ప్రజలకూ వెన్నుపోటు పొడుస్తారు: వైఎస్ జగన్ | Ys jagan mohan reddy slams chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రజలకూ వెన్నుపోటు పొడుస్తారు: వైఎస్ జగన్

Published Fri, Apr 4 2014 4:16 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

Ys jagan mohan reddy slams chandrababu Naidu

*    టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
*    పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు
*   రాష్ట్ర విభజనకు చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు సింగపూర్‌లా చేస్తానంటున్నారు
*   ఒక మనిషిని పొడిచేసి.. అతడి ఫొటోకూ తానే దండ వేస్తానన్నట్టుంది బాబు వైఖరి
*    మూడున్నర కోట్ల ఉద్యోగాలు, రైతురుణాల మాఫీ అంటూ బాబు  ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు
*    సీఎం కాగానే ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మారుస్తా
 
సాక్షి, టెక్కలి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు అబద్ధాల హామీలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ఒక మనిషిని పొడిచేసి.. తర్వాత ఆ మనిషి ఫొటోకు తానే దండవేస్తానంటూ పరుగెత్తుకుంటూ వెళ్లాడట ఒకడు. అలా ఉన్నాయి చంద్రబాబు మాటలు. ఆయనకు ఇదేమీ కొత్తకాదు.
 
 పిల్లనిచ్చిన సొంత మామ ఎన్.టి.రామారావునే వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కుని, ఇవాళ్టికీకూడా ఎన్నికలొచ్చిన ప్రతిసారీ అదే ఎన్టీఆర్ ఫొటో పెట్టి ఓట్లు అడుగుతాడు చంద్రబాబు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఆయన.. ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడవడని గ్యారంటీ లేదు’’ అని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి టెక్కలిలో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో మాట్లాడారు. ఇదే వేదికపై పార్టీ టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ను, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రెడ్డి శాంతిని ప్రకటించారు. ఈ సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఇంతకంటే దారుణం ఉండదు బాబూ..
 చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని మాయమాటలు చెబుతున్నారు. రైతుల రుణాలు రూ.1.27 లక్షల కోట్లు మాఫీ చేస్తామంటున్నారు. డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు మాఫీ చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆదాయమే రూ.1.25 లక్షల కోట్లు. మరి రూ.1.47 లక్షల కోట్లు ఎలా మాఫీ చేస్తారో తెలియాలి. ఇంటికో ఉద్యోగమంటున్నారు. స్వాతంత్య్రం తర్వాత మన రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగులు 20 లక్షల మంది మాత్రమే. నా వద్దకు కూడా చాలా మంది వచ్చి ‘రైతు రుణాలు మాఫీ చేస్తాం. ఇంటింటికీ రెండు ఉద్యోగాలిస్తామని చెప్పన్నా.. ఎన్నికల తర్వాత ఎవరు చూస్తారని’ అన్నారు. కానీ నేన లా చేయలేను. ఎందుకంటే చంద్రబాబుకు లేనిది.. నాకు దివంగత  మహానేత రాజశేఖరరెడ్డి ద్వారా వచ్చిందీ.. విశ్వసనీయతే. అదే విశ్వసనీయతతో నేనో మాట చెప్పాలనుకుంటున్నా.. చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఆయనకు తెలుసు.. ఈ ఎన్నికల తర్వాత తానుండడని, తన తెలుగుదేశం పార్టీ ఉండదని. అందుకే నోటికొచ్చిన హామీ ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు కంటే నేను పాతికేళ్లు చిన్నవాణ్ని. మరో 30 ఏళ్లు విశ్వసనీయ రాజకీయాలు చేయాల్సినవాడిని. అందుకే చెప్తున్నా.. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైన.. అదే ఘడియలో రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు, మరో ఐదు కార్యక్రమాలు చేయబోతున్నా.
 
