డెల్టా, కుడి కాలువ రైతుల్లో ఆందోళన
మాచర్ల టౌన్: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం చాలా తక్కువగా ఉండడంతో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది సకాలంలో నీరు విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రతియేటా ఖరీఫ్ ప్రారంభం కాగానే ముందుగానే కృష్ణా డెల్టాకు సాగర్ ప్రధాన జలవిద్యుత్కేంద్రం నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించి దిగువ కృష్ణానది ప్రాంతంలో ఉన్న డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ప్రతిరోజూ పది వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని విద్యుదుత్పాదన అనంతరం నీటిని డెల్టాకు వెళతాయి.
రాష్ట్ర విభజన జరగడంతో డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. ఈనెల 25వ తేదీ వరకు నీటి విడుదలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడడం లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం కేవలం 517 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. 510 అడుగులకు నీరు తగ్గిపోతే డెల్టా, కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. సాగర్ రిజర్వాయర్‌కు ప్రస్తుతం పైనుంచి కూడా ఎటువంటి వరదనీరు రావడం లేదు.
వర్షాభావ పరిస్థితి మరో వైపున కృష్ణా నదికి నీటి ప్రవాహం ప్రారంభమైనా ముందుగా అల్మట్టి డ్యామ్ పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకున్నాకే ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తారు. ఈ పరిస్థితుల్లో సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో డెల్టాకు ఏదో ఒకవిధంగా త్వరలో నీటిని విడుదల చేసినా.. కుడికాలువకు మాత్రం ఇప్పట్లో నీటిని విడుదల చేసే అవకాశం లేదు.
ఓ వైపు మెట్ట ప్రాంతాలు, బోర్ల భూముల్లో వర్షాలు లేక రైతులు సాగుకు నిలిపివేయగా సాగర్ ఆయకట్టు పరిధిలోని కుడికాలువ నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో రైతులు కూడా మరో నెల రోజులపాటు కాలువ కింద భూములను సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదు. డెల్టా రైతులు నీటి కోసం ఎదురుచూస్తుంటే కాలువ రైతులు అసలు నీరు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. అటు మెట్ట భూములు ఇటు కాలువ భూముల రైతులు ఈ ఏడాది సాగు జాప్యంపై ఆందోళన చెందుతున్నారు.