మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మకర సంక్రాంతి తర్వాత రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథ సప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా పూజవిధానం, చేయాల్సిన విధివిధానాలు గురించి సవివరంగా చూద్దామా..!.
పురాణ కథనం ప్రకారం..కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథ సప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
రథ సప్తమి తిథి ఎప్పుడంటే:
మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 04 , 2025 ఉదయం 7:56 గంటలకు సప్తమి ప్రారంభమై, మరుసటి రోజు 05 ఫిబ్రవరి 2025 తెల్లవారుజామున 5:29 గంటలకు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యదోయ సమయం 6:36 గంటల కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందువల్ల ఇవాళే (ఫిబ్రవరి 4వ తేదీన) జరుపుకుంటారు.
స్నానానికి ఎంతో ప్రాధాన్యత..
రథ సప్తమి రోజు చేసే స్నానం, దానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందట! అందువల్ల రథ సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. వాటిని శిరస్సుపై ఉంచి తలంటు స్నానం చేయాలని తెలిపారు. ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగి పళ్లు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, అవి సూర్యుడికి ఇష్టమైనవి. ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట. ఆ తర్వాత సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ ఆర్ఘ్యం ఇవ్వాలి.
‘‘ఓం సూర్యాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం మార్తాండ నమః’’ అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది.
‘‘యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
పూజా విధానం:
ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి. ఆ మండపం దగ్గర సూర్యుడి ఫొటో ఉంచాలి. ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యుడిగా భావించాలి. ఒకవేళ సూర్య భగవానుడి ఫొటో ఉంటే పెట్టండి. అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి.
వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది. పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదం స్వీకరించాలి. సూర్య భగవానుడికి ప్రీతికరమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అంతేగాదు ఈ రోజు ఆదిత్య హృదయం లేదా సూర్య చాలీసా వంటివి పఠిస్తే మరింత ఫలితాన్ని పొందుతారనేది పురాణ వచనం.
(చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..)
Comments
Please login to add a commentAdd a comment