నీ దోపిడీపై దర్యాప్తునకు సిద్ధమేనా?: వాసిరెడ్డి పద్మ
* చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్న
* సీమాంధ్రను దోచుకున్నదంతా సింగపూర్‌లో దాచుకోలేదా?
* నీ 100 నేరాలతో బీజేపీ ‘ప్రజాకోర్టులో చార్జ్‌షీట్’ వేయలేదా?
* ఏలేరు కుంభకోణంపై విచారణను ఎందుకు అడ్డుకున్నావు?
* వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రను దోచుకుని, తెలంగాణను సర్వనాశనం చేసి.. దోచుకున్నదంతా సింగపూర్‌లో దాచుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికలొచ్చే సరికి ఏదేదో మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ‘మనీ ల్యాండరింగ్’ చేయడానికి కన్న తల్లి పేరుతోనే ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు అదే బుద్ధితో తెలుగు తల్లికి కూడా ద్రోహం చేసి రాష్ట్ర విభజనకు కారకుడయ్యారని విమర్శించారు. ‘‘కన్న తల్లిదండ్రుల పేరుతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన వ్యవహారంపై దర్యాప్తుకు చంద్రబాబు సిద్ధమేనా?’’ అని ఆమె సవాల్ విసిరారు. చంద్రబాబు తానెన్ని అక్రమాలకు పాల్పడినా విచారణలు ఎదుర్కోకుండా తప్పించుకోవడానికి ఏఏ పార్టీలను, వ్యక్తులను ఎలా ఉపయోగించుకున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్‌టీఆర్ స్వయంగా చెప్పారని గుర్తుచేస్తూ ఈ ఎన్నికల్లో చంద్రబాబును రాజకీయంగా ఉరికంబం ఎక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై పలు ప్రశ్నలు సంధిస్తూ ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనకు ఏ మాత్రం నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
* చంద్రబాబూ... నీ తొమ్మిదేళ్ల పరిపాలనలో నువ్వు ఎన్ని అక్రమాలకు పాల్పడినా సీబీఐ, ఈడీ, ఆర్‌ఓసీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఏసీబీ విచారణలను ఎలా తప్పించుకున్నావు? నిన్ను జైల్లో ఎందుకు పెట్టలేదు? ఇందుకోసం ఏ పార్టీలను ఎలా ఉపయోగించుకున్నావు?
* 1998 జనవరిలో బీజేపీ నిన్ను శిశుపాలునితో పోలుస్తూ.. నీ ‘100 ఘోరాలు-నేరాలను’, ‘ప్రజాకోర్టులో బీజేపీ చార్జిషీట్’ అనే పేరుతో ప్రచురించలేదా? వెంటనే నువ్వు బీజేపీ కాళ్ల మీద పడి ఒప్పందం కుదుర్చుకోలేదా?
* సీమాంధ్రను దోచుకున్నది, తెలంగాణను సర్వనాశనం చేసిందీ నువ్వే కదా? అలా దోచుకున్నది సింగపూర్‌లో దాచింది నిజం కాదా? నీకు సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి?
* హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానం లేదు గానీ, ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు విమానం నడిపేలా ఏర్పాటు చేశానని 1999 టీడీపీ ఎన్నికల ప్రణాళికలో నువ్వే రాసుకున్నావు. (టీడీపీ 1999 ఎన్నికల ప్రణాళిక - 13వ పేజీ, 17వ లైను) అలా సింగపూర్‌కు రోజూ నువ్వు అధికారం లో ఉన్న 9 ఏళ్లలో తరలించిన నగదు, బంగారం ఎంత? వజ్రా లు ఎన్ని బాబూ..? మీ కుటుంబ సభ్యులు దిగేసుకుంటున్న వజ్ర వైడూర్యాలు, రత్నాలు, కెంపులు ఎవడబ్బ సొమ్ము?
* కోలా కృష్ణమోహన్, దొంగనోట్ల రామకృష్ణగౌడ్, దేశంలోనే అతి పెద్ద స్టాంపుల కుంభకోణంలో నిందితుడు తెల్గీ, హసన్‌అలీలతో నీకున్న సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాల మీద విచారణకు సిద్ధమేనా? మకావో దీవులకు మీరు ఏకంగా ఐదుసార్లు డీల్స్ (ఒప్పందాల) కోసం వెళ్లిన మాట నిజం కాదా?
* సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, నామా నాగేశ్వరరావు, మురళీమోహన్.. ఇలా ఓ పది మందిని వేల కోట్లకు పడగలెత్తించడం పరిపాలన అవుతుందా బాబూ? వారి మీద, నీమీద విచారణకు సిద్ధమేనా?
* 1994-2004 మధ్య కాలంలో నువ్వు, నీ కుటుంబ సభ్యులు చేసిన విదేశీ పర్యటనలన్నింటిపైనా విచారణకు నువ్వు సిద్ధమేనా? ఈ 20 ఏళ్లలో నీతో సహా నీ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు, వాటి మీద స్టాంపింగ్‌లు, యధాతథంగా కాగితాలు చించి వేయకుండా బయట పెడతావా?
* బాలాయిపల్లె భూముల కొనుగోలుపై విచారణకు నువ్వు సిద్ధమేనా? స్వయానా నీ తండ్రికే నువ్వు, ఆయన ఇచ్చిన పొలాన్నే అమ్మేసినట్లు చూపావు కదా? మీ నాన్న పేరు మీద నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ల వ్యవహారాలపై దర్యాప్తునకు నువ్వు సిద్ధమేనా?
* కన్నతల్లిని కూడా మనీ ల్యాండరింగ్‌కు వాడుకున్నావు కదా? చంద్రగిరిలోని మీ రెండున్నర ఎకరాల నుంచి కోట్ల రూపాయల పంట పండినట్లు లెక్కల్లో చూపించావు. నీ పొలంలో ఏమైనా రూ. 500, 1,000 నోట్ల కట్టలు పండే చెట్లను వేశావా? తల్లికి ద్రోహం చేసిన నువ్వు అదే బుద్ధితో రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి తెలుగుతల్లికి కూడా ద్రోహం చేసింది నిజం కాదా?
* ఏలేరు కుంభకోణంపై విచారణను ఎందుకు అడ్డుకున్నావు? విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల రైతుల సొమ్మును జాయింట్ అకౌంట్లలో జమచేయించుకుని మింగేసిన చరిత్ర నీది కాదా?
* అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయొద్దని విప్ జారీ చేసినందుకు నీకు ముట్టిందెంత? చిన్న వర్తకుల జీవితాలతో చెలగాటమాడే విదేశీ పెట్టుబడుల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటానికి నీ పార్టీ ఎంపీలు ముగ్గురిని గైర్హాజరు చేయించినందుకు ముట్టిందెంత? రామచంద్రాపురం, నరసాపురం ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినందుకు కాంగ్రెస్ నీకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బెంత? ప్రతి సారీ ఢిల్లీ వెళ్లినప్పుడు సెక్యూరిటీ కళ్లు గప్పి ఎక్కడికి మాయమవుతున్నావు? ఎవరిని కలుస్తున్నావు?
* రాష్ట్ర విభజన విషయంలో సోనియాగాంధీ ముందు నడుస్తున్న గొర్రె అయితే, ఆమె వెనుక గొర్రెలా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని యథాతథంగా అనుసరించారంటే ఇందులో మర్మం ఏమిటి? చట్టసభలు అన్నింటిలోనూ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ మందలో ఓ వీర విధేయమైన గొర్రెలా మీరు నడిచింది ప్రజలు చూడలేదా?