చంద్రబాబును ఎందుకు క్షమించాలి?
హైదరాబాద్ : గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టాకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందాలు చేసుకుంటుంటే చంద్రబాబు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా.. కేంద్రంలో భాగస్వామి అయిన చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
రాష్ట్రానికి నీళ్లే తేలేని సీఎం అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఏం పట్టనట్లు చిదానందస్వామిలా, చంద్రబాబు స్వామిగారు టెక్నాలజీ, యాప్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కనబడని పాలన గురించి టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ప్రజలను మెప్పించే యత్నం చేస్తున్నారన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా గురించి కూడా కేంద్రం వద్ద రాజీపడ్డారన్నారు. ఎగువ రాష్ట్రాలు చుక్కనీరు రాకుండా దిగ్బంధనం చేసేలా జలాశయాలపై ప్రాజెక్టులు కట్టేస్తుంటే చంద్రబాబు నాయుడు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటున్నారన్నారు.
ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉన్న చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అనాధలా మార్చేశారని ఆమె మండిపడ్డారు. ఏపీ ప్రజలకు ఎందుకింత ఖర్మ?, చంద్రబాబు మీ పౌరుషం ఏమైంది? ఇప్పటికైనా కళ్లు తెరవాలని, లేదంటే చరిత్ర హీనులవుతారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రాజెక్టులు నిర్మాణంపై అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉందన్నారు.