నెర్రెలిచ్చిన సాగర్ ఆయకట్టు
వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు జాతీయ రహదారి దిగ్బంధం
రైతులకు బాసటగా ఎమ్మెల్యే రవికుమార్
సంతమాగులూరు : ‘సాగరమే నా చేరువునున్నా దాహం తీరదులే’ అనే సినీ గీతంలో విషాదం సాగర్ ఆయకట్టుదారుల్లోనూ తొంగిచూస్తోంది. సాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వ వైఫల్యం కారణంగా కాలువలకు నీరు సక్రమంగా అందక వేసిన నాట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికీ నాట్లు పూర్తిచేయలేక ఎండిపోతున్న వరినారు చూసుకుంటూ అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. అద్దంకి బ్రాంచి కెనాల్ పరిధిలో జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికి 50 శాతం కూడా వరినాట్లు పూర్తికాకపోగా వేసిన నాట్లు, నార్లు నిలువునా ఎండిపోతున్నాయి.
ఏబీసీ జిల్లా సరిహద్దు 18/0 మైలు రాయి వద్దకు 1800 క్యూసెక్కులు రావల్సి ఉండగా కేవలం 7 నుంచి 9 వందల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. ఎగువ మేజర్లకు కూడా నీరు ఎక్కక పైర్లు ఎండిపోతున్నాయి. ఈ నేపద్యంలో ప్రజా సమస్యలే తమ అజెండాగా పోరాటాలు చేస్తున్న వై.ఎస్.ఆర్. సీపీ రైతులకు అండగా నిలిచి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆయకట్టు రైతులతో కలిసి ఆదివారం జాతీయ రహదారిని ముప్పవరం టోల్ గేట్ వద్ద అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసేందుకు నడుం బిగించింది.
నేడు ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో రాస్తారోకో
అద్దంకి : అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు విడుదల కావాల్సిన వాటా నీరు రాకపోవడాన్ని నిరసిస్తూ సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం అడ్డురోడ్డు వద్ద రైతులతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీ పరిధిలో ఉన్న ఏ మేజరుకు సక్రమంగా విడుదల కావాల్సిన పరిమాణంలో నీరు విడుదల కావడం లేదన్నారు. సాగరు డ్యామ్‌లో పూర్తి పరిమాణంలో నీరున్నా ఆయకట్టు పరిధిలోని వరి పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై శంఖవరప్పాడు రైతులు అద్దంకిలో రాస్తారోకో చేసినా తరువాత రెండు రోజులు అధికారులు హడావుడిగా నీరు తేవడమే కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మట్లాడినా ఫలితం కనిపించకపోవడంతో రాస్తారోకోకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటూ అటు విద్యుత్ కోతలు, ఇటు సాగరు నీటిలో రావాల్సిన వాటాకు కోతలు విధిస్తోందని విమర్శించారు. నీటి వాటా విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు చేసే ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ హాజరు కావాలని పిలపునిచ్చారు.
వాటా నీటి కోసం పోరాటం
Published Sun, Dec 7 2014 1:21 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement