిపే వీలున్న నగరం కావడం కూడా కంపెనీలు ఇక్కడకు రావడానికి మరో కారణం. కొత్త కంపెనీలు రావడం, ఇక్కడి కంపెనీలు కొత్త రాష్ట్రంలోనూ ఏర్పాటయ్యే నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు అమీర్‌పేటలోని ప్రముఖ కన్సల్టెన్సీ నిర్వాహకులు. కేవలం ఐటీకే పరిమితం కాకుండా.. మానవ వనరులు, ఆడిట్స్, అకౌంట్స్ తదితర విభాగాల్లోనూ నియామక ప్రక్రియ ఆశాజనకంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
 
 ఐటీయేతర రంగాల్లోనూ అవకాశాలు: గతంతో పోల్చితే ఈ ఏడాది ఐటీ రంగం అధికంగా ఉద్యోగాలు కల్పిస్తుందని కాలేజీల ప్లేస్‌మెంట్స్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గత విద్యాసంవత్సరం అక్టోబర్‌లో రిక్రూట్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. అదీ కూడా అరకొరగానే! ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లోనే ఐటీ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్‌కు వస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ పరంగా ఇది శుభపరిణామం. ఐటీ రంగంలో ఈ దఫా ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయనే భావిస్తున్నాం. మెకానికల్, సివిల్, ఫైనాన్స్ వంటి ఐటీయేతర రంగాలు ఆగస్టు తర్వాత రిక్రూట్‌మెంట్స్ మొదలుపెడతాయనే సమాచారం ఉంది అంటున్నారు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వి.ఉమామహేశ్వరరావు.
 
 స్కిల్స్ పెంచుకుంటే మేలు: గతేడాది అక్టోబర్‌లో ఐటీ, ఐటీఈఎస్‌లో హైరింగ్ కేవలం 4 శాతం. కానీ ఈ ఏడాది అదే అక్టోబర్ నాటికి 15 శాతం పెరగొచ్చంటున్నారు ప్రముఖ కళాశాలల ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లు. బీపీఓ సెక్టార్‌లో 13 శాతం నుంచి 20 శాతం మేర రిక్రూట్‌మెంట్ ఉంటుందంటున్నారు. ఈ ఏడాది నియామకాల్లో ఐటీ, బీపీవో, బ్యాంకింగ్, ఫార్మా, టెలికాం రంగాల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉండబోతుందనేది నిపుణుల అంచనా.
 
 రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు 50 వేల ఉద్యోగాలను కల్పించనున్నాయి. ఇటీవలే కరూర్ వైశ్యాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, సహకార బ్యాంకులు 10 వేల మంది ఉద్యోగులను నియమించేందుకు నోటిఫికేషన్‌లను విడుదల చేశాయి. ఇప్పటివరకూ నింపాదిగా ఉన్న ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, ఆటోమొబైల్ రంగ సంస్థలు చేపట్టనున్న ‘హైరింగ్’లో జాబ్‌ను సొంతం చేసుకునే దిశగా అందుకు అవసరమైన స్కిల్స్‌తో యువత సిద్ధం అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement