కొత్తపేటలో.. భారీ పేలుడు | Huge explosion | Sakshi
Sakshi News home page

కొత్తపేటలో.. భారీ పేలుడు

Published Thu, Jul 23 2015 3:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కొత్తపేటలో.. భారీ పేలుడు - Sakshi

కొత్తపేటలో.. భారీ పేలుడు

♦ అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన
♦ ఐదుగురికి తీవ్ర గాయాలు వారిలో ముగ్గురి పరిస్థితి విషమం
♦ పేలుడు తాకిడికి ఉడికిన దేహాలు.. ఊడిన చర్మం
♦ నరకయాతన అనుభవించిన క్షతగాత్రులు
♦ ధ్వంసమైన తయారీ కేంద్రం
 
 కొత్తపేట :
 స్థలం : కొత్తపేట మండలం పలివెల రెవెన్యూ గ్రామం..
 సమయం : బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట
 ఒక్కసారిగా భారీ పేలుడు.. ఆ ప్రాంతమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లింది...
 అంతా అయోమయం.. కొద్ది సేపటికి తేరుకున్న వారు.. కొబ్బరితోటలో అనధికారికంగా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిందని గుర్తించారు. అక్కడికి వెళ్లే సరికి ఆ ప్రాంతంలో ఉడికిన దేహాలు, ఊడిన చర్మాలతో కొందరు క్షతగాత్రులుగా పడి ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

 కొత్తపేట ప్రధాన గ్రామానికి పడమర దిశన బొబ్బర్లంక-అమలాపురం కాలువ అవతల అంబాజీపేట తూము వద్ద పలివెల రెవెన్యూ గ్రామ పరిధిలోని కొబ్బరి తోటలో దూలం కోటేశ్వరరావు అనే వ్యక్తి అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సంభవించిన భారీ పేలుడుతో ఇటుక గోడలు, సిమెంట్ రేకులతో నిర్మించిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు అక్కడ పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి వారు తీవ్ర ంగా గాయపడి షెడ్డు శిథిలాల కింద ఉండిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అగ్నిమాపక అధికారి సీహెచ్ నాగేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, శిథిలాలను తొలగించారు.

 నరకయాతన...
 ప్రమాదంలో మద్దుల మెరకకు చెందిన రాయి సురేష్(35), పెదరాముడినూతి మెరకకు చెందిన వాసంశెట్టి శ్రీరాములు(60), గోగివారిపేటకు చెందిన సాకా నాగరాజు(30) చర్మం ఊడి, అన్ని అవయవాల నుంచి రక్తం కారుతూ తీవ్రవేదన అనుభవిస్తున్నారు. మార్కెట్ వీధికి చెందిన మావూరి శ్రీను(సామర్లకోట శ్రీను),సత్యచంద్ర థియేటర్ ప్రాంతానికి చెందిన పరమట వీరవెంకటసత్యనారాయణ చర్మం కాలి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మావూరి శ్రీను, సత్యనారాయణ సంఘటన జరిగిన కొద్దిసేపటికే యజమాని కోటేశ్వరరావు తన కారులో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, పరారైనట్టు సమాచారం.

 కాకినాడ తరలింపు
 రావులపాలెం సీఐ పీవీ రమణ సంఘటన స్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను కాలువగట్టుపైకి చేర్చి అక్కడి నుంచి 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి అక్కడి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఆ ఐదుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, అమలాపురం ఆర్డీఓ జి గణేష్‌కుమార్, డీఎస్పీ ఎల్.అంకయ్య, తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఎస్సై డి.విజయకుమార్ సందర్శించారు.
 
 క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
 కొత్తపేట : కొత్తపేటలో బాణసంచా పేలుడు సంఘటనలో క్షతగాత్ర ులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కాకినాడ జీజీహెచ్ వైద్యులను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లిన ఆయన కొత్తపేటలో బాణసంచా పేలుడు ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులను ఆరా తీసి, పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని వైద్యులను ఫోన్‌లో సంప్రదించారు. గురువారం కాకినాడ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నట్టు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తెలిపారు.

 అనధికార తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోండి : హోంమంత్రి రాజప్ప
 మారుమూల ప్రాంతాల్లో అనధికారికంగా బాణసంచా తయారు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఎస్సీ రవిప్రకాష్‌కు ఆదేశాలు జారీ చేశారు. కొత్తపేటలో బుధవారం జరిగిన పేలుడు సంఘటన విషయం తెలుసుకున్న ఆయన రాజమండ్రి నుంచి హుటాహుటిన  కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శిం చారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనధికార బాణసంచా తయారీ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.
 
 ‘వర్షం రాకుంటే పెను ప్రమాదం జరిగేది’
     కుమార్తె పుట్టిన రోజన్నా వినలేదు
     క్షతగాత్రుడి మేనల్లుడి ఫిర్యాదు
 కొత్తపేట : బాణసంచా తయారీ కేంద్రంలో ఎప్పుడూ సుమారు 10 మంది పని చేసేవారని, వర్షం రావడం వలన కొంత మంది పనికి రాలేదని లేకుంటే పెను ప్రమాదమే సంభవించేదని సంఘటన స్థలం వద్ద పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది మహిళలు కూడా ఇక్కడ పనిచేస్తారని వారు వెల్లడించారు.

 బలవంతంగా తీసుకె ళ్లాడు...
 తన రెండో కుమార్తె పుట్టిన రోజని, బుధవారం పనికి రానని ఎంత చెప్పినా వినకుండా తన మావయ్యను యజమాని దూలం కోటేశ్వరరావు బలవంతంగా తన కారులో తీసుకువెళ్లాడని బాణసంచా పేలుడు బాధితుడు  రాయి సురేష్ మేనల్లుడు దార్ల సురేష్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు. వికలాంగుడైన సురేష్ ఇద్దరు ఆడపిల్లలని, కొన్నేళ్లుగా కోటేశ్వరరావు వద్దే పనిచేస్తున్నాడని, ఈ నేపథ్యంలో అతడికి రూ.ఐదు వేలు బాకీ పడ్డాడని, అది తీర్చే నిమిత్తం పని చేసేందుకు బలవంతంగా సురేష్‌ను కారు ఎక్కించుకుని కోటేశ్వరరావు తీసుకువెళ్లాడని మేనల్లుడు సురేష్ జేసీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశాడు.

 మరో క్షతగాత్రుడు వాసంశెట్టి శ్రీరాములు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. పిల్లలు లేకపోవడంతో బంధువుల అమ్మాయిని పెంచుకుంటున్నాడు. సాకా నాగరాజుకు కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోయింది. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే మావూరి శ్రీనుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సామర్లకోట శ్రీను ఎనిమిదేళ్ల క్రితం బాణసంచా పని నిమిత్తం కొత్తపేట వచ్చి స్థిర పడ్డాడు. పరమట సత్యనారాయణ అవివాహితుడు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement