మంటల్లో చిక్కుకున్న కోస్టల్ జాగ్వార్ నౌక
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న చిన్న నౌక...టగ్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో సముద్రంలో దూకి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. 15మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముడి చమురు నౌకలను నిలిపి ఉంచే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్‌పీఎం) టెర్మినల్ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక ‘టగ్’ కోస్టల్ జాగ్వార్‌లో (ఔట్ హార్బర్‌లో నిలిపి ఉన్న నౌకలను ఇన్నర్ హార్బర్‌లోకి తీసుకువచ్చే నౌకను టగ్‌గా వ్యవహరిస్తారు) ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన ముడి చమురును నౌకల్లోకి తరలించే భారీ నౌకలో ఆదివారం రాత్రి గాలుల ధాటికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.
వాటిని సరిచేసేందుకు కోస్టల్ జాగ్వార్ టగ్‌లో సోమవారం ఉదయం సిబ్బంది వెళ్లారు. టగ్‌ను భారీ నౌకకు హోస్ పైపులతో అనుసంధానించే క్రమంలో టగ్ అడుగు భాగం నుంచి ఆయిల్ లీక్ అయి రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. క్షణాల్లోనే టగ్ 70 శాతం వరకు తగలబడింది. ఆరుగురు సిబ్బంది మంటల్లో చిక్కుకోగా వారి శరీరం చాలావరకు కాలిపోయింది. పేలుడు సమయంలో ప్రాణాలను రక్షించుకునేందుకు ఎనిమిది మంది సముద్రంలోకి దూకేశారు. వీరిలో ఆరుగురు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఆసీస్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైందని హార్బర్ ఏసీపీ టి.మోహన్‌రావు తెలిపారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టుకు చెందిన ఐదు నౌకలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించడంతో పాటు నౌకలోని మంటలను అదుపుచేశాయి. అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ విచారణకు ఆదేశించారు.
పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు..
వనమాడి అన్నవరం (40)–తూర్పు గోదావరి జిల్లా, అన్సార్ (39)–కోల్‌కతా, తాశారపు భరధ్వాజ్ (23)–విశాఖపట్నం, జస్వీర్ సింగ్ (46)– ఉత్తరప్రదేశ్, జువిన్ జోషి (24)– కేరళ, చింతపల్లి తండేలు (48)– శ్రీకాకుళం, ఎచ్చెర్ల
Comments
Please login to add a commentAdd a comment