ship accident
-
ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని..
జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవదహనమయ్యారు. సముద్రంలో చిక్కుకున్న మరో 226 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్‌లో కుంపాంగ్ నుంచి కలాబాహి వెళ్తున్న ఓడలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో ఓడలో 230 మంది ప్యాసెంజర్లు, 10 మంది సిబ్బంది కలిపి మొత్తం 240 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అకస్మాతుగా మంటలు ఎందుకు చెలరేగాయనే విషయం తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. 17 వేల ఐలాండ్స్కు నిలయమైన ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. 2018లో కూడా 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఓడ మునిగిన ఘటనలో 167 మంది జలసమాధి అయ్యారు. 19991లో జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగి 332 మంది చనిపోయారు. 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇండోనేసియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విషాద ఘటన కావడం గమనార్హం. చదవండి: బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా? -
వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం
Ship Carrying Migrants Sinks Off Greece Coast: వలసదారులతో వెళుతున్న పడవ గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకు ఉత్తరాన ఉన్న ద్వీపంలో మునిగిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో సుమారు 11 మంది దుర్మరణం చెందారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 90 మందిని రక్షించినట్లు వెల్లడించారు. (చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప!!) అయితే అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు పడవ మునిగిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రజలు తమ మనుగడను వెతుక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలను కొనసాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (యూఎస్హెచ్సీఆర్) ప్రతినిధి అసిస్టెంట్ అడ్రియానో సిల్వెస్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!) -
టగ్ ప్రమాదం: మరో ఇద్దరి మృతి
ఇటీవల విశాఖ ఔటర్ హార్బర్లో పనులు నిర్వహిస్తున్న టగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సోమవారం ఆస్పత్రిలో మరణించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. గల్లంతైన ఒకరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): ఇటీవల విశాఖ ఔటర్ హార్బర్లో జరిగిన టగ్ ప్రమాదం మరో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కాలిన గా యాలతో జిల్లా పరిషత్ వద్దనున్న మై క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 10 మందిలో ఇద్దరు సోమవారం మృతి చెందారు. వీరిలో కేరళకు చెందిన జువిన్ జోషి(24)ను మెరుగైన చికిత్స కోసం ముంబయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్‌కు ఆదివారం విమానంలో తరలించా రు. చనిపోయిన వారిలో కోటవీధికి చెందిన కాసారపు భరద్వాజ్(23), కోల్‌కతాకు సమీప నూర్పుర్కు చెందిన అన్సర్(39) ఉన్నారు. వీరి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. హెచ్‌పీసీఎల్ అద్దెకు తీసుకున్న జాగ్వర్ టగ్‌లో ఈ నెల 13న అగ్ని ప్రమాదం సంభవించడం తెలిసిందే. అదే రోజు ఒకరు మృతి చెందగా.. తాజాగా సోమవారం మరో ఇద్దరు క్షతగాత్రులు చనిపోయారు. ఈ ఘటనలో 15 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కోటవీధిలో విషాదఛాయలు.. కోటవీధిలో నివాసం ఉంటున్న కాసారపు కల్యాణ్, తిరుమలకు ఏకైక సంతానం భరద్వాజ్(23). తండ్రి కల్యాణ్ టగ్ మాస్టర్‌గా పనిచేస్తూ కుమారుడిని కూడా అదే వృత్తిలో పైకి తీసుకురావాలన్న ఆశతో భరద్వాజ్‌కు ఇటీవల శిక్షణ కూడా ఇప్పించారు. ఇంటర్ వరకూ చదువుకున్న భరద్వాజ్ టగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాడనుకున్నారు. అయితే టగ్ ప్రమాదంలో భరద్వాజ్‌కు తీవ్ర కాలిన గాయాలై మైక్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో కోటవీధి ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలతో మిన్నంటింది. భరద్వాజ్ అంత్యక్రియలో వందలాది మంది పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.మరో మృతుడు అన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు సమీపంలో ఉన్న నూర్పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడి వివరాలు తెలిపేందుకు స్నేహితులు, బంధువులు ఎవరూ అందుబాటులో లేరు. -
నౌకలో భారీ పేలుడు
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న చిన్న నౌక...టగ్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో సముద్రంలో దూకి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. 15మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముడి చమురు నౌకలను నిలిపి ఉంచే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్పీఎం) టెర్మినల్ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక ‘టగ్’ కోస్టల్ జాగ్వార్లో (ఔట్ హార్బర్లో నిలిపి ఉన్న నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకువచ్చే నౌకను టగ్‌గా వ్యవహరిస్తారు) ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన ముడి చమురును నౌకల్లోకి తరలించే భారీ నౌకలో ఆదివారం రాత్రి గాలుల ధాటికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు కోస్టల్ జాగ్వార్ టగ్‌లో సోమవారం ఉదయం సిబ్బంది వెళ్లారు. టగ్‌ను భారీ నౌకకు హోస్ పైపులతో అనుసంధానించే క్రమంలో టగ్ అడుగు భాగం నుంచి ఆయిల్ లీక్ అయి రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. క్షణాల్లోనే టగ్ 70 శాతం వరకు తగలబడింది. ఆరుగురు సిబ్బంది మంటల్లో చిక్కుకోగా వారి శరీరం చాలావరకు కాలిపోయింది. పేలుడు సమయంలో ప్రాణాలను రక్షించుకునేందుకు ఎనిమిది మంది సముద్రంలోకి దూకేశారు. వీరిలో ఆరుగురు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఆసీస్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైందని హార్బర్ ఏసీపీ టి.మోహన్‌రావు తెలిపారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టుకు చెందిన ఐదు నౌకలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించడంతో పాటు నౌకలోని మంటలను అదుపుచేశాయి. అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ విచారణకు ఆదేశించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు.. వనమాడి అన్నవరం (40)–తూర్పు గోదావరి జిల్లా, అన్సార్ (39)–కోల్‌కతా, తాశారపు భరధ్వాజ్ (23)–విశాఖపట్నం, జస్వీర్ సింగ్ (46)– ఉత్తరప్రదేశ్, జువిన్ జోషి (24)– కేరళ, చింతపల్లి తండేలు (48)– శ్రీకాకుళం, ఎచ్చెర్ల -
ఇరాక్‌లో 71 మంది జలసమాధి
మోసుల్: ఇరాక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోసుల్ నగరంలో టైగ్రిస్ నదిపై వెళుతున్న ఓ నౌక గురువారం నదీ ప్రవాహానికి పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 19 మంది చిన్నారులు సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55 మంది ప్రయాణికులను అధికారులు రక్షించారు. ఈ విషయమై ఇరాక్ ఆరోగ్యశాఖ మంత్రి సయిఫ్–అల్–బదర్ మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో నౌకలో 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఇది నౌక సామర్థ్యం కంటే రెట్టింపన్నారు. కుర్దుల నూతన సంవత్సరాది నౌరోజ్ సందర్భంగా వీరంతా మోసుల్ నుంచి ఉమ్–అల్–రబీన్ అనే పర్యాటక దీవికి బయలుదేరారని వెల్లడించారు. -
ఓడలు ఢీకొని.. ఏడుగురు గల్లంతు
బీజింగ్: ఓడలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ తీరంలోని పెర్ల్ నదీమార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు ఐదువేల టన్నుల ఇసుకతో వెళ్తున్న ఓడ, 5వేల టన్నుల ఉక్కుతో వెళ్తున్న మరో ఓడను ఢీకొనటంతో ఇసుక ఓడ మునిగిపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఉక్కు లోడు ఓడలో ఉన్న 11 మంది సిబ్బందిని రక్షించారు. ఇసుక లోడు ఓడకు సంబంధించి ఐదుగురిని కాపాడగలిగారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు భావిస్తున్నారు. వారి కోసం 20 మంది గజ ఈతగాళ్లతోపాటు వంద మంది సిబ్బంది గాలింపు చర్యలు సాగిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన రెండు ఓడలు జియాంగ్సు, ఫుజియాన్ ప్రావిన్స్‌లకు చెందినవని తేలింది. -
ప్రమాదంలో పెళ్లిబృందం జలసమాధి
యాంగూన్: పశ్చిమ మయన్నార్‌లో పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ ఓ భారీ ఓడను ఢీకొనడంతో పడవలోని 20 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 30 మందిని రక్షించామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. వివాహ వేడుకను ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పడవలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు.