ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోండి
ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోండి
Published Thu, Dec 8 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
జిల్లా ఉన్నతాధికారులకు పోలీసుల నివేదిక
అమలాపురం టౌన్ : అమలాపురంలో ఓ ఇంటిపై రౌడీల దాడి ఘటనతో హత్యాయత్నం, మారణాయుధాల కేసులో నిందితుడిగా ఉన్న పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఆచంట వీరవెంకట సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు పోలీసులు గురువారం నివేదికలు పంపారు. ఇంటి విక్రయంతో అతని పని పూర్తయినా ఇంటిపై రౌడీలు దాడి చేస్తున్నప్పుడు వారితో పాటు ఉండడంతో ఈ కేసులో నిందితుడయ్యారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, డీఈఓ, అమలాపురం డీవైఈవో, ఉప్పలగుప్తం ఎంఈవోలకు వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన సెక్షన్లతో నివేదికలు పంపించారు. ఆ ఉపాధ్యాయుడిపై ఉప్పలగుప్తం ఎంఈవో ఇచ్చే నివేదిక మేరకు తాము డీఈవోకు నివేదిక పంపనున్నానని అమలాపురం డీవైఈవో ఆర్‌ఎస్ గంగా భవాని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
రౌడీల దౌర్జన్యం దారుణం
ఆర్య వైశ్య మహా సభ ప్రతినిధుల బృందం
అమలాపురం టౌన్ : ఇటీవల అమలాపురంలో రౌడీలు ఓ ఇంటిపై దాడి చేసి ప్రింటింగ్ ప్రెస్‌ను ధ్వంసం చేయడం దారుణమని.. ఇది పూర్తిగా అనాగరిక చర్య అని ఆల్ ఇండియా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు, ఏపీ ఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యంలతో కూడిన వైశ్య నాయకుల బృందం పేర్కొంది. ఘటన ప్రదేశాన్ని ఆ బృందం గురువారం పరిశీలించింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని కాళ్లకూరి బుజ్జి సోదరులను బృందం ప్రతినిధులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. నిందితులను ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున ఆర్యవైశ్య మహాసభ అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ కోశాధికారి పల్లపోతు బంగారం, కంతేటి కాశి, అమలాపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యెండూరి నాగేశ్వరరావు, కార్యదర్శి నంబూరి మూర్తి, కోశాధికారి వరదా సూరిబాబు, పచ్చిగోళ్ల నాగబాబు, యక్కల కుమార్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల బృందం వెంట ఉన్నారు.
Advertisement
Advertisement