పులిచింతల ప్రాజెక్టు: పాత పాపాలే శాపాలు! | TDP Chandrababu Bollineni Ramarao Scams In Pulichintala Krishna Delta Farmers | Sakshi
Sakshi News home page

Pulichintala Project: పాత పాపాలే శాపాలు!

Published Fri, Aug 6 2021 3:04 AM | Last Updated on Fri, Aug 6 2021 9:33 AM

TDP Chandrababu Bollineni Ramarao Scams In Pulichintala Krishna Delta Farmers - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులనూ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడా లేని రీతిలో ఆర్బిట్రేషన్‌ నిబంధనను ఈ కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చడం ద్వారా బొల్లినేని ఆదిలోనే ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు బాటలు వేశారు. డిజైన్‌ మారడం వల్ల చేసే పని పరిమాణం పెరిగితే.. అందుకు అదనంగా బిల్లులు చెల్లించేందుకు సర్కార్‌ అంగీకరించకుంటే ఆర్బిట్రేషన్‌ (వివాదాల పరిష్కార మండలి)కి పంపుతారు. ఈ కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌లో ఒక సభ్యుడిని బొల్లినేని, మరొక సభ్యుడిని జలవనరుల శాఖ, ఇంకో సభ్యుడిని ఆ ఇద్దరూ ఎన్నుకునేలా నిబంధన చేర్చడం గమనార్హం. ఈలోగా 2004 ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది.

ఆర్బిట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టే వరకూ పులిచింతల ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్‌ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వైఎస్సార్‌ అధికారం చేపట్టిన తర్వాత పనులను పరుగులు పెట్టించారు. ఆర్బిట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం బొల్లినేని రామారావు చీటికిమాటికీ పేచీ పెడుతుండటంతో జలవనరుల శాఖలో చేపట్టే పనుల్లో ఆ నిబంధనను వైఎస్సార్‌ రద్దు చేశారు. పనుల్లో జాప్యం వల్ల తనకు తీవ్ర  నష్టం వాటిల్లిందని కాంట్రాక్టర్‌ పేచీకి దిగడంతో ఆర్బిట్రేషన్‌ సూచనల మేరకు రూ.5.65 కోట్ల పరిహారాన్ని అప్పట్లో సర్కార్‌ చెల్లించింది. అయినప్పటికీ ఆర్బిట్రేషన్‌ నిబంధనను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం మరోసారి పేచీ పెట్టారు. పులిచింతల స్పిల్‌వేను 500.25 మీటర్లు పెంచారని.. గేట్లను 32 నుంచి 24కు తగ్గించారని.. భూసేకరణలో జాప్యం వల్ల ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని.. ఇలా 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో బొల్లినేని కోరారు. దీన్ని పరిశీలించిన డీఏబీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రతిపాదనలు చేశారు. మొత్తమ్మీద రూ.199.96 కోట్లను అదనంగా చెల్లించాలంటూ 2013 అక్టోబర్‌ 3న ప్రతిపాదించారు. డీఏబీ–2 ప్రతిపాదనలను ముగ్గురు ఐఏఎస్‌లతో నియమించిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పంపారు. కాంట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.72 కోట్లను చెల్లించడానికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 

కోర్టులో కేసును నీరుగార్చి...
లోపాయికారీగా సహకరించి తన ప్రభుత్వాన్ని రక్షించిన చంద్రబాబు సూచనల మేరకు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో న్యాయ వివాదాలు తలెత్తడంతో మచిలీపట్నం కోర్టు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లుల చెల్లింపుపై సుదీర్ఘ విచారణ జరిపింది. కాంట్రాక్టర్‌ ప్రస్తావించిన 27 అంశాలను తిప్పికొట్టేలా సమర్థ వాదనలు వినిపించకుండా గత సర్కారు అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు 2016 జూన్‌ 2న తీర్పిచ్చింది. దాని ప్రకారం రూ.199.96 కోట్లను  2013 అక్టోబర్‌ 3 నుంచి 15% వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.399.34 కోట్లకు చేరుకుంది.

రూ.199.67 కోట్లు దోచిపెట్టిన చంద్రబాబు..
మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేసేందుకు అనుమతించాలంటూ 2016 జూన్‌ 2 నుంచి 2018 అక్టోబర్‌ 1 వరకూ జలవనరుల శాఖ అధికారులు పలుదఫాలు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, నాటి మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంసినా న్యాయ సలహా పేరుతో కాలయాపన చేశారు.  చివరకు వ్యూహాత్మకంగా 2018 అక్టోబర్‌ 23న హైకోర్టును ఆశ్రయించడానికి గత సర్కార్‌ అనుమతి ఇచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయకుండా 766 రోజులు ఏం చేశారంటూ నాడు హైకోర్టు ప్రశ్నించింది. కేసును విచారించాలంటే కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అంటే రూ.199.67 కోట్లను డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. దీంతో ఈమేరకు 2019 జనవరి 1న టీడీపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తాన్ని ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు చూపకుండానే డ్రా చేసుకున్న బొల్లినేని–చంద్రబాబు ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున వెదజల్లినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బొల్లినేని ఇలా చంద్రబాబు దన్నుతో ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే పులిచింతల 16వ గేటు ఊడిపోయిందని స్పష్టమవుతోంది,.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement