డెల్టాలో రబీని గట్టెక్కించడానికి అడ్డుకట్టలు
రూ.5.51 కోట్లతో 560 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదన
సొమ్ము చేసుకునేందుకు నీటి సంఘాల ప్రతినిధి పథకం
తన సామాజికవర్గం కాంట్రాక్టర్ బినామీగా పనులు
తాడోపేడో తేల్చుకుంటామంటున్న మిగిలిన ప్రతినిధులు
అమలాపురం :
నీటి సంఘాల ఏలుబడి మొదలైందో, లేదో.. రైతుల పేరు చెప్పి దోపిడీకి రంగం సిద్ధమైంది. జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో రబీకి నీటి ఎద్దడి ఏర్పడడం వల్ల పంట పండుతుందో లేదో అన్న భయం రైతులను వెన్నాడుతుండగా.. తమకు మాత్రం కాసుల పంట పండుతుందని నీటి సంఘాల ప్రతినిధుల్లో కొందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే సంఘాల్లో కీలక ప్రతినిధి వారి ఆశలపై నీళ్లు జల్లారు. నీటి ఎద్దడి నివారణకు అడ్డుకట్ట( క్రాస్‌బండ్)ల ఏర్పాటును గోదావరి డెల్టావ్యాప్తంగా ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడం ద్వారా భారీగా సొమ్ములు వెనకేసుకునేందుకు సమాయత్తమయ్యూరు. మురుగునీటి క్రాస్‌బండ్ల నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోవద్దని, మొత్తం క్రాస్‌బండ్లన్నీ తానే వేస్తానని తేల్చిచెప్పేశారు. తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్‌ను బినామీగా పెట్టుకుని పనులు చేసుకుంటున్నారు.
తూర్పు, మధ్య డెల్టాల్లో చిన్నా, పెద్దా కలిపి 560 వరకు క్రాస్‌బండ్లు వేయాల్సి ఉంది. ఇందుకు రూ.5.51 కోట్ల మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ పంపించింది. వాటికి కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (క్యాడ్) అనుమతి లభించగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఎద్దడి నేపథ్యంలో అత్యవసరంగా నిర్మించాలని ఇప్పటికే పనులు ఆరంభించి 156 వరకు క్రాస్‌బండ్లు వేశారు. చిన్న క్రాస్‌బండ్‌ల వ్యయం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, పెద్ద క్రాస్‌బండ్‌లకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు ఖర్చవుతోందని అంచనా. ఈ పనులన్నీ ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడంపై ఆయా ప్రాంతాల్లోని డీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
సంఘాలకు ఎంపికైనా ఏమి లాభం?
గత నీటి సంఘాల హయాంలో టీడీపీ ఏలుబడిలో ప్రాజెక్టు కమిటీ, మెజారిటీ డీసీలు ఉండేవి. కాంగ్రెస్‌కు చెందిన డీసీలు, నీటి సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా ఇటువంటి పనులు, నీటితీరువాతో చేపట్టే పనులు వారికే వదిలేశారు. ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ రైతు సభల ద్వారా సంఘాల ఎంపిక పేరుతో మొత్తం అన్నీ తమ పార్టీకి దక్కేలా చేసింది. అయినా పనులు దక్కకపోవడం చూసి డీసీల ప్రతినిధులు లబోదిబోమంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాము కూడా ఎమ్మెల్యేలకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల చొప్పున ఇచ్చి పదవులు తెచ్చుకున్నామని, కనీసం చిన్నచిన్న పనులు కూడా ఇవ్వకపోతే ఎలా అని డీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. డీసీ ప్రతినిధుల్లో కొందరు ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యేల దృష్టి తీసుకు వెళ్లారు. త్వరలో దీనిపై పంచాయతీ పెట్టి తాడోపేడో తేల్చుకుంటామని నీటి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
క్యాష్ బండ్లు..!
Published Fri, Jan 22 2016 12:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement