హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహా ఒప్పందంగా అభివర్ణించడం సిగ్గు చేటు అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ...మహా ఒప్పందం కాదని, మహా మోసం అని అభవర్ణించారు. తెలంగాణ ప్రజల పరువును, ఆత్మగౌరవాన్ని మహారాష్ట్రలో తాకట్టు పెట్టి, కమీషన్ల కోసమే కేసీఆర్ ఎత్తు తగ్గించారని శివకుమార్ విమర్శించారు.
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం, మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 102 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించడం చారిత్రాత్మక ఒప్పందం కాదని, చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శివకుమార్ అన్నారు.