రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే: షర్మిల
శ్రీకాళహస్తి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్రం విడిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబేనని షర్మిల విమర్శించారు. అడ్డగోలుగా చేసిన రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీల పాపం ఉందని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో షర్మిల ధ్వజమెత్తారు. జగనన్న సీఎం అయితే తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఆరేళ్లలో 45లక్షల ఇళ్లు కట్టించిన ఘనత మహానేత వైఎస్‌ఆర్‌దని షర్మిల అన్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ ఒక్క రూపాయి పన్ను పెంచలేదని షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్ మరణానంతరం కాంగ్రెస్ ఆయన పథకాలకు తూట్లు పొడిచిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయిన తర్వాత వైఎస్‌ఆర్ పథకాలను అమలు చేస్తారన్నారు. రైతులకు, రాష్ట్రంలోని అనేక వర్గాలకు నష్టం కలుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజలాపై మోశారని షర్మిల మండిపడ్డారు.