వర్షపు నీరు అయిపోతోంది
ప్రాజెక్టుల్లోనూ అడుగంటిన నీరు
చేతులెత్తేసిన అధికారులు ఆందోళనలో రైతాంగం
విజయవాడ : కృష్ణాడెల్టాకు సాగు నీటి సమస్య యథాతధంగా కొనసాగుతోంది. ఒకవైపు వరుణుడు చిన్నచూపు చూడటం మరొకవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో జల వనరుల శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో కృష్ణా డెల్టాలో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతోంది. తాగునీరు కూడా లేక కొన్ని గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు.
3080 క్యూసెక్కుల నీరు విడుదల..
ఇటీవల వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన సుమారు 1.2 టీఎంసీ నీరు కీసర వద్ద కృష్ణానదికి చేరడంతో రెండుమూడు రోజులుగా ఈ నీటిని కాల్వలకు వదులుతున్నారు. శనివారం 5003 క్యూసెక్కుల నీరు వదలగా, ఆదివారానికి వరద నీరు తగ్గడంతో 3080 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదిలినట్లు జలవనరుల శాఖ చెబుతోంది. ఏలూరు కాల్వకు 103 క్యూసెక్కులు, రైవస్ కాల్వకు 1021, బందరు కాల్వలకు 340, కృష్ణా పశ్చిమ కాల్వకు 2010 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.2 అడుగుల నీరు మాత్రమే ఉంది. సోమవారం వరద నీటి రాక మరింత తగ్గే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు.
శ్రీశైలం నుంచి నీరు నాలుగు రోజులకు
కృష్ణాడెల్టాలో తాగునీటికి కటకటలాడుతూ ఉండటంతో శ్రీశైలం నుంచి మూడు టీఎంసీ నీటిని విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించారు. అయితే ఈ నీటిని ఆదివారం వరకు విడుదల చేయలేదు. శ్రీశైలంలో నీటిని విడుదల చేసిన తరువాత నాలుగు రోజులకు ప్రకాశం బ్యారేజ్‌కు వస్తాయి. అయితే ఈ నీటిని పూర్తిగా క్రిందకు వదిలిపెట్టకుండా పులిచింతల ప్రాజెక్టులో స్టోర్ చేసి కృష్ణాడెల్టాలో తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
గోదావరి జలాల జాడేది?
పంద్రాగస్టున పట్టిసీమను జాతికి అంకితం ఇచ్చి గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకువస్తామంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు ఊదరగొట్టారు. దీంతో ఆగస్టు 15 తరువాత నీటి సమస్య ఉండబోదని రైతులు భావించారు. అయితే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినట్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించినా ప్రకాశం బ్యారేజ్‌కు మాత్రం గోదావరి జలాలు ఒక చుక్క కూడా చేరలేదు. జిల్లా రైతాంగం కష్టాలు యథావిధిగా ఉన్నాయి.
పట్టిసీమ నీరు రాలేదు
Published Mon, Aug 17 2015 1:27 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement