సాక్షి, సిటీబ్యూరో : కొందరు పొద్దున లేచిన దగ్గర్నుంచీ ఏవేవో చేస్తుంటారు. ఎన్నెన్నో ఆస్వాదిస్తుంటారు. సమయం దొరికితే సమస్త విశ్వాన్ని చుట్టేద్దామన్నంత ఆరాటంతో ఉంటారు.మరికొందరేమో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. అన్న ప్రశ్నలకు ఆన్సర్‌లు రాసుకుంటూ గడిపేస్తుంటారు. ఇంతకన్నా మనం చేసేదేముందంటూ నిర్లిప్తత ప్రదర్శిస్తుంటారు. ఇదే మనకు అసలైన జబ్బు అంటోంది హైదరాబాద్ కైట్స్. అభిరుచుల్ని విస్తరించుకుంటే అప్పటి దాకా మన చుట్టూ ఉన్న ప్రపంచం అమాంతం మారిపోతోదంటోంది. మొత్తమ్మీద బతకడం కాదు జీవించడం నేర్చుకోమంటోంది.
అభిరుచుల కలబోత..
‘పాటలు పాడాలని కొందరు, ఆటలాడదాం అని మరికొందరు. సైక్లింగ్, రన్నింగ్‌లంటే మక్కువతో ఇంకొందరు. సేవాభిలాషతో, సాటి మనిషికి సాయం చేయాలనే తహతహతో ఎందరో. ఇలా మనలో చాలా మందికి ఏదో చేయాలని ఉంటుంది. సరైన మార్గదర్శకత్వం లేక ప్రోత్సాహం లేక ఏమీ చేయలేకపోతుంటాం. అలాంటి ఆలోచనల్ని సజీవంగా ఉంచడం, సాకారం చేయడమే మా ‘లక్ష్యం’ అంటున్నారు హైదరాబాద్ కైట్స్ నిర్వాహకుడు వసంత కార్తీక్. ఆరోగ్యార్థుల నుంచి ఆపన్నహస్తం అందించడం దాకా.. ప్రతి పనిలోనూ మేం మీకు తోడుంటాం అని హామీ ఇచ్చే సరికొత్త తరహా వేదికను ఆయన తన మిత్రబృందంతో కలిసి ఏర్పాటు చేశారు. ఇలాంటి అభిరుచులు ఉన్నవారిని ఒక దగ్గరకు చేర్చి వాటినిపరస్పరం పంచుకుంటూ ఆస్వాదించేలా చేస్తున్నారు.
సేవతో మమేకం..
ఆరోగ్యమే మహాభాగ్యం అనే వాక్యాన్ని మనసారా నమ్మి దానికి అనుబంధంగానే తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ సాటి మనిషికి సేవ చేయడం కూడా చక్కని సంతృప్తిని మనకు అందిస్తుందని నమ్ముతోంది. దీనికి అనుగుణంగా పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
♦ ‘నగరానికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ పల్లవి‘కైట్స్’ను సంప్రదించి బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. గత డిసెంబర్ 22న నగరంలోని పలు ఏరియాల్లో 100 దాకా బ్లాంకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ కూడా
అందించారు.
♦ నల్లగొండకు చెందిన నాలుగున్నరేళ్ల ఆయుషి బాలికకు లుకేమియా కేన్సర్ వచ్చింది. ఆ విషయం తెలిసి ఏమైనా హెల్ప్ చేయాలని ఆశించిన కొందరితో కలిసి గత ఏడాది ఏప్రిల్ 14న డ్యాన్స్ ఫర్ ఆయుషి పేరిట ఒక డ్యాన్స్ కమ్యూనిటీ సహకారంతో హైటెక్ సిటీ దగ్గరున్న ఫినిక్స్ ఎరినాలో ఈవెంట్ నిర్వహించారు. దీని ద్వారా రూ.3.50 లక్షలు వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అప్పటి మంత్రి కేటీఆర్ ఆ అమ్మాయికి అవసరమైన చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ పాప ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.
♦ పవన్ అనే 20 ఏళ్ల యువకుడు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం బసవ తారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. సాయం అందించాలనుకున్నవారితో మ్యూజిక్ ఫర్ పవన్ అనే ఈవెంట్ చేశారు. దీని ద్వారా రూ.2లక్షలు, అంతర్జాతీయంగా అందిన సాయం ద్వారా మొత్తం రూ. 8 లక్షల దాకా అందించారు.
♦ కేరళ వరదల సమయంలో కేరళ మ్యూజికల్ బ్యాండ్‌కి చెందిన సందీప్ శర్మ తమ రాష్ట్రం కోసం ఈవెంట్ చేయండి అని అడిగతే వియ్ ఫర్ కేరళ పేరుతో ఓ ఈవెంట్ చేసి వచ్చిన మొత్తాన్ని అతనికి ఇచ్చి పంపారు అంటూ వివరించారు వసంత కార్తీక్. త్వరలోనే మరిన్ని విభిన్న కార్యక్రమాల ద్వారా నగరంలో అభిరుచుల ఆస్వాదనను ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చాలనుకుంటున్నామని అంటోంది హైదరాబాద్ కైట్స్ బృందం.
♦ అదో ఔత్సాహికుల బృందం. మురికివాడల ప్రజలతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తుంది. సిటీ లేక్‌లను కాపాడాలంటూ సందేశాన్నిస్తుంది. రన్ బాబా రన్ అంటూ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. పరుగు తీస్తే అనారోగ్యం మనకు దూరంగా పరుగు తీస్తుందంటూ వెన్ను తడుతుంది. ఆటలైనా పాటలైనా.. అభిరుచి ఉంటే చాలు ఆనందం మీ వెంటే ఉంటుందని హామీ ఇస్తుంది.
‘కైట్స్’కు వసంత కార్తీకం..
‘ఆరోగ్య జీవనశైలికి ముందుగా కావాల్సినవి చక్కని అభిరుచులు. వాటిని ఎంతగా సానబెట్టుకుంటే అంత ఆనందం, ఆరోగ్యం’ అనేది తన స్వానుభవం అని చెప్పే వసంత కార్తీక్.. తన ఆలోచనని అంగీకరించిన మరికొందరు కార్పొరేట్ ఉద్యోగులు, విభిన్న రంగాల ఔత్సాహికులతో కలిసి ‘కైట్స్’ను నిర్వహిస్తున్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కొంత కాలంగా విభిన్న అభిరుచుల వారీగా ఏర్పాటైన దాదాపు 25 బృందాలను ఒక చోట చేర్చగలిగారు. ‘సరైన దశా దిశా లేని టాలెంటెడ్ పీపుల్‌కి వారికి ఉపకరించే పేషనేట్ కమ్యూనిటీస్‌ని పరిచయం చేస్తాం’ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రగతినగర్‌లో ఉన్న ప్రగతి రన్నర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ మీద అవగాహన కల్పిస్తున్న ‘హైదరాబాద్ కైట్స్’ గత ఏడాది జనవరిలో కైట్స్ ఫెస్టివల్ నిర్వహించింది. ‘లేక్‌లను రక్షించుకోండి అనే సందేశంతో ఇబ్రహీం లేక్ దగ్గర పార్క్‌లో కుటుంబ సమేత పతంగుల పండగను నిర్వహించాం, ఎకో ఫిలిం ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు వసంత కార్తీక్. త్వరలో జనవరి 22న హైటెక్స్‌లో వన్ నేషన్ వన్ డ్యాన్స్ అనే పేరుతో మరో ఈవెంట్ చేస్తున్నామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment