ఉద్రిక్తతలు పెంచే వ్యాఖ్యలు సరికాదు: వైఎస్ జగన్
* కేసీఆర్‌కు జగన్ సూచన
* ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు
* చంద్రబాబు కూడా అండగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తతలు పెంచేలా నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతూ ఒకపక్క అన్నదమ్ముల్లా విడిపోదామని అంటున్న కేసీఆర్ మరోపక్క రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని తెలిపారు.
ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య సుహృద్భావ వాతావరణంలో విభజన ప్రక్రియ సాగాలని, లేనట్టయితే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని అన్నారు. ఉద్యోగులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థారుులో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల న్యాయపరమైన హక్కులకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. విభజన వల్ల తలెత్తిన ఉద్యోగుల సమస్యను సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబునాయుడు కూడా అర్థం చేసుకొని వారికి సంపూర్ణంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ జీతాలు, జీవితాల గురించి భయాందోళనలో ఉన్న ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్ పైనా ఉందన్నారు.
రాజ్యాంగం ప్రకారం జరిగే విభజన ప్రక్రియకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం, ఉమ్మడి రాజధానిలో పనిచేయాల్సిన ఉద్యోగుల మధ్య వాతావరణాన్ని కలుషితం చేయడం తీవ్రమైన అంశాలుగా జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలపై తాము మొదటినుంచీ హెచ్చరిస్తూనే ఉన్నామని, అరుునప్పటికీ ఈ అంశాలపై దృష్టి పెట్టకుండా అడ్డగోలుగా విభజన చేశారని తప్పుపట్టారు. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే వైఖరిని ఉపేక్షించడం తగదని జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.