విభజనకు బాబే బాధ్యుడు
సాక్షి, ఒంగోలు : ‘‘రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే బాధ్యుడు.. ఆయన రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్ర విభజన జరిగింది. బాబును రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరు’’ అని ఒంగోలు వాసులు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో సాక్షి దినపత్రిక, టీవీ ఆధ్వర్యంలో శనివారం ‘ఎవరెటు? చర్చావేదిక జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు.
విభజనలో భాగస్వాములై సీమాంధ్ర నేతలు భాగస్వాములు కావద్దని సూచించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ, విద్య, ఉపాధి, జల, రాజధాని సమస్యల్ని ప్రస్తావించకుండా నిరంకుశంగా రాష్ట్ర విభజన ప్రకటన చేయడం వల్లే సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయని చెప్పారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ బషీర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల తరహాలో మిగిలిన పార్టీల ప్రజాప్రతినిధులు కూడా స్పీకర్ ఫార్మెట్‌లో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ అశాస్త్రీయమైన విభజన ప్రకియ ద్వారా అన్ని వర్గాలు, రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సీఎం మారినప్పుడల్లా 300 నుంచి 500 మెడికల్ సీట్లు తెలంగాణకు ఇచ్చేసి ఇక్కడ కోటా తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసోసియేషన్ కోశాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ సమైక్యత కోసం దీక్ష చేయడం మంచి పరిణామమనీ, ఉద్యమం కోసం ముందుండి దీక్షలు, త్యాగాలు చేసే వారిని తాము నెత్తిన పెట్టుకుంటామన్నారు. విద్యావేత్త డాక్టర్ పీహెచ్‌జీ కృష్ణంరాజు మాట్లాడుతూ ఐఐటీ, ఐఐఎం, ఇక్రిశాట్ తదితర సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయనీ, రాష్ట్ర విభజనతో యువత భవితను అంధకారంలోకి నెడతామంటే ఊరుకోబోమని స్పష్టంచేశారు.