ఆధునీకరణ జరిగితే ముంపు తప్పేది | If Godavari delta modernization work completes restrict floods: YS Vijayamma | Sakshi
Sakshi News home page

ఆధునీకరణ జరిగితే ముంపు తప్పేది

Published Tue, Oct 29 2013 1:37 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM

If Godavari delta modernization work completes restrict floods: YS Vijayamma

* ‘పశ్చిమ’ పర్యటనలో విజయమ్మ
* వైఎస్ జీవించి ఉంటే ఆ పనులు పూర్తయ్యేవి
* ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకనే మరణాలు
* పునరావాస కేంద్రాల్లోనూ రక్షణ లేదు
* పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్ జీవించి ఉంటే గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తయి ఉండేవని, అవి జరగకపోవడం వల్లే లక్షలాది ఎకరాలు నీట మునిగి రైతులు నష్టపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా తణుకులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య కార్యాలయంలో విజయమ్మ విలేకరులతో మాట్లాడారు.

ఆధునీకరణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని డ్రెయిన్ల ప్రక్షాళనకు రూ. 416 కోట్లను వైఎస్ కేటాయించారని ఆమె గుర్తు చేశారు. ఆయన మరణానంతరం ఆధునీకరణను ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని, ఆధునీకరణ జరిగి ఉంటే ముప్పు తప్పేదని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ పెంచి ఇవ్వాలని, రంగు మారిన ధాన్యాన్ని.. పత్తి, మొక్కజొన్న ఇతర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ దిశగా ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తెస్తుందన్నారు. అన్నివిధాలుగా నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కూలిపోయిన, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని విజయమ్మ డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో కూడా సరైన రక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకోలేకపోయిందని, విద్యుత్ షాక్‌తో శిబిరంలో ఒకరు చనిపోయారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు వలలు, బియ్యం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, త్వరలోనే జగన్ సీఎం అవుతారని, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూ పుతారని చెప్పారు. కౌలు రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర వ్యవసాయ శాఖకు వివరించి రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

పరిశీలిస్తూ, ధైర్యం చెబుతూ..
విజయమ్మ ఉంగుటూరు మండలం నారాయణపురంలో నీళ్లలో నడిచి వెళ్లి మునిగిన పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నాచుగుంట వద్ద పొలాలను చూసి రైతుల గోడు విన్నారు. డెల్టా ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న నందమూరు అక్విడెక్టును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వ, ఇరగవరం మండలం గోటేరు, కంతేరు, ఆచంట నియోజకవర్గంలోని మినిమించిలిపాడు, ఆచంట వేమవరంలో పూర్తిగా మునిగిన పొలాలను పరిశీలించి.. రైతులను ఓదార్చారు.

అనంతరం సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. విజయమ్మ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి తదితరులు ఉన్నారు.

వరద మృతుల కుటుంబాలకు పరామర్శ
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో వరదల్లో మృతి చెందినవారి కుటుంబాలను విజయమ్మ సోమవారం పరామర్శించారు. విజయవాడలోని పునరావాస కేంద్రంలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన పందేటి రాము (21) మృతదేహాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న ఆయన తల్లిదండ్రులు రవి, కనకదుర్గను ఓదార్చి, సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గన్నవరం మండలం ముస్తాబాద వెళ్లారు. పెద్దచెరువులో వరదనీటి ఉధృతికి ప్రాణాలు కోల్పోయిన షేక్ మస్తాన్, ఆయన కుమార్తె పర్వీన్ కుటుంబాన్ని పరామర్శించారు. ముస్తాబాదలోని ప్రమాదస్థలి వద్దకు వెళ్లిన విజయమ్మ మస్తాన్ భార్య నగీనా, తల్లి సిరాజున్నీసా, కుమారుడు మజీద్ సహా వారి బంధువులను ఓదార్చారు. విజయమ్మ వెంట పార్టీ నేతలు తలశిల రఘురాం, సామినేని ఉదయభాను, నాయకులు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన, కొడాలి నాని తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement