హైదరాబాద్ సిటీలో ఎందరో చిత్రకారులు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొంతమంది గీసిన బొమ్మలోని భావాలు మనసు లోతుల్లోకి చేరుతాయి. కొందరి చిత్రాలు సమాజంలో అన్యాయాన్ని ఎత్తి చూపిస్తాయి. మరికొందరి చిత్రాలు ‘వారెవా.. భలే ఆర్ట్’ అనిపిస్తుంది. మూడో కోవకు చెందిన యువతే స్వారిక రామగిరి. ప్రముఖుల ముఖచిత్రాలు గీసినా బియ్యం గింజపై భగవద్గీత రాసినా.. తనకు తానే సాటిగా నిలుస్తూ నేటితరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది స్వారిక.
– హిమాయత్‌నగర్
హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన రామగిరి శ్రీనివాసచారి, శ్రీలత కుమార్తె స్వారిక. హైకోర్టులో లాయర్‌గా ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చిన్నతనం నుంచే ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఓరోజు తన అన్న చంద్రకాంత్‌చారి పేపర్‌తో వినాయకుడిని చేశాడు. ఆ ఆర్ట్‌కు ఇంట్లో, బయటా మంచి ప్రశంసలు దక్కాయి. అంతే.. ఆ సమయాన స్వారిక మనసులో ఓ ఆలోచన తట్టింది. ‘నేనెందుకు కొత్తగా బొమ్మలు గీయడం మొదలు పెట్టకూడదు, నేనెందుకు అందరి ప్రశంసలు అందుకోకూడదు’ అని ప్రశ్నించుకుంది. అలా అనుకున్నదే తడవుగా మొదటిసారి బియ్యపుగింజపై వినాయకుడి బొమ్మ గీసింది. దీనిని అందరూ మెచ్చుకోవడంతో ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. జాతీయజెండా, భారతదేశపు చిత్రపటం, ఎ టు జెడ్ ఆల్ఫాబెట్స్ వేసి అందరి మన్ననలను అందుకుంది. ఆ తర్వాత బియ్యపుగింజపై భగవద్గీతను రాసి చరిత్రను లిఖించింది స్వారిక రామగిరి.
ప్రముఖుల ఆర్ట్‌కు కేరాఫ్..
ప్రముఖుల చిత్రాలను మైక్రో ఆర్ట్‌గా గీయడంలో స్వారిక ‘ది బెస్ట్’అని చెప్పాల్సిందే. ఎందుకంటే.. వారి నుంచి ఆమె అందుకున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల ముఖచిత్రాలను స్వారిక మైక్రో ఆర్ట్‌గా గీసింది. వాటిని వారికి పంపించగా స్వారికను అభినందిస్తూ సందేశాలు కూడా తిరిగి పంపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా స్వారిక గీసిన మైక్రో ఆర్ట్‌లను పలువురు వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోవడం గమనార్హం.
2005కిపైగా చిత్రాలు.. కళాఖండాలు
స్వారిక ఐదేళ్ల ప్రాయంలో మొదలుపెట్టిన తన ఆర్ట్ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2005కుపైగా చిత్రాలు వేసింది. వీటిలో ప్రధానంగా మిల్క్ ఆర్ట్, పేపర్ కార్వింగ్, బాదంపప్పుపై ఆర్ట్, చింతగింజలపై ఆర్ట్, నవధాన్యాలు, బియ్యపుగింజలు, పాలమీగడ, నువ్వులగింజలు వంటి వాటిపై బొమ్మలు గీసింది.
వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక
స్వారిక తన తలలోని ఐదు వెంట్రుకలపై బొమ్మలు గీసి తనలోని అద్భుత నైపుణ్యాన్ని చాటుకుంది. కేవలం ఆరుగంటల్లో ఆ వెంట్రుకలపై రాజ్యాంగ పీఠికను రూపొందించి చరిత్ర సృష్టించింది. ఈ ఆర్ట్‌ను చూసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వారికను రాజ్‌భవన్‌కు పిలిపించి సన్మానం చేశారు. అంతేకాదు బాదంపప్పుపై గీసిన ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం చూసి తమిళిసై ముగ్ధులయ్యారు. మోదీకి అందిస్తానని గవర్నర్ ఆ చిత్రపటాన్ని తీసుకోవడం గమనార్హం.
స్వారిక టాలెంట్ గురించి తమిళిసై తన ట్విట్టర్ అకౌంట్‌లో కూడా పోస్ట్ చేయడం విశేషం. నువ్వుల గింజలపైనా అద్భుత చిత్రాలను గీసింది స్వారిక. ఈఫిల్ టవర్, తాజ్‌మహాల్, చార్మినర్, వరంగల్ ఫోర్ట్, ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ వంటి వాటిని వేసి ఔరా అనిపించింది. పాలమీగడపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు తదితరుల చిత్రపటాలను వేసింది. (చదవండి: యాదాద్రికి ‘బంగారు’ విరాళాలు)
Comments
Please login to add a commentAdd a comment