పుష్కరకాలంలో ఏనాడు లేదు
పుష్కరకాలంలో ఏనాడు లేదు
Published Sat, Jun 10 2017 4:15 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
నాగార్జునసాగర్: గత పుష్కరకాలంలో ఏనాడు లేనంతగా సాగర్ జలాశయ నీటి మట్టం కనిష్టస్థాయికి చేరింది. హైదరాబాద్‌తో పాటు ప్లోరిన్ పీడిత ప్రాంతాలకు త్రాగు నీరిందించేందుకు శ్రీశైలం జలాశయం నుండి నీటిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 502.20 అడుగులుండగా 118.806 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం నీటిమట్టం 775.90 అడుగులుండగా కేవలం 18.8677 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 2005 నుండి ఈ ఏడాది వరకు ఇంత తక్కువ నీటిమట్టం ఏనాడూ నమోదు కాలేదు.
ఆంధ్ర-తెలంగాణ నాయకులు, అధికారులు జలాశయాలు ఖాళీ అయ్యేలా పోటీపడి నీటిని విడుదల చేయించారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా నీటి నిల్వ 312.0450 టీఎంసీలు ఉంది. సాగర్‌లో పూడిక చేరకముందు 408.24 టీఎంసీల నీటి నిల్వలు ఉండేవి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. నీటి నిల్వ 215.8 టీఎంసీలు. పూడిక నిండకముందు 308టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 2001 నుండి 2005 వరకు అయిదేళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు జలాశయాల నీటిమట్టాలు, సాగునీరు, రైతుల గురించి పట్టించుకోకపోగా వ్యవసాయం దండగ అంటూ కాలం గడిపారు. దీనికి తోడు సకాలంలో వర్షాలు కురవక వరదలు రాక జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. కరవు కరాళ నృత్యం చేసింది.
సాగర్ జలాశయం కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా వరుసగా 2003, 2004 లలో 500 అడుగులకంటే దిగువకు వెళ్లింది. అనంతరం రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుకుని క్రస్ట్ గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలయ్యింది. పదేళ్లు కరవు ఛాయలు కనపడలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం ఇదేనెలలో సాగర్ జలాశయం నీటిమట్టం 517.90 అడుగులున్నది. 2015 లో 514.10 ఉండగా 2016 లో 506.20 అడుగులకు కనీస నీటిమట్టం కన్నా దిగువకు తగ్గింది.
వరదలు వచ్చినప్పటికీ నాగార్జునసాగర్ జలాశయం వరకు నీటి రాక ప్రారంభం కాగానే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తర్వాత వర్షాలు ముఖం చాటుచేశాయి. అయినప్పటికీ సాగునీటి శాఖ అధికారులు నీటిìని వృధా చేయకుండా ప్రతి నీటిబొట్టుకు లెక్కలు గట్టి కాల్వల్లో నీటిని పారించి అత్యధికంగా పంటలు పండేందుకు కృషిచేసినట్లు ఆయకట్టు ప్రాంత రెతులు తెలిపారు. ఈ ఏడాది రైతులకు తిరిగి చంద్రబాబుకాలం నాటి పరిస్థితులు జ్ఞప్తికి వస్తున్నాయి.
శ్రీశైలం నుండి నీరు వస్తేనే..
శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయంలోకి నీరు విడుదలైతేనే తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు సరఫరా కానుంది. ఇప్పటికే కష్ణా నది యాజమాన్యం బోర్డుకు నీటి విడుదల కోసం లేఖ రాసినట్లు సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునిల్ తెలిపారు. త్వరలో శ్రీశైలం నుండి నీటిని విడుదల చేయాలని నల్లగొండ ప్రజలతో పాటు హైద్రాబాద్ ప్రజలు కోరుతున్నారు.
Advertisement