అభిమానం.. అపూర్వం
సాక్షి , గుంటూరు
ఆత్మీయ బంధువుకు అపూర్వ స్వాగతం లభించింది...అడుగడుగునా ప్రజాభిమానం వెల్లివిరిసింది...మహానేత రాజన్న తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను చూసి చిలకలూరిపేట వాసులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ సోదరి వచ్చిందంటూ ఆనందంతో కేరింతలు కొట్టారు. షర్మిల ప్రసంగానికి అనూస్య స్పందన లభించింది.
షర్మిల చిలకలూరిపేట వస్తున్నట్టు తెలియడంతో గ్రామాల్లోనూ, పట్టణంలోనూ ప్రజలు గంటలకొద్దీ ఎదురు చూశారు. ప్రచండ భానుడి ప్రతాపాన్ని సైతం లెక్కచేయకుండా జాతీయ రహదారిపై మధ్యాహ్నం నుంచే బారులు తీరారు. దీంతో చిలకలూరిపేట పట్టణం జనవాిహ నితో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనసందోహం కనిపించింది.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమానికి బస్సులో చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌కు చేరుకున్న షర్మిలను చూసిన ప్రజానీకం కేరింతలు కొట్టింది. తొలుత షర్మిల వున్న బస్సు తాతపూడి వద్దకు రాగానే నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌లు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. తాతపూడి రోడ్డు నుంచి బొప్పూడి ఆంజనేయస్వామి దేవాలయ సెంటర్, పురు షోత్తపట్నం అడ్డరోడ్డు సెంటర్‌లలో షర్మిలను చూసేందుకు మహిళలు బారులుతీరారు.
వారికి అభివాదం చేసుకుంటూ షర్మిల యాత్ర కళామందిర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మీ రాజన్న బిడ్డను...మీ జగనన్న సోదరిని అని అనడంతో ప్రజలు పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఈలలు, కేరింతలు, జై జగన్ నినాదాలతో చిలకలూరిపేట పట్టణం హోరెత్తెంది. రానున్న మున్సిపల్, జిల్లా, మండల పరిషత్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.
నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌లను అత్యధిక మెజారిటీలతో గెలిపించాలని షర్మిల కోరినప్పుడు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తు ఫ్యాను అంటూ సీలింగ్ ఫ్యాన్‌ను తిప్పుతూ షర్మిల సందడి చేశారు.
అనంతరం బస్సుపై నుంచి షర్మిల అందరికీ అభివాదం చేస్తూ చిలకలూరిపేట మండలం పసుమర్రు మీదుగా ప్రకాశం జిల్లా పర్చూరు బయలుదేరారు. అంతకు ముందు మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ దాది లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆలపించిన గీతాలు జన సందోహాన్ని అలరించాయి.
రాజన్న లేరని రాష్ట్రాన్ని విడదీశారు
నరసరావుపేట లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేరనే ధైర్యంతోనే రాష్ట్రాన్ని విడదీసి ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టి ఇబ్బందులపాలు చేశారని నరసరావుపేట పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్‌లో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆధ్వర్యంలో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే వారి ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఇవన్ని చేశారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్ ఉన్నప్పుడు అందరిలో ఒక ధైర్యం ఉండేదని, ఆయన మరణించిన తరువాత రాష్ట్రం అధోగతిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ అనుక్షణం బీద, బడుగు, బలహీనవర్గాల కోసం పరితపించేవారన్నారు. తండ్రి మాదిరిగానే జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిలలు ప్రజా పక్షాన నిలుస్తూ ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. 48 రోజుల్లో నాలుగు ఎన్నికలను పెట్టి వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనే దుర్మార్గ ఆలోచన చేశారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫ్యానుగాలికి ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోతాయన్నారు.