కొండంత అండగా
Published Wed, Oct 30 2013 3:23 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM
‘ఆదుకోవాల్సిన సీఎం సారు ఆకాశంలో చక్కర్లుగొట్టి పోతున్నాడు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మరోసారు మాయమాటలు చెప్పి మాయం అయిపోతున్నాడు. ఇక కష్టాల్లో ఉన్న రైతన్నకు దిక్కు మీరేనమ్మా’ అంటూ జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న రైతులు విజయమ్మ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. నాడు రాజన్న రైతన్న కష్టాలు తన కష్టాలుగా భావించాడు.. మాకు కష్టం కలిగినప్పుడల్లా మహానేత వైఎస్సారే గుర్తుకొస్తాడంటూ పలు ప్రాంతాల్లో రైతులు విజయమ్మ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ అధికారంలోకి వస్తేనే నాటి రాజన్న రాజ్యం తిరిగి చూడగలుగుతామని రైతులు అభిలషించారు.
సాక్షి, కాకినాడ/రాజమండ్రి :వారంరోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించి రైతుల సాధకబాధకాలను తెలుసుకునేందుకు, ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం జిల్లాలో సుడిగాలి పర్యటన జరిపారు. జగ్గంపేటలో ఉదయం 8.30 గంటలకు ప్రారంభమై సుమారు పదిగంటల పాటు ఆమె పర్యటన సాగింది. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తుని మీదుగా విశాఖ జిల్లా పాయకరావుపేటకు ఆమె బయల్దేరి వెళ్లారు. పది నియోజకవర్గాల మీదుగా సాగిన విజయమ్మ పర్యటన రైతులు, ముంపు బాధితులకు మనోధైర్యాన్నిచ్చింది. స్పష్టమైన హామీలతో ఆమె వారిలో భరోసాను నింపగలిగారు. పర్యటన సాగిన ప్రాంతాల్లో రైతులు, ముంపు బాధితులతో సహా సామాన్యులు సైతం ఆమె పర్యటనలో పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ముంపునకు గురైన పంటపొలాల్లోకి విజయమ్మ నేరుగా దిగి ‘మీకు నేనున్నాను ధైర్యంగా ఉండండ’ంటూ భరోసా కల్పించారు. దారిపొడవునా పంట కోల్పోయి దీనావస్థలో ఉన్న రైతన్న బాధ.. ఆవేదన చూసి విజయమ్మ చలించి పోయారు. ‘మీకు నేను, జగన్‌బాబు ఎప్పుడూ అండగా ఉంటాం. జగన్‌బాబు స్వయంగా వచ్చి మీ కష్టాలు చూద్దామను కున్నారు, కారణాంతరాలతో రాలేకపోయారు. మీ సమస్యలన్నింటినీ రాత పూర్వకంగా కేంద్రప్రభుత్వానికి అందజేస్తాను. పార్టీ తరఫున రైతుల బాధలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాను. రైతులకు రుణమాఫీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతాము. రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందించేలా మీ పక్షాన ఉండి పోరాడుతాం. జగన్‌బాబు అధికారంలోకి వస్తే నాటి రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ మనకు వస్తుంద’ంటూ భరోసా ఇచ్చిన ఆమె గుండె నిండా దిగులుతో ఉన్న జిల్లా రైతాంగానికి వె న్ను తట్టి ధైర్యం నింపుతూ ముందుకు సాగారు.
చంద్రబాబువి మాయమాటలు
కాట్రావులపల్లిలో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. బిక్కిన వీరభద్రం, అబ్బిక శ్రీనివాస్, కుదపా శ్రీనివాస్ తదితర రైతులు పంటనష్టం వివరాలు విజయమ్మకు వివరించారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వరిపొలాలు మునిగిపోయి ప్రతి రైతు రూ.25వేలకు పైగా నష్టపోయారని విజయమ్మకు వివరించారు. బిక్కిదారపు అబ్రహం అనే రైతు వానలకు నల్లబారిన తన పత్తి మొక్కలను చూపిస్తూ ఆవేదనకు గురయ్యాడు. కాట్రావులపల్లి సెంటర్‌లో రైతులను ఉద్దేశించి మాట్లాడిన విజయలక్ష్మి రుణమాఫీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సూరంపాలెం సెంటర్ మీదుగా సింగంపల్లి చేరుకున్నారు. సింగంపల్లిలో సత్యనారాయణ, వీరరాఘవులు తదితర రైతులు నీటమునిగి పాడైన పత్తి మొక్కలను చూపించారు. ఈ సందర్భంగా పార్టీ కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, కో ఆర్డినేటర్ రెడ్డిప్రసాద్‌లు రైతులు పెట్టిన పెట్టుబడి నీటి పాలైందని విజయమ్మకు వివరించారు. నల్లమిల్లిలో వరిచేలను పరిశీలించారు. రైతుల పక్షాన నిలిచి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
బిక్కవోలు ఆర్‌జే పేటలో నీటనానుతున్న వరి పొలాలను పరిశీలించారు. జి.మామిడాడలో ఊటకాల్వకు వరద పోటెత్తి మునిగిపోయిన పొలాలను చూశారు. నర్సారావుపేట చేరుకున్నాక తుల్యభాగ డ్రైను వంతెన వద్ద మునిగిన పంటను ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకుడు అనంత వెంకటరమణచౌదరి, అనపర్తి నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి విజయమ్మకు చూపించారు. అక్కడే వర్షాల కారణంగా దెబ్బతిన్న రొయ్యల చెరువు రైతుల బాధలను జిల్లా ఇండస్ట్రియల్ సెల్ కన్వీనర్ మంతెన రవిరాజు విజయమ్మకు వివరించారు. మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టక పోవడం వల్ల భారీవర్షాల కారణంగా తీవ్రనష్టం ఏర్పడిందని రైతులు విజయమ్మ దృష్టికి తెచ్చారు. రాజశేఖరరెడ్డి బతికుంటే డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయి ఉండేవని, మురుగు కాల్వల పరిస్థితి మెరుగై ఉండేదని, ఇటువంటి తీవ్రనష్టం వాటిల్లి ఉండేది కాదని విజయమ్మ పేర్కొన్నారు.
ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కరప చేరుకుని డ్రైను కారణంగా ముంపునకు గురైన వరిచేలను పరిశీలించారు. రైతుల గోడు విన్న విజయమ్మ జరిగిన నష్టాన్ని చూసి ఆవేదనకు గురయ్యారు. మీ బాధలు కళ్లకు కట్టినట్టున్నాయి. రైతును ఆదుకునేందుకు పార్టీ అన్నివిధాలా సహకారం అందిస్తుంది అంటూ భరోసా కల్పించారు. వలసపాకల ప్రాంతానికి చెందిన రైతులు పెంకే శ్రీను, బోని భాస్కరరావులు రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విజయమ్మను కలిసి తమ పొలాలకు వాటిల్లిన నష్టాన్ని చూపిస్తూ భోరుమన్నారు. దుగ్గుదురు సెంటర్‌లో ఇప్పటికీ పొలాలు, రోడ్డు ఏకమై పారుతున్న వరద నీటిని చూసి నష్టం స్థాయిని అవగాహన చేసుకున్న విజయమ్మ రైతు పెంకే వెంకట రమణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో నీటి వినియోగదారుల సంఘ కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి దుగ్గుదుర్రులో విజయమ్మను కలిసి జిల్లాలో రైతాంగానికి ఏర్పడిన పంటనష్టం, మురుగుకాల్వల సంరక్షణ చేపట్టకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులను వివరించారు. ఇంజరంగ్రామంలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించి విజయమ్మ కాకినాడ చేరుకున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి తల్లీ...
తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో విజయమ్మకు కాకినాడలో సాదర స్వాగతం పలికారు. నగరంలో ముంపు పరిస్థితిని విజయమ్మకు చంద్రశేఖరరెడ్డి వివరించారు. అనంతరం మధ్యాహ్నం కాకినాడ నుంచి బయల్దేరిన విజయమ్మ నేరుగా గొల్లప్రోలు ఎస్సీ కాలనీలో పర్యటించారు. ముంపునీటిలో దిగి బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ‘వారం రోజులుగా మొలలోతు నీటిలో ఉన్నాం తల్లి, మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చచ్చారా? బతికారా? అని అడిగేవారు కూడా లేర మ్మా.. ప్రతి ఏటా ముంపునకు గురవుతూనే ఉన్నాం.. 20 కేజీల బియ్యం, రెండులీటర్ల కిరోసిన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వెళ్లిపోతున్నారు. శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
మీరైనా మాకు శాశ్వత పరిష్కారం చూపాలి తల్లి అంటూ కాలనీకి చెందిన మురదా రత్నం, మత్సా మేరి, మడికి లోవకుమారి మొర పెట్టుకున్నారు. ప్రతి ఒక్కర్ని పలుకరించి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్న ఆమె కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ పార్లమెంటు పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబులు మాట్లాడుతూ వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏర్పడ్డ నష్టాన్ని స్వయంగా చూసి రైతులను, బాధితులను పరామర్శించేందుకు జగన్ తరఫున విజయమ్మ వచ్చారని చెప్పారు. మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగేదని, ఈ పరిస్థితిని ముందుగానే ఊహించే ఏలేరు ఆధునికీకరణకు నిధులు కేటాయిస్తే నేటికీ ఆ పనులు జరగలేదన్నారు.
అనంతరం కాలనీవాసులనుద్దేశించి విజయమ్మ మాట్లాడుతూ ఏలేరు ఆధునికీకరణకు రాజశేఖరరెడ్డి రూ.130 కోట్లు కేటాయించారని, ప్రస్తుత పాలకులు ఆ పనులు ఏమాత్రం పట్టించుకోలేదని అందువల్లనే మీకు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. జగన్‌బాబు అధికారంలోకి రాగానే ఏలేరు ఆధునికీకరణ పనులను పూర్తి చేయడంతో పాటు సుద్దగడ్డను కూడా ఆధునికీకరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం కత్తిపూడి బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు నియోజకవర్గంలో వాటిల్లిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏవినగరం-రావికంపాడు రోడ్డులో పీబీసీ కాలువ వద్ద ముంపునకు గురైన వరి, పత్తి చేలను పరిశీలించారు. రైతులు కుర్రా శ్రీను, పెండ్యాల రామకృష్ణ, కోనా రాంబాబులను అడి గి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు.
ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టామని, కాయలు కాసే సమయంలో పంట మొత్తం ముంపునకు గురై ఎందుకూ పనికిరాకుండా తయారైందని విజయమ్మకు వివరించారు. వరదలు, తుపానుల వల్ల ఒకే పంట ఏడాదిలో రెండుమూడుసార్లు ముంపునకు గురైన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా విజయమ్మ దృష్టికి తీసుకొచ్చారు. పీబీసీ ఆధునికీకరణ జరగకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. అనంతరం జిల్లాలో తన పర్యటన ముగించుకొని అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు వెళ్లారు. తాండవ వంతెనపై విజయమ్మకు పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. పర్యటనలో విజయమ్మ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి,
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, గంపల వెంకటరమణ, మాజీ ఎంపీలు బుచ్చిమహేశ్వరరావు, గిరజాల వెంకట స్వామినాయుడు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, రైతు విభాగం నాయకుడు ఎం. నాగిరెడ్డి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, టి.కె.విశ్వేశ్వరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీల్, బీసీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు పెంకే వెంకటరావు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, గుత్తుల రమణ, రావూరి వెంకటేశ్వరరావు,
పంపన రామకృష్ణ, రొంగల లక్ష్మి, నయీం భాయి, మంతెన రవిరాజు, డాక్టర్ యనమదల మురళీకృష్ట, వివిధ నియోజక వర్గాల కో-ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, గుత్తుల సాయి, చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్, మట్టాై శెలజ, ఆకుల వీర్రాజు, బొమ్మన రాజ్‌కుమార్, కాకినాడ నగర కన్వీనర్ ప్రూటీ కుమార్, పార్టీ నాయకులు జ్యోతుల నవీన్‌కుమార్, జక్కంపూడి రాజా, అడపా శ్రీహరి, ఆర్.వి.వి. సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement