చెన్నై, సాక్షి ప్రతినిధి : కోయంబత్తూరులో గురువారం ఉదయం ఒక ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. కోవై ఉక్కడం సెల్వపురం బైపాస్ రోడ్డులోని కెంబట్టికాలనిలోని ఒక తోటలో చంద్రన్, భార్య దేవి (38) ఆస్బెస్టాస్ షీట్లతో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నారు. అదే ఇంటిలోని మరో పోర్షన్‌ను అద్దెకిచ్చారు. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఇంటిలోని ఒక పోర్షన్‌లో భారీపేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 12 అడుగుల ఎత్తై గోడలతో నిర్మించిన ఆ ఇల్లు నేలమట్టమైపోయింది. పేలుడుతో బెంబే లెత్తిన ఇరుగుపొరుగు వారు భయంతో దూరంగా పారిపోయారు. ఈ ప్రమాదంలో 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు.
దేవి కుమారుడు నవీన్ (17) తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటికి సమీపంలోని ఒక కుక్క కూడా శిథిలాల కింద నలిగి ప్రాణాలు విడిచింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు బీటలు వారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు సంభవించిన ఇంటి నుంచి అనేక జిలిటిన్ స్టిక్కులు, బాణ సంచాకు వినియోగించే మందు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో బాణ సంచా లేదా బాంబులు తయారుచేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
కోవైలో భారీ పేలుడు
Published Fri, Nov 6 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement