రబీ సాగుకు సమాయత్తం కండి
రబీ సాగుకు సమాయత్తం కండి
Published Fri, Sep 16 2016 7:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– సబ్సిడీలో రైతులకు విత్తనాలు
ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్, వ్యవసాయ శాఖ జేడీ వెల్లడి
నంద్యాలరూరల్: రైతులు రబీసాగుకు సమాయత్తం కావాలని, ఇందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఏడీఆర్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ట్రై నింగ్ అండ్ విజిట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో వేసిన పంటలకు ఇటీవల కురిసిన వర్షాలు ప్రాణం పోశాయని, రబీ సాగుకు కూడా ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రస్తుతం తెగుళ్లు సోకే అవకాశం ఉందని వాటి నివారణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పత్తిలో గులాబీ రంగు తెగుళ్లు ఆశించిందని, అయితే ఇటీవల భారీ వర్షం కారణంగా వాటి ఉద్ధ్ధృతి తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు. జిల్లాలో రబీ కింద 3.8హెక్టార్లు సాగు అవుతుందని వారు వివరించారు. 98వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు సబ్సిడీతో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. శనగ, వేరుశనగ, మినుము, పెసలు, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటలను రైతులు రబీలో సాగు చేస్తారని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని జేడీఏ, ఏడీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లాలోని అన్ని డివిజన్ల వ్యవసాయ సహాయ సంచాలకులు, ఆర్‌ఏఆర్‌ఎస్ సీనియర్, జూనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement