అమలాపురం, న్యూస్‌లైన్ :
రబీ వరిసాగుకు పెడుతున్న పెట్టుబడి అంచనాలకుమించి పెరుగుతోంది. మోటార్లతో నీటి తోడకం.. ఎలుకలు నివారణ.. పురుగు మందుల వాడకం.. ఆపై కూలి ఖర్చులు... ఇలా చెప్పుకుంటూ పోతే రబీ సాగు ఆరంభం నుంచి రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు.
గోదావరి డెల్టా రబీ కీలక దశకు చేరుకుంది. తూర్పు డెల్టాలో పదిపదిహేను రోజుల్లో కోతలు ఆరంభమయ్యే అవకాశముంది. ఇదే డెల్టాలో శివారుల్లోను, మధ్యడెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్నాయి.
ఈ సమయంలో రైతులు పొలాల్లో ఎక్కువగా నీరు పెడుతుంటారు. పంట కాలువల నిండుగా నీరున్నా పంటబోదెలు, చానల్స్ శివారు పొలాలకు చేరడం లేదు. ఇన్‌ఫ్లోలు ఆశాజనకంగా ఉండడంతో అధికారులు నీటి విడుదలను పెంచారు. ప్రస్తుతం రెండు డెల్టాల్లో 100 డ్యూటీ (ఒక క్యూసెక్కు 100 ఎకరాల) చొప్పున పంపిణీ చేస్తున్నారు.
అయితే ఎండల వండ డిమాండ్ పెరగడం పెంచిన నీరు సరిపోవడం లేదు. దీనితో రైతులు మోటార్లతో నీరు తోడాల్సి వస్తుంది. మొదట్లో ప్రతీ 15 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోయేది. అయితే ఎండలు పెరగడంతో వారం, పది రోజులకు ఒకసారి సాగునీరు పెట్టాల్సి ఉంది.
‘ఎకరాకు నీరు పెట్టాలంటే మూడు గంటల సమయం పడుతుంది. గంటకు రెండు లీటర్లు చొప్పున ఆరు లీటర్లు, మెటార్లు అద్దె కలిపి తడవకు రూ.800 వరకు ఖర్చు అవుతుందని’ ఉప్పలగుప్తం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపా రు.
పంట పూర్తయ్యే సమయానికి మరోరెండు,మూడు తడవలు నీరు పెట్టాల్సి ఉంది. ఈ విధంగా చూస్తే సాగునీటికే రూ.మూడు, నాలుగు వేలు అదనంగా పెట్టుబడి పెట్టాలని రైతులు వాపోతున్నారు.వాతావరణ మార్పుల వల్ల రైతులు తెగుళ్ల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు.
మార్చి నాలుగవ వారంలో కూడా రాత్రులు మంచు కురుస్తుండడం, ఉదయం ఎండలు కారణంగా ఆకు ముడత, మండి తెగులు రాకుండా రైతులు అధికంగా మందులు వినియోగించాల్సి వస్తుంది. ఈనిన చేలల్లో మెడవిరుపు రాకుండా కూడా మందులు వాడుతున్నారు. సాధారణంగా రబీలో ఎరువులు, పురుగుమందుల వినియోగం ఎక్కువుగా ఉంటుంది.
ఆ వినియోగం కన్నా అదనంగా పురుగు మందులు వాడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. నీటి ఎద్దడి కారణంగా చేలల్లో నై తీశాయి. నాట్లు వేసిన పది రోజుల నుంచి కలుపు విపరీతంగా పెరగడం, పెద్ద సంఖ్యలో కూలీలను వినియోగించి తొలగించడం రైతులకు భారంగా మారింది.
ఇప్పటికే చాలా మంది రైతులు రెండు,మూడుసార్లు కలుపు తీయించారు. దీనికితోడు ఎలుకల నిర్మూలనకు సైతం రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఏ విధంగా చూసినా ఈసారి రబీలో ఎకరాకు అదనంగా రూ.ఐదారు వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడి అదనం...రైతులపై భారం
Published Tue, Mar 25 2014 12:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement