ఎట్టకేలకు కృష్ణాడెల్టాలో రబీకి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా మిగిలి ఉన్న ఖరీఫ్‌తో పాటు రబీకి కూడా ఆదివారం నీరు విడుదలైంది.
సాక్షి, విజయవాడ : ఎట్టకేలకు కృష్ణాడెల్టాలో రబీకి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా మిగిలి ఉన్న ఖరీఫ్‌తో పాటు రబీకి కూడా ఆదివారం నీరు విడుదలైంది. శనివారం వరకు కేఈబీ కెనాల్ కోసం 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఆదివారం సాయంత్రానికి దాన్ని 1054కు పెంచారు. ఈసారి రబీపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించినా రైతుల నుంచి పెద్దగా స్పందన కనపడలేదు. దీంతో రైతులు ఎప్పుడు అడిగితే అప్పుడు నీరు విడుదల చేస్తామని చెప్పారు.
అక్కడక్కడ నారుమళ్ల కోసం రైతులు నీరు అడుగుతుండటంతో దశలవారీగా నీటి విడుదల పెంచాలని నిర్ణయించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఖరీఫ్ ఆలస్యంగా వేయడంతో ఇప్పటికీ నీరిస్తున్నారు. ఈ నీటిని ఉపయోగించుకుని గుంటూరు జిల్లాలో నారుమళ్లు వేస్తున్నారు. కృష్ఱాజిల్లాలో మాత్రం రబీ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. గుడివాడ ప్రాంతంలో శేరిగొల్వేపల్లి, గుంటాకోడూరు గ్రామాల్లో ఇప్పటికి పొలాల్లో నీరు తగ్గని పరిస్థితి ఉంది. దీంతో ఈ గ్రామాల ప్రజలు దాళ్వా వేయడానికి ఆసక్తి చూపడం లేదు. రబీకి ఇప్పటికే అదను దాటిపోయిందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి నుంచి 120 రోజుల పంట, ఆ తర్వాత కోసి కుప్ప నూర్చడం, మళ్లీ ఖరీఫ్‌కి సిద్ధం కావడానికి సమయం సరిపోదనే భావనతో ఎక్కువ మంది అపరాలు వేయడానికి సన్నద్ధం అవుతున్నారు. శివారు ప్రాంతాల్లో దాళ్వా విషయంలో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడూరు మండలం జి.కొత్తపాలెం, నారేపాలెం గ్రామాల విషయంలో రైతుల మధ్య విభేదాలు కలెక్టర్ వద్ద పంచాయితీకి చేరాయి. చివరి భూముల రైతులు దాళ్వా కావాలని చేస్తున్న డిమాండ్ వెనుక ఎరువుల డీలర్లు, మిల్లర్లు ఉన్నారని ఆ ప్రాంత అధికారులు చెబుతున్నారు. కృష్ణా తూర్పు డెల్టాలో మూడు లక్షల ఎకరాలకు నీరివ్వడానికి తాము సన్నద్ధంగా ఉన్నామని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.