గోదావరి డెల్టాలో రబీ వరిచేలు కంకులు వేసి, పాలుపోసుకుంటున్నాయి. సాధారణంగా ఈ దశలోనే చేలకు నీటి అవసరం ఎక్కువ. తదనుగుణంగా పంట కాలువలకు విడుదల చేసే నీటి పరిమాణాన్నీ పెంచాలి. అయితే ఇరిగేషన్ అధికారులు చాలీచాలని పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తూ, తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పైర్లకు తడి పెట్టేందుకు రైతులు నానా పాట్టూ పడుతున్నారు.
అమలాపురం : డెల్టాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. సాగు ఆరంభం నుంచి కాలువల ద్వారా చాలీచాలకుండానే నీరు సరఫరా చేస్తున్నా రైతులు నానా తంటాలు పడుతూనే పంటను కాపాడుకుంటూ కంకులు పాలు పోసుకునే దశకు తెచ్చారు. ఏదేమైనా తూర్పు, మధ్య డెల్టాల్లో శివార్లలో, మెరకల్లో నీరందక సుమారు లక్ష ఎకరాల్లో పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకూ చేసిన కృషి ఒకఎత్తు అయితే.. ఈ దశలో చాలినంత తడిని అందించి కంకులు పాలు పోసుకుని, గట్టిపడేలా చేయడం మరొక ఎత్తు.
అయితే ఈ కీలక తరుణంలోనూ అధికారులు నీటి విడుదల పరిమాణాన్ని స్వల్పంగా పెంచి చేతులు దులుపుకోన్నారు. వారం రోజుల క్రితం మూడు డెల్టాలకు కలిపి 6,700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, ప్రస్తుతం తూర్పు డెల్టాకు రెండు వేలు, మధ్యడెల్టా 1,420, పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కుల చొప్పున రెండు జిల్లాలోని డెల్టా కాలువలకు 7,250 క్యూసెక్కుల నీరు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది కాక మన జిల్లాలో పంపింగ్ ద్వారా మరో 30 క్యూసెక్కుల నీరు చేలకు చేరుతోంది. గతంలో 130 డ్యూటీ (ఒక క్యూసెక్కు 130 ఎకరాల చొప్పున) ఇవ్వగా, ఇప్పుడు దీనిని 120 చేశారు. వాస్తవానికి ఈ సమయంలో కాలువలకు 90 డ్యూటీ చొప్పున సాగునీరు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం 100 డ్యూటీలో అయినా ఇస్తే రైతులకు కొంత ఊరటగా ఉండేది. అయితే నీరు అందుబాటులో లేదంటూ.. అధికారులు చేతులు ఎత్తివేశారు.
90 డ్యూటీలో నీరు అనుమానమే..
అధికారులు చెబుతున్న ఆయకట్టుకు తగ్గట్టు.. చేలు పాలుపోసుకునే దశలో మూడు డెల్టాలకు 90 డ్యూటీలో నీరు పంపిణీ చేయాలంటే 9,667 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి. కనీసం 9 వేల క్యూసెక్కులు పంపిణీ చేసినా కొంత ఊరటగా ఉండేది. బలిమెల నుంచి డొంకరాయి జలాశయం ద్వారా అదనంగా వెరుు్య క్యూసెక్కుల నీరు తెప్పిస్తున్నా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి నిల్వ లేకపోవడం, గోదావరి సహజ జలాలు 750 క్యూసెక్కులు కూడా లేకపోవడం వల్ల కాలువలకు నీటి విడుదల పెంచలేకపోతున్నారు. ఇప్పటికే నీరందక శివారు, మెరక ప్రాంతాల్లోనే కాక పంట కాలువలు, చానళ్లను ఆనుకున్న ఎగువ ఆయకట్టులో సైతం మోటార్లతో నీరు తోడక తప్పని పరిస్థితి నెలకొంది. బలిమెల నీరు గోదావరికి చేరినా 90 డ్యూటీలో కాలువలకు నీటి విడుదల సాధ్యం కాకపోవచ్చు.
‘సాక్షి’ కథనంతో అదనపు నీరు
డొంకరాయి జలాశయం పవర్ కెనాల్‌కు 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీరు గోదావరిలో చేరేలా విడుదల చేసేవారు. ఇక్కడ నీటి నిల్వలు తరిగిపోతున్నందున ముందుముందు నీటి ఇబ్బంది తప్పదని గత నెల 24న ‘జల సంక్షోభం’ అనే కథనం ద్వారా ‘సాక్షి’ హెచ్చరించింది. దీనితో కదలిక వచ్చిన అధికారులు బలిమెల రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని పవర్ జనరేషన్ ద్వారా వచ్చేలా ఒడిశా అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును మన రాష్ట్రంతోపాటు ఒడిశా ఉమ్మడిగా నిర్వహిస్తోంది. వేసవిలో విద్యుత్ వాడకాన్ని తగ్గించుకుంటామని, డెల్టాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న దృష్ట్యా బలిమెల నుంచి వెయ్యి క్యూసెక్కులు పవర్ జనరేషన్ ద్వారా తెప్పించేందుకు అక్కడి అధికారులను ఒప్పించారు. ఇలా అదనంగా నీరు వస్తున్నందున డొంకరాయి జలాశయం నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని బైపాస్ పద్ధతిలో అధికారులు డెల్టాకు ఇవ్వగలుగుతున్నారు.
పాలకంకులకు.. చాలని నీళ్లు
Published Thu, Mar 3 2016 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement