బెంగుళూరు: ప్రముఖ రెడీ టూ ఈట్ ఇన్‌స్టంట్ ఫుడ్ సంస్థ ‘ఎంటీఆర్ ఫుడ్స్’ కంపెనీలో కరోనా కలకలం రేగింది. వివరాల ప్రకారం.. కర్ణాటక లోని బొమ్మసాంద్రలో గల ఎంటీఆర్ ఫుడ్స్ తయారీ పరిశ్రమలో ఏకంగా 40 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఫ్యాక్టరీని మరి కొంతకాలం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 6న ఫ్యాక్టరీలో మొట్టమొదటి కరోనా కేసు నమోదవగా వెంటనే కంపెనీని మూసివేసి శానిటైజేషన్ నిర్వహించారు. జూలై 10న ఫ్యాక్టరీ తెరవాలని భావించినా కాంట్రాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా మిగతా ఉద్యోగులకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు తేలింది. ఇప్పటివరకు ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఈనెల 20 వరకు ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే తమకు ప్రథమ కర్తవ్యం అని ఓ ప్రకటన జారీ చేసింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన )
వివిధ సూపర్ మార్కెట్లలో ఎంటీఆర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నందున ఏం చేయాలన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై కంపెనీ సీఈవో స్పందిస్తూ ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందవద్దని మనుషుల ప్రమేయం లేకుండా యంత్రాల సహాయంతో ఫుడ్ ప్యాకెజింగ్ చేస్తామని తెలిపారు. తమ ఉత్పత్తులన్నీ మనిషి స్పర్శతో సంబంధం లేకుండా ఆటోమేటెడ్ లైన్లలో తయారు చేయబడతాయని పేర్కొన్నారు. బెంగళూరులో లాక్‌డౌన్ అనంతరం తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ర్టంలో ఓ ప్రముఖ కంపెనీలో వైరస్ కలకలం రేగడం ఇది కొత్తేమి కాదు. ఇంతకుముందు మైసూరు నంజన్‌గూడ్‌లోని జూబిలెంట్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా బళ్లారి జిల్లాలో ఓ స్టీల్ ప్లాంట్‌లో ఏకంగా 200 మంది కార్మికులకు కరోనా సోకింది. రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్నందున బెంగుళూరులో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. (‘లక్షణాలు లేకుంటే ఓకే’)
Comments
Please login to add a commentAdd a comment