Sagar Basin
-
Strange Fish: రెక్కలతో నిలబడే చేప
బనశంకరి: శివమొగ్గ జిల్లా సాగర జలాశయంలో అపరూపమైన చేప కనబడింది. ఓ మత్స్య జీవశాస్త్రజ్ఞుడు ఎగిరే చేపను పసిగట్టి ఫోటోలు తీశాడు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. ఎగిరే చేపలు అక్కడక్కడా సముద్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాగర చెరువులో రెక్కల చేప దర్శనమిచ్చినట్లు తెలిపారు. నేను 6 రకాల ఎగిరే చేపలను చూశా, కానీ ఇప్పుడు చూసిన చేప చాలా విచిత్రమైనది. ఇది ఎగరడమే కాదు, రెక్కలపై నిలబడుతుంది కూడా. ఇది కుతూహలంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. (చదవండి: కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!) -
అటవీ భూముల.. ఆక్రమణ!
సాక్షి, దామరచర్ల(నల్గొండ) : పక్కనే మూసీ, కృష్ణా నది.. నీటి వనరులు పుష్కలం.. చుట్టుపక్కల విస్తారమైన అటవీ ప్రాంతం.. ఇంకేముంది అక్రమార్కులు అడవిపై పడ్డారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కబ్జాపర్వం మొదలుపెట్టారు. కొందరు పంటలు సాగు చేసుకుంటుండగా, మరికొందరు క్రయ విక్రయాలు కూడా జరుపుతున్నారు. ఇదీ.. దామరచర్ల మండలంలోని అటవీభూముల్లో ఆక్రమణల తీరు. అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరంగా మారింది. దామరచర్ల మండలంలో వందలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. ఇవి క్రయ విక్రయాలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టంలోని లొసుగులను ఆ«ధారంగా చేసుకొని కొందరు అధికారులు తప్పుడు పట్టాలు ఇచ్చారు. వందలాది ఎకరాలు పరాధీనం అవుతున్నా, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడి వందలాది ఎకరాల డీఫామ్ పట్టా భూములు సైతం వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం ఓవైపు హరితహారం పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుండగా, మరో పక్క కొందరు అవినీతి అధికారుల కారణంగా ఉన్న అడవి నాశనం అవుతోంది. మిర్యాలగూడ రేంజర్ పరిధిలో4,99,259.91 హెక్టార్ల అటవీ భూమలున్నాయి. అందులోని దామరచర్ల మండలం పలుగ్రామాల్లో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ తంతు దశాబ్దకాలంగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దామరచర్ల రెవెన్యూ పరిధిలోని 430 సర్వే నంబర్లో 1,089 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిల్లో సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు కొంతమేర కేటాయించారు. డీఫామ్ పట్టాల భూముల్లో సైతం ఆక్రమణదారులు చేరారు. ఈ భూములన్నీ మూసీ నది పక్కన ఉండడం, లిప్టు సౌకర్యం ఉండటంతో దర్జాగా సాగు చేసుకుంటు న్నారు. కరెంట్, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకొని, బోర్లు వేసి çవరి, పత్తి లాంటి పంటలు పండించుకుంటున్నారు. వీటిని కొందరు వ్యక్తులు విక్రయాలు సైతం జరుపుతున్నారు. సర్వే నంబర్ 826లో 1097 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిల్లో సైతం పలువురు కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కొందరైతే తాము ఆక్రమించుకున్న అటవీ భూములను అమ్ముకుంటున్నారు కూడా. వీటిపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలువురు ఫిర్యాదు కూడా చేశారు. దామరచర్ల కనుచూపు మేరలోనే అటవీ భూముల అక్రమాల పర్వం జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనుమరుగవుతున్న వనసంపద దామరర్ల మండలంలోని కృష్ణా, మూసీనది, అన్నమేరు వాగుల నడుమ వందలాది ఎకరాల్లో ఉన్న అటవీ భూముల్లోని వనసంపద కనుమరుగవుతోంది. విలువైన, సారవంతమైన భూములు కావడం, నీటి సౌకర్యం ఉండడంతో చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ చెట్లను నరికి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. దామరచర్ల, నర్సాపురం, వాచ్యాతండా, కల్లేపల్లి, తాళ్లవీరప్ప గూడెం, గణేష్పాడ్, వాడపల్లి తదితర గ్రామాల్లోని అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారుల్లో స్పష్టత కరువు సాగర్ నిర్వాసితుల కోసం దామరచర్లలోని సర్వేనంబర్ 430, నర్సాపురం సర్వేనంబర్ 826, గాంధీనగర్ సర్వేనంబర్ 441లోని అటవీ భూముల్లో కొంతభాగాన్ని డీ ఫారెస్టు చేసి పట్టాలు ఇచ్చారు. అయితే వీటిపై అధికారుల్లో స్పష్టత లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరు? వారికి ఏ సర్వేనంబర్‌లో ఎంతమేర భూములు.. ఎక్కడెక్కడ కేటాయించారు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డీ ఫారెస్టు భూములు క్రయ విక్రయాలకు వీలుండడంతో, కొందరు అవినీతి అ«ధికారులు అక్రమ పట్టాలు ఇచ్చారు. వీటిని ఆసరాగా చేసుకొని కబ్జాల పర్వం సాగుతోంది. అటవీశాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి, నిజమైన డీఫామ్ పట్టాదారులను గుర్తిస్తే కబ్జాకు గురైన వందలాది ఎకరాల అటవీభూములును రక్షించే వీలుంది. తాజాగా మండలంలోని 430లో సర్వే చేస్తున్నందున, మిగిలిన చోట్ల కూడా సర్వే జరిపి కబ్జాదారుల కబంధ హస్తాలనుంచి అటవీ భూములను రక్షించాల్సి ఉంది. దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
మరో 15 టీఎంసీలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం జలాశయం నుంచి మరో 15 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విన్నవించింది. సాగర్ ఎడమ కాల్వ కింది అవసరాలకు 10 టీఎంసీ లు, కల్వకుర్తి కింది అవసరాలకు మరో 5 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ మేరకు బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకి నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఇప్పటికే హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 4 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీలు కలిపి 9 టీఎంసీల కేటాయింపులకు అదనంగా మరిన్ని కేటాయింపులు కావాలని కోరారు. శ్రీశైలంలో 871 అడుగుల్లో 147.28 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, ఇందులో కనీస నీటి మట్టం 834 అడుగులకు ఎగువన 93.43 టీఎంసీల మేర నిల్వలున్నాయని బోర్డు దృష్టికి తెచ్చారు. సాగర్‌లో 514.2 అడుగుల వద్ద 138.91 టీఎంసీల నిల్వలుండగా, ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగుల ఎగువన కేవలం 7.24 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. శ్రీశైలంలో ఉన్న లభ్యత నీటిలోంచి నల్లగొండ, ఖమ్మం, మిషన్ భగీరథ అవసరాల కోసం సాగర్ ఎడమ కాల్వ కింద 10 టీఎంసీలు కేటాయించాలన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల తాగునీటి అవసరాలకు కల్వకుర్తి నుంచి 5 టీఎంసీలు అవసరమని తెలిపారు. నీటి కేటాయింపులు తేల్చేందుకు త్రిసభ్య కమిటీ భేటీని మరోమారు నిర్వహించాలని కోరారు. మరోవైపు శ్రీశైలం ఎడమ కాల్వ కింద విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలం టూ బోర్డు చేసిన ప్రతిపాదనను రాష్ట్రం తిరస్కరించింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా ఉత్పత్తి కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ బోర్డుకు మరో లేఖ రాసింది. -
వాటా నీటి కోసం పోరాటం
నెర్రెలిచ్చిన సాగర్ ఆయకట్టు వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు జాతీయ రహదారి దిగ్బంధం రైతులకు బాసటగా ఎమ్మెల్యే రవికుమార్ సంతమాగులూరు : ‘సాగరమే నా చేరువునున్నా దాహం తీరదులే’ అనే సినీ గీతంలో విషాదం సాగర్ ఆయకట్టుదారుల్లోనూ తొంగిచూస్తోంది. సాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వ వైఫల్యం కారణంగా కాలువలకు నీరు సక్రమంగా అందక వేసిన నాట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికీ నాట్లు పూర్తిచేయలేక ఎండిపోతున్న వరినారు చూసుకుంటూ అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. అద్దంకి బ్రాంచి కెనాల్ పరిధిలో జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికి 50 శాతం కూడా వరినాట్లు పూర్తికాకపోగా వేసిన నాట్లు, నార్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఏబీసీ జిల్లా సరిహద్దు 18/0 మైలు రాయి వద్దకు 1800 క్యూసెక్కులు రావల్సి ఉండగా కేవలం 7 నుంచి 9 వందల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. ఎగువ మేజర్లకు కూడా నీరు ఎక్కక పైర్లు ఎండిపోతున్నాయి. ఈ నేపద్యంలో ప్రజా సమస్యలే తమ అజెండాగా పోరాటాలు చేస్తున్న వై.ఎస్.ఆర్. సీపీ రైతులకు అండగా నిలిచి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆయకట్టు రైతులతో కలిసి ఆదివారం జాతీయ రహదారిని ముప్పవరం టోల్ గేట్ వద్ద అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసేందుకు నడుం బిగించింది. నేడు ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో రాస్తారోకో అద్దంకి : అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు విడుదల కావాల్సిన వాటా నీరు రాకపోవడాన్ని నిరసిస్తూ సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం అడ్డురోడ్డు వద్ద రైతులతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీ పరిధిలో ఉన్న ఏ మేజరుకు సక్రమంగా విడుదల కావాల్సిన పరిమాణంలో నీరు విడుదల కావడం లేదన్నారు. సాగరు డ్యామ్‌లో పూర్తి పరిమాణంలో నీరున్నా ఆయకట్టు పరిధిలోని వరి పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శంఖవరప్పాడు రైతులు అద్దంకిలో రాస్తారోకో చేసినా తరువాత రెండు రోజులు అధికారులు హడావుడిగా నీరు తేవడమే కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మట్లాడినా ఫలితం కనిపించకపోవడంతో రాస్తారోకోకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటూ అటు విద్యుత్ కోతలు, ఇటు సాగరు నీటిలో రావాల్సిన వాటాకు కోతలు విధిస్తోందని విమర్శించారు. నీటి వాటా విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు చేసే ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ హాజరు కావాలని పిలపునిచ్చారు. -
డెల్టా, కుడి కాలువ రైతుల్లో ఆందోళన
మాచర్ల టౌన్: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం చాలా తక్కువగా ఉండడంతో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది సకాలంలో నీరు విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రతియేటా ఖరీఫ్ ప్రారంభం కాగానే ముందుగానే కృష్ణా డెల్టాకు సాగర్ ప్రధాన జలవిద్యుత్కేంద్రం నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించి దిగువ కృష్ణానది ప్రాంతంలో ఉన్న డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ప్రతిరోజూ పది వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని విద్యుదుత్పాదన అనంతరం నీటిని డెల్టాకు వెళతాయి. రాష్ట్ర విభజన జరగడంతో డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. ఈనెల 25వ తేదీ వరకు నీటి విడుదలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడడం లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం కేవలం 517 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. 510 అడుగులకు నీరు తగ్గిపోతే డెల్టా, కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. సాగర్ రిజర్వాయర్‌కు ప్రస్తుతం పైనుంచి కూడా ఎటువంటి వరదనీరు రావడం లేదు. వర్షాభావ పరిస్థితి మరో వైపున కృష్ణా నదికి నీటి ప్రవాహం ప్రారంభమైనా ముందుగా అల్మట్టి డ్యామ్ పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకున్నాకే ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తారు. ఈ పరిస్థితుల్లో సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో డెల్టాకు ఏదో ఒకవిధంగా త్వరలో నీటిని విడుదల చేసినా.. కుడికాలువకు మాత్రం ఇప్పట్లో నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఓ వైపు మెట్ట ప్రాంతాలు, బోర్ల భూముల్లో వర్షాలు లేక రైతులు సాగుకు నిలిపివేయగా సాగర్ ఆయకట్టు పరిధిలోని కుడికాలువ నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో రైతులు కూడా మరో నెల రోజులపాటు కాలువ కింద భూములను సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదు. డెల్టా రైతులు నీటి కోసం ఎదురుచూస్తుంటే కాలువ రైతులు అసలు నీరు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. అటు మెట్ట భూములు ఇటు కాలువ భూముల రైతులు ఈ ఏడాది సాగు జాప్యంపై ఆందోళన చెందుతున్నారు.