 1. అమ్మ ఒడితో అక్కాచెల్లెళ్లకు భరోసా
 అక్కా చెల్లెమ్మల కోసం మొదటి సంతకం పెట్టబోతున్నా. ఇవాళ పూట గడవడానికి పనులకు పోవాల్సిన పరిస్థితి వాళ్లది. ఒక్క రోజు కూలికెళ్తే రూ.100-150 వస్తుంది. దాంతో మూడు రోజులు గడిచిపోతోంది. నాలుగో రోజుకు మళ్లీ పనికిపోవాల్సిందే. పని దొరక్కపోతే పస్తులుండాల్సిందే. దీంతో బడికి పంపాల్సిన తమ పిల్లల్ని కూడా పన్లోకి తీసుకెళ్తే మరో రూ.50 వస్తే మొత్తం కలిపి నాలుగైదు రోజులు గడిచిపోతుంది కదా అనుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. అలాంటి అక్కాచెల్లెళ్ల జీవితాన్ని మార్చేలా మొదటి సంతకం చేయబోతున్నా. ఇందుకు అక్కాచెల్లెళ్లు చేయాల్సింది తమ పిల్లలనుపనికి కాకుండా బడికి పంపడమే. వారిని డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు వంటి పెద్దపెద్ద చదువులు చదివించే బాధ్యత నాది. అలా బడికి పంపిన అక్కా చెల్లెళ్లకు ఒక బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.1000 నెలనెలా వారి బ్యాంకు ఖాతాలో వేసి ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నా. రేపు ఇదే పిల్లలు పెద్దపెద్ద ఉద్యోగాల్లో చేరి ముసలి వయసులో ఉన్న ఇదే అక్కా చె ల్లెళ్లకు ఆసరాగా నిలవాలన్నదే అమ్మ ఒడి ద్వారా నా ఆశ.
 
 2. పింఛను రూ.700 చేస్తా
 అవ్వా తాతల కోసం ఓ మంచి మనవడిలా రెండో సంతకం పెట్టబోతున్నా. ఇవాళ వయసు, శరీరం సహకరించకపోయినా.. అవ్వా తాతలు పన్లోకి పోతున్నారు. నేను చాలా గ్రామాల్లోకి వెళ్లి అవ్వాతాతల్ని ఆప్యాయంగా పలకరిస్తే.. ‘నాయనా. మీ నాయన పుణ్యంతో ఇస్తున్న రూ.200 పెన్షన్ ఒక పూట భోజనానికే సరిపోతోంది. మూడుపూటలా తినాలంటే పనికిపోవాలి కదా’ అంటున్నారు. అలాంటి అవ్వా తాతలకు భరోసా ఇస్తూ.. దివంగత మహానేత పైనుంచి చూసి గర్వపడేలా రూ.200 పెన్షన్‌ను రూ.700 చేస్తానని మాటిస్తున్నా.
 
 3. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
 మూడో సంతకం రైతన్నల కోసం. రైతులు పంటలు పండిస్తున్నా.. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర దొరక్క సతమతమవుతున్నారు. పండిన పంట అమ్ముకున్న రెండు మాసాలకే ధర రెండింతలవుతోంది. ఇక మీదట రైతన్నలు మద్దతు ధర కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదు. వారిలో భరోసా నింపేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా. మద్దతు ధరపై భరోసా ఇస్తా.
 
 4. డ్వాక్రా రుణాలు రద్దు
 నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసం పెట్టబోతున్నా. డ్వాక్రా అక్కాచెల్లెళ్లు తీసుకున్న రుణాలకు నెలకు రూ.2 వేలు చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీన వాయిదా కట్టకపోతే వడ్డ్డీ మీద వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. దీంతో తమ పిల్లల్ని కూడా పన్లోకి తీసుకెళ్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు జీవితంపై భరోసా ఇస్తున్నా. వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణం కిందా మీదా పడైనా తీర్చుతా.
 
 5. ఏ కార్డయినా 24 గంటల్లోనే..
 ఏ వార్డుకు, గ్రామానికి వెళ్లినా.. అన్నా.. మాకు ఇల్లు లేదు, మాకు రేషన్‌కార్డు లేదు, మాకు పెన్షన్ లేదంటూ చెప్తున్నారు. రానున్న సువర్ణయుగంలో ఏ కార్డు కావాలన్నా.. ఏ నాయకుడి చుట్టూ తిరగనక్కర్లేకుండా మీ గ్రామం, మీ వార్డులోనే ఒక ఆఫీసు పెడ్తా. అందులో ఓ కంప్యూటర్, రెటీనా మిషన్, ప్రింటర్, లామినేషన్ మిషన్ పెట్టి 24 గంటల్లో ఏ కార్డయినా అందించేలా ఐదో సంతకం పెట్టబోతున్నా.
 
 6. ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు..
 ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా.. ఇల్లు లేదు.. ఇప్పించండని కోరుతున్నారు. వైఎస్సార్ బతికున్నపుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే.. ఆయన హయాంలోనే ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టారు. ఇవాళ 2014లో ఉన్నాం. 2019లో ఏ గ్రామానికి వెళ్లి ఇల్లు లేని పేదవారెవరని అడిగితే.. ఏ ఒక్కరూ చెయ్యెత్తే పరిస్థితి లేకుండా ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తానని మాటిస్తున్నా.
 
 7. జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
 రాజశేఖరరెడ్డి కలల పథకం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ కార్డుంటే జేబులో రూ.2-3 లక్షలున్నట్టేనని ప్రతి పేదవాడూ గర్వంగా చెప్పుకునేవారు. ఆయన మరణం తర్వాత ఈ పథకం నుంచి 133 రోగాల్ని తొలగించారు. ఇందులో భాగమైన 104కు ఫోన్ చేస్తే తమకే ఏడు మాసాలుగా జీతాలివ్వలేదన్న సమాధానం వస్తోంది. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ గంటసేపటికైనా.. వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి. ఏదైనా గుండె జబ్బో.. యాక్సిడెంటో జరిగి పెద్ద ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడే రోజులివి. వైద్యానికి రూ.లక్షలు చెల్లించే స్థోమత లేక రూ.3, 4, 5 వడ్డీకి డబ్బులు తె చ్చి తమవారిని బతికించుకున్నా.. ఆ ఆనందం నిలవకుండా.. చేసిన అప్పు తీర్చడానికి జీవితాంతం కుటుంబమంతా ఊడిగం చేయాల్సిన పరిస్థితి. అయినా అప్పు తీరుతుందో.. లేదో తెలియని పరిస్థితి.
 
 ఆస్పత్రికి వెళ్లినా.. సరిగ్గా పట్టించుకోరు. ఏమని అడిగితే.. ప్రభుత్వం ఆస్పత్రులకు నిధులివ్వట్లేదని చెప్తున్నారు. హైదరాబాద్ వె ళ్లి వైద్యం చేయించుకోవాలంటున్నారు. చంద్రబాబు సోనియాగాంధీతో కుమ్మక్కై అడ్డగోలు విభజనకు సహకరించడంతో నీటి నష్టంతోపాటు, హైదరాబాద్ మనకు కాకుండా పోయింది. ప్రతి పేదవాడికీ ఆరోగ్యం హక్కుగా.. జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తా. హైదరాబాద్‌ను మించిన రాజధానిని నిర్మించి అందులో 20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని నిర్మించి, జిల్లా ఆస్పత్రులతో కలిపి ఓ యూనివర్సిటీగా మారుస్తా. ఇప్పటికీ చాలా చోట్ల ఆసుపత్రుల్లో వైద్యులు లేరని అంటున్నారు. ఆ పరిస్థితిని తప్పిస్తా. ఇక మీదట ఏ వైద్యమైనా డాక్టర్లు అందుబాటులో లేరన్న ప్రశ్న లేకుండా రొటేషన్ పద్ధతిన అందరు డాక్టర్లు జిల్లాల్లో పనిచేసేలా చేస్తా. దివంగత మహానేత గర్వపడేలా.. ఆయన కలల పథకం ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారుస్తా.
 
 8. కరెంటు కోతల్లేని రాష్ట్రం..
 గ్రామాల్లోకి వెళ్లి ఏ ఇంట్లో స్విచ్ ఆన్ చేసినా.. కరెంటు ఉంటుందో.. లేదో తె లియదు. రైతన్నలకు కరెంట్ పేరుకే ఏడు గంటలు. ఐదు గంటలు కూడా ఇవ్వని పరిస్థితి. అదికూడా పగటిపూట కొంత.. రాత్రి పూట కొంత. రాత్రిపూట స్టార్టర్ బటన్ ఆన్ చేసేటపుడు తేలో.. పామో.. కుట్టే పరిస్థితి రోజూ చూస్తున్నాం. 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. ఇవాళ మాటిస్తున్నా.. రైతన్నకు ఏడు గంటల విద్యుత్ పగటిపూటే అందిస్తా.
 
 9. బెల్టు షాపులే లేకుండా చేస్తా..
 పేదరికం పోవాలంటే.. ప్రతి కుటుంబంలో ఒకరు డాక్టరో.. ఇంజినీరో.. కలెక్టర్ లాంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. అయితే ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్‌షాపులు కళ్లముందే కనపడుతుండడంతో.. చదువుకున్నవాళ్లు మద్యానికి బానిసలవుతున్నారు. రేపు రానున్న సువర్ణయుగంలో ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేస్తా. ఒక్కో గ్రామం నుంచి పది మంది అక్కా చెల్లెళ్లను మహిళా పోలీసులుగా చేస్తా. నియోజకవర్గానికి ఒక్క దగ్గరే మద్యం ఉంటుంది. అక్కడ కూడా ధరలు షాక్ కొట్టేలా చేస్తా. ఏ త్రీస్టారో.. ఫైవ్ స్టార్ హోటళ్లకో వెళ్లి తాగే శ్రీమంతులు రోగాలొస్తే అట్నుంచటే.. ఆస్పత్రులకు పోయి వైద్యం చేయించుకోవాలి తప్ప.. పేదలు అనారోగ్యం పాలవకుండా చేస్తా.
 
 10. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భరోసా..
 నేను చంద్రబాబు నాయుడిలా అబద్ధాలు చెప్పను. కోట్ల ఉద్యోగాలిస్తానని మోసం చేయలేను. చదువుకున్న, చదువు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భరోసా ఇస్తా. గత నాలుగున్నరేళ్లుగా ఇంటిని వదిలి నేను ఎండనకా.. వాననకా.. రాత్రనకా.. పగలనకా.. పడ్డ కష్టం మీకు తెలుసు. అంతే కష్టపడి... నా తమ్ముడి ఉద్యోగం కోసం ఎంతగా తపిస్తానో.. అంతే స్థాయిలో ప్రతి చదువుకున్నవారికీ ఉద్యోగ భరోసా కల్పిస్తా.  సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు పేరాడ తిలక్, చింతాడ గణపతి, దువ్వాడ వాణి, సంపతిరావు రాఘవరావు, చింతాడ మంజు, కె.బాలకృష్ణ, జానకిరామయ్య, శ్రీనివాస పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 
ఎస్టీలుగా బోయ, వడ్డెర, మత్స్యకారులు
 బోయ, వడ్డెర, మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేసేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుపై చర్చించి, ప్రభుత్వానికి పంపనున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి టెక్కలి సభలో ప్రకటించారు. కళింగ వైశ్యుల్ని బీసీలో చేర్చే ప్రతిపాదనపై కూడా గతంలోనే హామీ ఇచ్చానని, కచ్చితంగా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈస్ట్‌కోస్ట్ థర్మల్ విద్యుత్ ప్లాం ట్‌ను రద్దు చేస్తానని గతంలో నరసన్నపేటలోనే మాటిచ్చానని, అదే మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన రెండో రోజే దానిపై సంతకం చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement