సాక్షి, అమరావతి: ఈసారి రబీలో 31.10 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా వృథాకు అడ్డుకట్ట వేసి శివారు భూములకు సైతం జలసిరులు అందించాలని దిశానిర్దేశం చేసింది. ఖరీఫ్‌లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షల ఎకరాలకు నీళ్లందించిన నేపథ్యంలో రబీతో కలిపి మొత్తం 1.11 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
2019–20, 2020–21లోనూ ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించారు. వరుసగా మూడో ఏడాది కోటి ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తుండటం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ వరుసగా మూడేళ్ల పాటు కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళితో పాటు వాగులు, వంకలు ఉరకలెత్తాయి. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు కళకళలాడుతుండటంతో మూడేళ్లుగా ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది.
కృష్ణా డెల్టాలో మొదటిసారి...
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు విస్తరించింది. ఇప్పటివరకూ ఖరీఫ్‌లో మాత్రమే కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా రబీలోనూ కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తుండటం గమనార్హం. 2019–20లో 1.10 లక్షలు, 2020–21లో 2.50 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లందించడానికి సిద్ధమైంది. డెల్టా చరిత్రలో రబీలో ఇంత భారీగా నీళ్లందిస్తుండటం ఇదే తొలిసారి. ఈసారి రికార్డు స్థాయిలో పులిచింతల ప్రాజెక్టులో ఏకంగా 40.44 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం వల్లే కృష్ణా డెల్టాలో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీరు అందుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
వంశధార నుంచి చిత్రావతి దాకా..
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న అన్ని జలాశయాల కింద రబీలో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధారతోపాటు మధ్యతరహా ప్రాజెక్టైన మడ్డువలస ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టాకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తోంది. పశ్చిమ గోదావరిలో ఎర్రకాల్వ, తమ్మిలేరు ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ప్రకాశం జిల్లాలో సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టాతోపాటు మధ్యతరహా ప్రాజెక్టులైన రాళ్లపాడు, మోపాడు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తోంది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా డెల్టాలో ఆలస్యంగా సాగు చేపట్టిన ఖరీఫ్ పంటలకు నీటిని సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లా పరిధిలో కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల తెలుగుగంగ ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేయడం లేదు. ఎస్సార్బీసీ, తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుగంగ, గండికోట ఎత్తిపోతల, గాలేరు–నగరి తొలిదశ, చిత్రావతి, పులివెందుల బ్రాంచ్ కెనాల్, హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది.
లభ్యత ఆధారంగా రబీకి నీటి విడుదల
ప్రభుత్వ ఆదేశాల మేరకు లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తాం. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందిస్తాం. పులిచింతలలో ప్రభుత్వం దూరదృష్టితో 40.44 టీఎంసీలను నిల్వ చేయడం వల్లే కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో రబీ పంటలకు నీళ్లందించగలుగుతున్నాం. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వి/æ్ఞప్తి చేస్తున్నాం.
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment